close
ద్వితీయం కాదు.. అద్వితీయం

భారత సమాఖ్య వ్యవస్థకు ప్రతిబింబం రాజ్యసభ
రెండోశ్రేణి సభగా మార్చేందుకు ప్రయత్నించొద్దు
 ప్రశ్నించడానికి, స్తంభింపజేయడానికి  మధ్య అంతరం చూపాలి
250వ సమావేశంలో ప్రధాని మోదీ

సభ నడిపే సమయంలో మీకు (వెంకయ్యనాయుడుకు) పెద్ద ఇబ్బందులు రాకూడదని కోరుకుంటున్నాం. మీ నిర్ణయాలను సభ్యులు పాటించాలని, మీరు కోరుకున్న రీతిలో సభ నడిచేందుకు మీతో కలిసి పనిచేయడానికి ప్రయత్నిస్తామని 250వ సమావేశం ప్రారంభం సందర్భంగా అందరం సంకల్పం తీసుకుంటున్నాం.

రాజ్యసభ ‘వెల్‌’లోకి వెళ్లకూడదని ఎన్సీపీ, బీజేడీలు నిర్ణయించుకున్నాయి. ఆ తర్వాత ఒక్కసారి కూడా ఉల్లంఘించలేదు. ఈ నిబంధన అనుసరించిన తర్వాతా అవి రాజకీయంగా ఏమీ నష్టపోలేదన్న పాఠాన్ని అన్ని పార్టీలు నేర్చుకోవాలి. రాజకీయంగా ఎలాంటి నష్టం చేకూర్చని సత్ప్రవర్తనను వాటినుంచి మనమెందుకు నేర్చుకోకూడదు? ఆ రెండు పార్టీలకు ధన్యవాదాలు చెప్పాలి.

- ప్రధాని నరేంద్రమోదీ 

ఈనాడు, దిల్లీ: అజరామరమైన రాజ్యసభ.. భారత సమాఖ్య వ్యవస్థకు ఆత్మలాంటిదని, భిన్నత్వంలో ఏకత్వం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఇది రెండో సభే తప్పితే ఎప్పటికీ రెండోశ్రేణి సభ కాదని స్పష్టం చేశారు. ‘‘మనది భిన్నత్వంతో నిండిన సమాఖ్య వ్యవస్థ. అయినా మనం జాతీయ దృష్టి కోణం నుంచి మళ్లకూడదు.  అదే సమయంలో రాష్ట్రాల హితాన్నీ చాలా సున్నితంగా సమతౌల్యం చేసుకుంటూ ముందుకెళ్లాలి. ఆ పని అందరికంటే బాగా చేసే వేదిక రాజ్యసభ’’ అని వ్యాఖ్యానించారు. సోమవారం రాజ్యసభ 250వ సమావేశం ప్రారంభమయింది. ఈ సందర్భంగా పెద్దల సభలో సాయంత్రం జరిగిన ప్రత్యేక చర్చలో ప్రధాని మాట్లాడారు. అంతకు ముందు పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా విలేకర్లతోనూ మాట్లాడారు.

కాలానుగుణంగా మారిన పెద్దలసభ
‘‘కాలానుగుణంగా రాజ్యసభ ముందుకెళ్లింది. ఎగువ సభ దీర్ఘ దృష్టితో చూడగలుగుతుంది. రెండు సభల సేవలను ఎవ్వరూ మరువలేరు. విభిన్న రంగాలకు చెందినవారి అనుభవసారం రాజ్యసభ ద్వారా భారతీయ రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ విధానాల రూపకల్పనకు అందుతోంది. శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, కళాకారులు, రచయితలు ఎన్నికల్లో నెగ్గి పార్లమెంటుకు రావడం చాలా కష్టమవుతుంది. రాజ్యసభ ద్వారా వారంతా తమవంతు సేవలు అందించగలుగుతున్నారు. అందుకు ప్రబల ఉదాహరణ బాబాసాహెబ్‌ అంబేడ్కరే. ఆయన ఏదో కారణంగా లోక్‌సభలో అడుగుపెట్టలేకపోయారు. రాజ్యసభ ద్వారా ఆయన అందించిన సేవల వల్ల దేశానికి ఎంతో మేలు జరిగింది.

ప్రభుత్వంలో కూర్చున్నవారు సరైన దిశలో నడిచేలా దారి చూపేందుకు ఈ సభ కఠోరంగా పనిచేసింది. ముమ్మారు తలాక్‌పై నిషేధం విధించే బిల్లు ఈ సభలో ఆగిపోతుందని అందరూ అనుకున్నా, ఇక్కడి సభ్యులు పరిపక్వతతో ఆ బిల్లును ఆమోదించి, మహిళా సాధికారతకు గొప్ప చేయూతనిచ్చారు. మన దేశంలో రిజర్వేషన్ల విషయంలో ప్రతిసారీ ఎంతో సంఘర్షణ జరిగింది. ఇదే సభ ఎలాంటి అలజడి లేకుండా ఉన్నత వర్గాల్లోని పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించింది.

అఖండతకు బీజం వేసి దిశానిర్దేశం
ఆర్టికల్‌ 370ని, 35-ఎని రద్దుచేసి, అఖండతకు ఇదే సభ బీజం వేసి సరికొత్త దిశా నిర్దేశం చేసింది. రాజ్యాంగంలో 370 ఆర్టికల్‌ను పెట్టింది ఎన్‌.గోపాలస్వామి అయ్యంగార్‌. ఆయనే ఈ సభ తొలి నాయకుడు. అదే సభ ఆ ఆర్టికల్‌ను రద్దు చేయడం చరిత్రాత్మకం. దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యర్థులు కాదు, భాగస్వాములని రాజ్యసభ నిరూపిస్తుంది. రాష్ట్రాభివృద్ధిని విస్మరిస్తే దేశాభివృద్ధి వీలుకాదన్న విషయాన్ని ఈ సభ ప్రతిబింబిస్తుంది. రాష్ట్రాల ఆకాంక్షలు, అనుభవాలు, రోజువారీ ఇబ్బందులను స్పష్టంగా ప్రభుత్వం ముందుకు తెచ్చే ఏకైక వ్యవస్థ రాజ్యసభే.

వాజ్‌పేయీ మాటలు ఆదర్శం
2003లో ఈ సభ 200వ సమావేశం జరిగినప్పుడు ఎన్డీయే ప్రభుత్వం ఉంది. అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయీ మాట్లాడుతూ ఈ ద్వితీయ సభను ద్వితీయ శ్రేణి సభగా మార్చే తప్పును ఎవ్వరూ చేయవద్దని హెచ్చరించారు. నేను అదే పునరుద్ఘాటిస్తున్నాను. దేశాభివృద్ధికోసం నిరంతరం ఈ సభ మద్దతు కావాల్సిందే. పార్లమెంటు 50వ వార్షికోత్సవ సమావేశంలోనూ వాజ్‌పేయీ మాట్లాడుతూ- ‘నదికి గట్లు బలంగా ఉన్నప్పుడే ప్రవాహం చక్కగా సాగుతుంది. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య నదీ ప్రవాహానికి ఒక గట్టు లోక్‌సభ అయితే మరో గట్టు రాజ్యసభ’ అని చెప్పారు. మూల సిద్ధాంతాల తనిఖీకి, సంతులనానికి ఈ సభ ఎంతో ముఖ్యం. ప్రశ్నించడానికి, స్తంభింపజేయడానికి మధ్య అంతరం చూపాల్సిన అవసరమెంతో ఉంది. సభ ఉన్నదే చర్చల కోసం. సభ్యులు సభను స్తంభింపజేయడానికి బదులు సంవాదన మార్గాన్ని ఎంచుకోవాలి.

చర్చలు గొప్పగా జరగాలి
దేశంలోని అన్ని అంశాలపై ప్రభుత్వ విధానాలకు అనుకూలంగానో, వ్యతిరేకంగానో పార్లమెంటులో గొప్ప చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ఈ దేశ అఖండత, వైవిధ్యానికి పెద్దపీట వేసింది. దేశానికున్న సౌందర్యాన్ని తనలో ఇముడ్చుకొంది. దేశాన్ని ముందుకు నడిపే శక్తి కూడా అదే. సభ్యులంతా విభిన్న చర్చల్లో సానుకూలంగా పాల్గొని, దేశానికి మేలు జరిగేలా చూడాలి. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జరిగిన గత సమావేశాలు ఎన్నడూ లేనంతగా ఫలవంతమయ్యాయి. ఆ విజయం ప్రభుత్వానిదో, పాలక పక్షానిదో కాదు. పార్లమెంటుతోపాటు, అన్ని పక్షాల సభ్యులూ ఆ ఘనతకు పాత్రులే.  ఈ సమావేశాల్లోనూ ఎంపీలంతా ఉత్సాహంతో పాల్గొని దేశ అభ్యున్నతికోసం పనిచేస్తారని ఆశిస్తున్నాను’’ అని మోదీ పేర్కొన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.