close
స్పీకర్‌ నిష్పాక్షికంగా ఉండాలి

  సభాపతి సంతృప్తి చెందే అంశం న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుంది
  రాజకీయ పార్టీలు బేరసారాల్లో మునిగిపోతున్నాయి
  ప్రజలకు సుస్థిరమైన ప్రభుత్వాలు దూరమవుతున్నాయి
  పదో షెడ్యూల్‌లో నిర్దిష్ట కోణాల్ని బలోపేతం చేయాలి
  కర్ణాటక ఎమ్మెల్యేల అనర్హత కేసులో జస్టిస్‌ ఎన్‌వీ రమణ ధర్మాసనం వ్యాఖ్యలు
ఈనాడు - దిల్లీ

పార్టీ ఫిరాయింపులు పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని నిర్దిష్ట అంశాలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. అప్పుడే అప్రజాస్వామికమైన చర్యలను నిలువరించడం, నిరోధించడం వీలవుతుందని పేర్కొంది. స్పీకర్‌ విధులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. స్పీకర్‌ రాజ్యాంగ ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించే ధోరణి పెరిగిపోతోందని పేర్కొంది. కర్ణాటక శాసనసభ్యులపై అనర్హత వేటు కేసుకు సంబంధించి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ కృష్ణ మురారీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును జస్టిస్‌ రమణ రాశారు. ఫిరాయింపుల వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో తీర్పులో ఆయన పేర్కొన్న అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సభ్యులకు సంబంధించి తీసుకునే నిర్ణయంపై స్పీకర్‌ సంతృప్తి కూడా న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందన్నారు. తీర్పులో జస్టిస్‌ రమణ చేసిన మరికొన్ని వ్యాఖ్యలు...

రాజ్యాంగ విధుల్లో ఉన్నవారు పరిస్థితులకు ఊగిసలాడకూడదు
* రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ప్రధాన ఉద్దేశం ప్రమాదకరమైన ఫిరాయింపులను నిరోధించడమే. పదవులిస్తామనో, ఇతరత్రా ప్రలోభాలుపెట్టో సభ్యులను పార్టీలు ఫిరాయించేలా చేయడం ప్రజాస్వామ్య పునాదులకు ప్రమాదకరం అన్న ఉద్దేశంతో నిర్దిష్ట నిబంధనలు తీసుకొచ్చారు. 91వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్‌ 71 (1బి), 164 (1బి), 361బి కింద పొందుపరిచిన నిబంధనల ప్రకారం... ఫిరాయింపుల కారణంగా స్పీకర్‌ చేత అనర్హత వేటుకు గురైన సభ్యుడు సదరు సభ కాలపరిమితి ముగిసేంతవరకు, లేదంటే సభకు తిరిగి ఎన్నికయ్యేంతవరకు... ఇందులో ఏది ముందయితే అంతవరకు మంత్రి పదవులు, లాభదాయక పదవులు చేపట్టడం చెల్లదు.
* పదో షెడ్యూల్‌ కింద స్పీకర్‌ జారీచేసిన ఆదేశాలు... దురుద్దేశపూరితం (మాలఫైడ్‌), వక్రపూరితం (పర్వెర్సిటీ), రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం, సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ఉంటే న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయని ఇదివరకు రాజ్యాంగ ధర్మాసనం ‘కిహోటో హొల్లోహన్‌’ తీర్పులో చెప్పింది.
* నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్పీకర్‌- రాజ్యాంగ విధులకు వ్యతిరేకంగా వ్యవహరించే ధోరణి ఇటీవలి కాలంలో పెరిగిపోతోంది. బేరసారాలు, అవినీతి అంశాలు పార్టీ ఫిరాయింపు వ్యవహారాలతో ముడిపడిపోయాయి. పదవీ ప్రలోభం కారణంగానో, ఇతర తప్పుడు కారణాలతోనో విధేయతను మార్చుకోవడం తగ్గడంలేదు. ఫలితంగా ప్రజలకు స్థిరమైన ప్రభుత్వం అందుబాటులో లేకుండా పోతోంది.
* రాజ్యాంగ విధులు నిర్వర్తించేవారు రాజకీయ పరిస్థితులు, ఒత్తిళ్లకు ఊగిసలాడకూడదు.

విలువల్ని ప్రతిరోజూ ప్రతిఫలింపజేయాలి

రాజ్యాంగంలోని నిబంధనలను అమలు చేస్తామని ప్రమాణం చేస్తే సరిపోదు. ఆ విలువలను ప్రతిరోజూ విధి నిర్వహణలో ప్రతిఫలింపజేయాలి.
* స్పీకర్‌ నిష్పాక్షికంగా ఉండాలి. సభా నిర్వహణలో, తనముందుకొచ్చిన పిటిషన్లపై నిర్ణయం తీసుకొనేటప్పుడు స్పీకర్‌ స్వతంత్రంగా వ్యవహరించాలి.
* నిష్పాక్షికంగా ఉండాల్సిన స్పీకర్‌ రాజ్యాంగ ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించే ధోరణి పెరిగిపోతోంది. రాజకీయ పార్టీలు బేరసారాలు, అవినీతి చర్యల్లో మునిగిపోతున్నాయి. ప్రజలకు సుస్థిరమైన ప్రభుత్వాలు దూరమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పదో షెడ్యూల్‌లోని కొన్ని నిర్దిష్ట కోణాలను బలోపేతం చేయాల్సిన అంశం గురించి పార్లమెంటు పునరాలోచించాల్సి ఉంది.
* ఫిరాయింపు అన్నది రాజ్యాంగపరమైన తప్పు కాబట్టి ఇలాంటి వారికి తీవ్రమైన శిక్షలు విధించాలని ప్రతివాదుల తరఫు న్యాయవాది కోరారు. కోర్టు అలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోలేదు. అలాంటి తీవ్రమైన చర్యలు వాస్తవంగా అసంతృప్తి వ్యక్తంచేసే వారిపట్ల ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
* పదో షెడ్యూల్‌ కింద స్పీకర్‌ తన అధికారాలను ప్రయోగించేటప్పుడు అనర్హత వేటు ఎంత కాలం అమల్లో ఉంటుందో చెప్పడం గాని, ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించడం గానీ చేయకూడదు. రాజ్యాంగ నిబంధనలను అమలుచేసే సమయంలో రాజ్యాంగ నైతికత స్థానంలో రాజకీయ నైతికతను చేర్చకూడదు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.