close
ఇదో రకం డిపాజిత్తు!

వేగనియంత్రణ పరికరాల వ్యవహారంలో మతలబు
మూడు కంపెనీలంటేనే ముచ్చట
డిపాజిట్‌ రూ. కోటి నుంచి రూ. 50 లక్షలకు..
తాజాగా రూ.5 లక్షలకు తగ్గింపు
ఇతర కంపెనీలనూ అనుమతిస్తే  ధరలు తగ్గే అవకాశం
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

రూ. 4 వేల విలువ చేసే వేగ నిరోధక పరికరానికి రూ.7,500 వసూలు చేయడం ద్వారా వాహనదారులకు రూ. 3,500 అదనపుభారం పడుతుంది.
* రాష్ట్రంలో నాలుగు లక్షల వాణిజ్య వాహనాలున్నాయి. ఈ లెక్కన వాహనదారులపై రూ.140 కోట్ల మేర అదనపు భారం పడుతుందని అంచనా.
* 2 నెలలుగా 45వేల వాణిజ్య వాహనాలకు ఈ పరికరాలను అమర్చారు.
* ఒక్కో పరికరం మీద రూ.వెయ్యి చొప్పున రూ.4.50 కోట్లు కమీషన్ల కింద కొందరి జేబుల్లోకి వెళ్లిందన్న ఆరోపణలున్నాయి.

తెలంగాణలో వాణిజ్య వాహనాలకు వేగనియంత్రణ పరికరాల విక్రయ వ్యవహారం విస్మయం కలిగిస్తోంది. మూడు కంపెనీలపైనే అధికారులు అవ్యాజమైన ప్రేమను చూపడం విమర్శలకు తావిస్తోంది. అదనంగా నాలుగు కంపెనీలకు అనుమతులిస్తామన్న అధికారులు వాటి నుంచి రూ.కోటి చొప్పున బ్యాంక్‌ డిపాజిట్‌ తీసుకున్నారు. వాటిని పక్కన పెట్టి మూడు కంపెనీల గ్యారెంటీ సొమ్మును రూ.కోటి నుంచి తొలుత రూ.50 లక్షలను తాజాగా రూ.ఐదు లక్షలకు తగ్గించారు.

అతి వేగంతో దూసుకుపోతున్న వాణిజ్య వాహనాల వల్ల దేశవ్యాప్తంగా వేలాది మంది చనిపోతుండటంతో వాటి వేగం గంటకు 80 కిలో మీటర్లకు పరిమితం చేయాలని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అందుకోసం వాహనాలకు వేగŸ నియంత్రణ పరికరాన్ని అమర్చాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఆటోమేటివ్‌ రీసెర్చి అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఆర్‌ఐ) అనుమతి తీసుకున్న సంస్థలు ఈ పరికరాలను విక్రయించవచ్చు. ఇలా అనుమతి పొందిన సంస్థలు దేశవ్యాప్తంగా 37 వరకు ఉన్నాయి. కర్ణాటక, ఆంధ్రపదేశ్‌లతో పాటు అనేక రాష్ట్రాల్లో వేగనియంత్రణ పరికరాలను విక్రయించడానికి ఈ సంస్థలు అనుమతులు పొందాయి. దీనివల్ల చాలా రాష్ట్రాల్లో ఈ పరికరం రూ.4 వేలకు లభ్యమవుతోంది. తెలంగాణలో మాత్రం రూ.7,500కు లభించడంతో వాహనదారులు నష్టపోతున్న విషయాన్ని గత నెల 22వ తేదీన ‘ఇదో దారి దోపిడీ’ శీర్షికతో ఈ అక్రమాల బాగోతాన్ని ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై రాష్ట్ర ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించడంతో ఈ పరికరం ధరలు తగ్గించడానికి వీలుగా రూ.కోటి బ్యాంక్‌ గ్యారంటీ చెల్లించిన కంపెనీలకు కూడా అనుమతి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే తొలుత రూ.50 లక్షలు కట్టిన మూడు కంపెనీలపైనే అపార ప్రేమ కనబర్చారు. రూ.కోటికి బదులు రూ.50 లక్షలు చెల్లించారు కాబట్టి మిగిలిన రూ.50 లక్షలను అక్టోబరు నెలాఖరులోగా కట్టమన్నారు. మళ్లీ అధికారులు మనసు మార్చుకున్నారు. రూ.5 లక్షల బ్యాంక్‌ గ్యారంటీ ఇవ్వండి చాలు అంటూ ఈ మూడు కంపెనీలపై అధికారులు ఔదార్యం చూపించారు. పరికరాల నాణ్యతను పెంచడం కోసమే రూ.కోటి డిపాజిట్‌ నిబంధన పెట్టామని అధికారులు అప్పట్లో ‘ఈనాడు’ కథనంపై వివరణ ఇచ్చారు. ఇప్పుడేమో రూ.5 లక్షలకు తగ్గించారు.


లారీ యజమానుల సంఘం వినతి మేరకే తగ్గింపు

డిపాజిట్‌ తగ్గించామని ఇతర రాష్ట్రాల్లో మాదిరే రాష్ట్రంలో కూడా అనుమతి పొందిన అన్ని కంపెనీలను పరిగణనలోకి తీసుకుంటామని మంగళవారం రవాణా శాఖ కమిషనర్‌ సందీప్‌ శాండిల్య పేర్కొన్నారు. లారీ యజమానుల సంఘం వినతి మేరకే డిపాజిట్‌ తగ్గించామని అందులో వివరించారు. ఇప్పటికే రూ.కోటి చెల్లించిన నాలుగు కంపెనీల్లోని కొంతమంది ప్రతినిధులు అధికారులను కలిసి తమ పరికరాల అమ్మకానికి అనుమతి ఇవ్వమని అడిగితే అక్కడి అధికారుల నుంచి సమాధానం లేదని చెబుతున్నారు. తాజా ఆదేశాలకు భిన్నంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఈ నాలుగు కంపెనీల ప్రతినిధులు వాపోతున్నారు. ఈ నాలుగు కంపెనీలే కాకుండా మిగిలిన కంపెనీలకు కూడా అమ్మకాలకు అనుమతి ఇస్తే ధరలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.