
రివ్యూ పిటిషన్ల కొట్టివేత
వాదనల్లో పస లేదన్న సుప్రీంకోర్టు
చౌకీదార్ వ్యాఖ్యల మీద రాహుల్‌పై కోర్టు ధిక్కరణ విచారణకూ ముగింపు
ఇప్పటికే క్షమాపణలు చెప్పడంతో తదుపరి చర్యల నిలిపివేత
ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్య
ఈనాడు, దిల్లీ
రఫేల్ ఒప్పందంపై దర్యాప్తునకు నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ కేసులోని వాదనలు ఎఫ్ఐఆర్ నమోదుకు తగ్గట్లు ఉన్నాయని భావించడంలేదని పేర్కొంది. తద్వారా నరేంద్రమోదీ సర్కారుకు క్లీన్చిట్ ఇచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు తీర్పు చెప్పింది. భారత ప్రభుత్వం, ఫ్రెంచ్ కంపెనీ దసో ఏవియేషన్ మధ్య 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు జరిగిన రూ.58,000 కోట్ల ఒప్పందంలో అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలున్నందున దానిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఇదివరకు దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు 2018 డిసెంబర్ 14న కొట్టేసింది. నిర్ణాయక ప్రక్రియలో తప్పులు జరిగినట్లు తమకు ఎక్కడా అనుమానాలు రాలేదని ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇచ్చింది. కొన్ని అసంపూర్ణమైన విషయాల ఆధారంగా ఇచ్చిన ఆ తీర్పును సమీక్షించాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్‌సిన్హా, అరుణ్‌శౌరి రివ్యూ పిటిషన్లను దాఖలు చేశారు.
ఎఫ్ఐఆర్ నమోదు అవసరం లేదు
ఎవరి సంతకం లేకుండా కోర్టుకు సీల్డు కవర్లో సమర్పించిన అవాస్తవిక అంశాలను పరిగణనలోకి తీసుకొని కోర్టు తీర్పు ఇచ్చిందని, పత్రికల్లో తర్వాత వెలుగుచూసిన వివిధ వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని తీర్పును సమీక్షిస్తూ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని పిటిషనర్లు చేసిన వాదనలను కోర్టు పరిగణించలేదు. ‘‘రివ్యూ పిటిషన్లలో ఎలాంటి పస (మెరిట్) లేదని మాకనిపిస్తోంది’’ అని పేర్కొంది. ఈ కేసులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ ఎస్కే కౌల్ సంయుక్త తీర్పు ఇచ్చారు. ఇద్దరి తరఫున జస్టిస్ కౌల్ తీర్పు చదువుతూ- లలితకుమారి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశానుసారం సాధారణంగా ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అన్నారు. ఈ కేసులో కోర్టు ఇప్పటికే అన్ని విషయాలను కూలంకషంగా చర్చించినందున ఇందులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం లేదన్నారు. సహచర న్యాయమూర్తుల అభిప్రాయాలతో ఏకీభవిస్తూనే జస్టిస్ కేఎం జోసెఫ్ విడిగా తీర్పు రాశారు. ఇలాంటి విషయాల్లో న్యాయ సమీక్షకు పెద్దగా అవకాశాలు ఉండవని పేర్కొన్నారు.
సీబీఐకి ఈ తీర్పు
అడ్డంకి కాదు: జస్టిస్ జోసెఫ్
రఫేల్ ఒప్పందంపై అవినీతి ఆరోపణలు చేస్తూ అందిన ఫిర్యాదుపై చట్టబద్ధంగా ముందుకెళ్లడానికి సీబీఐకి సుప్రీంకోర్టు తీర్పు ఏమాత్రం అడ్డంకి కాదని జస్టిస్ జోసెఫ్ పేర్కొన్నారు. అయితే అది అవినీతి నిరోధక చట్టం ప్రకారం ముందస్తు అనుమతులు పొందడంపై ఆధారపడి ఉంటుందని తాను రాసిన ప్రత్యేక తీర్పులో ఆయన అభిప్రాయపడ్డారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు విచారించదగినవే (కాగ్నిజబుల్) అనే దానిపై ఎలాంటి వివాదం లేదన్నారు. ‘‘కేసులో పిటిషనర్లు ప్రాథమిక విచారణ జరిపించమని కోరలేదు. సెక్షన్ 17-ఎ కింద ముందస్తు అనుమతులు ఇప్పించాలని పిటిషన్లో ఎక్కడా అడగలేదు. అందువల్ల- ఎఫ్ఐఆర్ దాఖలు చేయమని కోర్టు ఆదేశించినా ఏమీ ప్రయోజనం ఉండదు. ప్రాథమిక విచారణకు ఆదేశించి చిన్నపాటి ఉపశమనం కలిగించాలనుకున్నా సెక్షన్ 17-ఎ అడ్డంకి కారణంగా సాధ్యం కాదు. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా ప్రజాసేవకుడికి (పబ్లిక్సర్వెంట్)కి వ్యతిరేకంగా దర్యాప్తు/ విచారణ ప్రారంభించడానికి వీల్లేదు.’’ అని చెప్పారు. ఈ అభిప్రాయాలు మినహాయించి తీర్పుతో ఏకీభవించారు.
రాజకీయ వివాదాల్లోకి లాగకండి
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి వ్యతిరేకంగా దాఖలైన న్యాయస్థాన ధిక్కరణ కేసును కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. చౌకీదార్ చోర్‌హై అంటూ ప్రధానమంత్రిని సుప్రీంకోర్టు అన్నట్లుగా రాహుల్ మాట్లాడడం కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భాజపా ఎంపీ మీనాక్షీ లేఖి దాఖలు చేసిన ఈ పిటిషన్లో తదుపరి చర్యల్ని ధర్మాసనం నిలిపేసింది. రాహుల్ చెప్పిన భేషరతు క్షమాపణలను పరిగణనలోకి తీసుకొని కేసు విచారణను ముగించింది. ‘‘రాజకీయ వివాదాల్లోకి కోర్టులను లాగకూడదు’’ అని ధర్మాసనం తరఫున తీర్పు రాసిన జస్టిస్ ఎస్కే కౌల్ హెచ్చరించారు. ఇలాంటి విషయాల్లో ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలని, వ్యాఖ్యలు చేసే ముందు వాస్తవాలు సరి చూసుకోకపోవడం దురదృష్టకరమని, రాజకీయ వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు ఆపాదించే విషయంలో సంయమనం పాటించి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. రఫేల్ రివ్యూ పిటిషన్లతోపాటే న్యాయస్థానం ఈ ధిక్కరణ పిటిషన్‌నూ విచారించింది. ముఖ్యమైన రాజకీయ పదవుల్లో ఉన్నవారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలంది.
ఇదీ వివాదం... దేశ ప్రజలకు కాపలాదారు (చౌకీదార్)గా మోదీ చెప్పుకొంటూ రఫేల్ విమానాల విషయంలో మాత్రం ఒక సంస్థకు అనుకూలంగా వ్యవహరించి.. అంచనాలను మూడు రెట్లు పెంచారని, కాపలాదారుడే దొంగ అయ్యారని (చౌకీదార్ చోర్ హై) ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ విమర్శించారు. చౌకీదార్ చోర్ హై అని సుప్రీంకోర్టు కూడా చెప్పిందంటూ ప్రధానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాహుల్ సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించి మాట్లాడుతున్నారని మీనాక్షీలేఖి కోర్టు ధిక్కరణ కేసు దాఖలుచేశారు. |
దురుద్దేశ ప్రచారానికి సరైన సమాధానం రఫేల్ విషయంలో దురుద్దేశపూరిత, నిరాధార ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీలకు, నేతలకు సుప్రీంకోర్టు తీర్పు సరైన సమాధానం చెప్పింది. దేశ ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమని భావించే కాంగ్రెస్ నేతలు ఈ నేపథ్యంలో క్షమాపణలు చెప్పాల్సిందే. నరేంద్రమోదీ సర్కారు పారదర్శకంగా వ్యవహరిస్తూ, అవినీతికి దూరంగా ఉందన్న విషయాన్ని ఈ తీర్పు పునరుద్ఘాటించినట్లయింది. అత్యవసరం రీత్యా రఫేల్ విమానాలను కొనాల్సి వచ్చింది. ఏ పార్టీకి చెందిన ప్రధాని అయినా ఒక వ్యక్తికాదు. వ్యవస్థ. ఆయనపై వేసిన నిందలు.. ప్రజలనూ బాధిస్తాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ |
రక్షణ కొనుగోళ్లపై సానుకూల ప్రభావం ‘‘రఫేల్ ఒప్పందంపై వచ్చిన తీర్పు.. రక్షణ సంబంధిత కొనుగోళ్లపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. సైనిక బలగాలకు ఇదెంతో మంచిది.’ - బి.ఎస్.ధనోవా, భారత వాయుసేన విశ్రాంత అధిపతి |
దర్యాప్తు వేగిరం చేయండి రఫేల్ కుంభకోణంపై దర్యాప్తు కోసం తలుపులు తెరిచేలా జస్టిస్ జోసెఫ్ తీర్పు ఉంది. దీనిపై సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు జరగాలి. జేపీసీని కూడా తప్పనిసరిగా నియమించాలి. - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత |
సమగ్ర దర్యాప్తునకు అవకాశం కేసులో సమగ్ర దర్యాప్తు జరిపించడానికి తాజా తీర్పులోని 86వ పేరా అవకాశం కల్పిస్తోంది. ఆర్టికల్ 32 ప్రకారం కోర్టు న్యాయపరిధి పరిమితంగానే ఉంటుందన్న కాంగ్రెస్ వాదనను సుప్రీంకోర్టు తాజా తీర్పు సమర్థించింది. ఇలాంటి కేసులను సంబంధిత సంస్థలు దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు తీర్పు అడ్డంకి కాదని 86వ పేరాలో ఉంది. సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) చేత దర్యాప్తు జరిపిస్తేనే నిజానిజాలు బయటికొస్తాయి.’’ - రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా, జైవీర్షెర్గిల్, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు |
ముఖ్యాంశాలు
దేవతార్చన

- ‘రూలర్’ కొత్త ట్రైలర్ చూశారా
- అలా అయితే విసుగొచ్చేస్తుందట!
- ‘కబీర్‌సింగ్’ సీన్లుఇబ్బంది పెట్టాయని తెలుసు!
- నా జీవితంలో గొప్ప విషయమిదే: రాహుల్ సిప్లిగంజ్
- రూ.3.5 కోట్లు ఫ్రిడ్జ్‌లో పెట్టి..!
- గ్లూటెన్ ఉంటే ఏంటి?
- బాలయ్య సినిమాలో విలన్‌గా శ్రీకాంత్..?
- ఈగల్ 2.0 రోబో టీచరమ్మ!
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా