close
ఫిర్యాదులకూ ఓ లెక్క!

జిల్లాల్లో నెలకు 20 వేలకు పైగా విజ్ఞప్తులు
పర్యవేక్షణకు రెవెన్యూ శాఖలో ఆన్‌లైన్‌ విధానానికి కసరత్తు
విజయారెడ్డి హత్యతో వినతులపై ప్రత్యేక చర్యలు

అపరిష్కృతం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలానికి చెందిన ఓ రైతు ఆరు నెలల క్రితం పాసుపుస్తకం అందలేదంటూ తహసీల్దారుకు దరఖాస్తు పెట్టుకున్నారు. తన భూమి సర్వే నంబరు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదని వివరించారు.  ఇప్పటికీ సమస్య పరిష్కారంకాక కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి కేసులు ఎన్నో... ఎన్నెన్నో.

ఇదో పరిష్కార యోచన: రైతులు సమర్పించే దరఖాస్తులను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తాం? ఒక వేళ సాధ్యం కాకపోతే కారణం ఏమిటి? దానికోసం ఎవరిని కలవాలి అనే విషయం సంబంధిత అధికారులు స్పష్టంగా రైతులకు వివరణ ఇవ్వాలి. అవసరమైతే ఒక మెమో రూపంలో తెలపాలి. దీనివల్ల అపోహలకు అవకాశం ఉండదు.

- ఇటీవల ‘ఈనాడు-ఈటీవీ’తో రెవెన్యూశాఖ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజల వినతులకు, దరఖాస్తులకు జవాబుదారీ విధానం కోసం ప్రభుత్వం పరిపరి విధాల ఆలోచిస్తోంది. భూ సమస్యపై వచ్చిన దరఖాస్తు పరిష్కారం కాకపోతే సంబంధిత రైతుకు ఒక మెమో రూపంలో సమాచారం ఇవ్వాలని యోచిస్తున్నట్టే సమగ్ర ఆన్‌లైన్‌ విధానంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదు... విజ్ఞాపనకు ఇకపై ఒక లెక్క ఉండబోతోంది.

దాని పరిష్కారానికి కూడా నిర్దిష్ట గడువు ఉంటుంది. దీనికోసం రెవెన్యూ శాఖ ఒక మానిటరింగ్‌ విధానాన్ని ఏర్పాటు చేయబోతోంది. పక్షం రోజుల క్రితం అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దారు విజయారెడ్డి హత్యతో క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ సమగ్రమైన ఓ విధానాన్ని తీసుకురానుంది. రాష్ట్రంలో ఎక్కడైనా సామాన్యులు, రైతులు ఎవరైనా ఫిర్యాదులు చేస్తే వాటిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఆన్‌లైన్‌ విధానాన్ని రూపొందిస్తున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో నెలకు 20 వేలకు పైగా వినతులు, ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిలో ముప్పావుభాగం భూములకు సంబంధించినవే. ఇలా వచ్చే దరఖాస్తుల పరిష్కారానికి కలెక్టర్లు ఆన్‌లైన్‌ మానిటరింగ్‌ విధానం ఏర్పాటు చేసుకున్నప్పటికీ దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉంటున్నాయి.

కొన్నిచోట్ల సిబ్బంది కావాలనే తిప్పించుకుంటున్నారు
సమస్యలపై ప్రజలు ఇచ్చే దరఖాస్తులు, ఫిర్యాదుల పరిష్కారంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించే యంత్రాంగం లేకపోవడంతో పట్టింపు ఉండటం లేదని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆయా సమస్యల తీవ్రతను బట్టి జిల్లా స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా అనేది నిర్ణయించడానికి సమయం పడుతోంది. కొన్ని మండలాల్లో కావాలనే సిబ్బంది తిప్పించుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. వీటి నుంచి బయటపడేందుకు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక పర్యవేక్షణ వ్యవస్థ అవసరం. అధికారులకు అందే దరఖాస్తులను స్కాన్‌ చేసి ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తే అన్ని స్థాయుల్లో అధికారులు సమీక్షించవచ్చు. పరిష్కారానికి ఏ స్థాయిలోనైనా నిర్లక్ష్యం చూపితే చర్యలు తీసుకోవచ్చు. త్వరలో ఆన్‌లైన్‌ వ్యవస్థను లేదా ఒక యాప్‌ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.