
సూత్రప్రాయ అంగీకారమే కదా
ప్రైవేటీకరణకు చట్టమే అనుమతిస్తోంది
పర్మిట్ల వ్యవహారంలో హైకోర్టు వ్యాఖ్యలు
విచారణ నేటికి వాయిదా
ఈనాడు - హైదరాబాద్
ప్రస్తుతం ప్రైవేటీకరణ ఒరవడి నడుస్తోంది. ఒకప్పుడు ఆకాశాన్నంతటినీ ఎయిరిండియా ఆక్రమించింది. విమాన రంగంలో దానిదే గుత్తాధిపత్యం. సరళీకరణల నేపథ్యంలో ప్రైవేట్ విమానాలు వచ్చాయి. వాటిలో కొన్ని బాగా నిలదొక్కుకున్నాయి. రైల్వేలోనూ ప్రైవేటు రైళ్లు వస్తున్నాయి. అందువల్ల రూట్ల ప్రైవేటీకరణ అన్నది పూర్తిగా ప్రజావ్యతిరేకమన్న వాదన సరైంది కాకపోవచ్చు. - హైకోర్టు
|
రూట్ల ప్రైవేటీకరణకు సంబంధించి మంత్రి మండలి తీసుకున్న నిర్ణయంలో తప్పేముందో చెప్పాలంటూ పిటిషనర్‌ను మంగళవారం హైకోర్టు ప్రశ్నించింది. ఇది సూత్రప్రాయ అంగీకారమేనని.. ఇంకా ప్రాథమిక దశలోనే ఉందన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలంది. కేంద్రం తీసుకువచ్చిన మోటారు వాహనాల సవరణ చట్టంలోని సెక్షన్ 102 ప్రకారం రూట్ల ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రారంభించాలని మాత్రమే చెప్పిందన్నారు. ఇందులో ఏవైనా చట్టవిరుద్ధంగా ఉంటే చెప్పాలంది. ప్రైవేటీకరణలో భాగంగా 5100 పర్మిట్లు జారీ చేయాలన్న మంత్రి మండలి నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరావు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం విదితమే. ఈ పిటిషన్‌పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ సమ్మె సమయంలో కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా, చర్చలకు పిలవకుండా రూట్లను ప్రైవేటీకరించాలన్న నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇది వంచనతో కూడుకున్నదన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కన్సిలియేషన్ (రాజీ) చర్చలు జరుగుతుండగా యూనియన్ సభ్యులు వెళ్లిపోయారని, అలాంటప్పుడు చర్చలకు ఎందుకు పిలుస్తారని ప్రశ్నించింది. రాష్ట్ర రవాణా రంగాన్ని నియంత్రించే అధికారం రాష్ట్రానికి ఉందని, ఇది చట్టం ఉద్దేశంలోనే ఉందని తెలిపింది. 5100 పర్మిట్ల జారీలో తప్పేముందో చెప్పాలని ప్రశ్నించింది. ఎంవీ యాక్ట్‌లోని సెక్షన్ 67 రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని చెబుతోందని పేర్కొంది. దీనిప్రకారం ఆర్టీసీకి సమాంతరంగా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించవచ్చని, ప్రైవేటు వచ్చినా ఆర్టీసీ ఉంటుందంది. ఆర్టీసీకి ఉండే గుత్తాధిపత్యం తగ్గించడంలో భాగమేనని వ్యాఖ్యానించింది. మొదట ప్రైవేటు బస్సులే ఉండేవని, తరువాత ఆర్టీసీ వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం రెండింటినీ తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోందంది. ఎంవీ యాక్ట్ 102 రాష్ట్ర ప్రభుత్వంపై బాధ్యతలు పెడుతోందంది. మంత్రి మండలి నిర్ణయం ప్రకారమే చర్యలు తీసుకోవాలంది. అయితే ప్రస్తుత విధానానికి సవరణ చేయాల్సి ఉందని తెలిపింది. దీనివల్ల ప్రభావం చూపే ఆర్టీసీతో పాటు ఇతర సంస్థలకు సమాచారం ఇచ్చి వాటి అభ్యంతరాలను తీసుకుని పరిష్కరించాల్సి ఉందని పేర్కొంది. 5100 పర్మిట్ల జారీకి కేంద్రం అధికారం ఇచ్చిందని, ఇందులో ఆర్టీసీ అభ్యంతరాలను తీసుకోకపోతే చెప్పాలంది. న్యాయవాది జోక్యం చేసుకుంటూ సెక్షన్ 104 ప్రకారం నోటిఫైడ్ ప్రాంతాల్లో నిషేధం ఉందని, రాష్ట్రం మొత్తం నోటిఫైడ్ ప్రాంతమన్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ చర్య సరికాదన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఇది పూర్తి నియంత్రణ కాదని తెలిపింది. ప్రభుత్వాన్ని నియంత్రించే అధికారం సెక్షన్ 104కు లేదంది. ఆర్టీసీ గుత్తాధిపత్యాన్ని సవరించే ప్రయత్నం చేస్తే ముందు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలంది. తరువాత 30 రోజుల్లో ఈ నిర్ణయం ఏయే ప్రాంతాల్లో ప్రభావం చూపుతుందో అక్కడ ప్రాంతీయ పత్రికల్లో ప్రకటనలిచ్చి, అభ్యంతరాలను స్వీకరించి వాటిని పరిష్కరించాలంది.
ముఖ్యమంత్రి ప్రకటనతో సంబంధం లేదు
ఆర్టీసీకి 10 వేలకుపైగా బస్సులున్నాయని, భవిష్యత్తులో ఆర్టీసీ ఉండదని ముఖ్యమంత్రి అంటున్నారని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకురాగా.. బస్సులు వేరు, రూట్లు వేరని, ఒకే రూట్లో ఆర్టీసీ, ప్రైవేటు బస్సులతోపాటు ఇతర రాష్ట్రాల బస్సులు కూడా తిరగవచ్చంది. ఇక్కడ మంత్రి మండలి నిర్ణయం చట్టబద్ధమా? విరుద్ధమా అన్న అంశాన్నే ఈ కోర్టు చూస్తుందని, ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై కాదంది. మీరు సీఎం వ్యాఖ్యలపై కాకుండా చట్టంపై దృష్టి సారించి ఉల్లంఘన జరిగి ఉంటే మా దృష్టికి తీసుకురావాలంది. న్యాయవాది సమాధానమిస్తూ ప్రభుత్వం ఎవరినీ సంప్రదించలేదని, ఒకే అధికారి కార్పొరేషన్‌ను నడుపుతున్నారన్నారు. ఇంకా నోటిఫికేషన్ జారీ చేయలేదన్నారు. మంత్రి మండలి నిర్ణయంలో తప్పేముందని, అది నిర్ణయం తీసుకుని ముందుకెళుతుందా అని ధర్మాసనం ప్రశ్నించింది. అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ మంత్రి మండలి నిర్ణయాన్ని సీల్డ్కవర్లో ధర్మాసనానికి అందజేశారు. దీన్ని పరిశీలించిన ధర్మాసనం పర్మిట్ల జారీకి సంబంధించి చట్టంలోని సెక్షన్ 102 ప్రకారం ప్రక్రియను ప్రారంభించాలని మాత్రమే సూచించిందని, ఇది సూత్రప్రాయ అంగీకారమేనంది. ఇంకా ఆ ప్రక్రియ ప్రారంభంలేదని.. అది నిబంధనల ప్రకారం జరగకపోతే ప్రశ్నించవచ్చంది. న్యాయవాది స్పందిస్తూ ఏ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారో కోర్టు చూడాలని, దీని వెనుక దురుద్దేశాలున్నాయని ఆరోపించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఒకవేళ సమ్మెలాంటి పరిస్థితులు లేనపుడు ప్రైవేటు బస్సులను తీసుకురావాలని నిర్ణయిస్తే అప్పుడు చట్టం అనుమతిస్తుంది కదా అని ప్రశ్నించింది. సెక్షన్ 71 కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తారని, 72 కింద దరఖాస్తులను ఆర్టీఏ పరిశీలించి స్టేజ్ క్యారియర్లను అనుమతిస్తారని, చట్టప్రక్రియను అతిక్రమిస్తే మీరు చెబుతున్న అంశాలను సమర్థించవచ్చంది.
కార్మికుల ప్రస్తావనలేదు
అన్ని రూట్లలో ప్రైవేటు బస్సులు వస్తే 48 వేల మంది జీవించే హక్కుతో పాటు ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందన్న న్యాయవాది వాదనపై ధర్మాసనం స్పందిస్తూ చట్టంలో ఏ నిబంధన కిందా కార్మికుల ప్రస్తావన లేదంది. ప్రైవేటు బస్సులను తీసుకువచ్చే అధికారాన్ని రాష్ట్రానికి ఇచ్చిందని, కార్మికుల గురించి పార్లమెంట్ చట్టంలో ప్రస్తావించలేదంది. చట్టాలను ఈ కోర్టు సవరించజాలదంది. దీనిపై తదుపరి విచారణ బుధవారం కొనసాగనుంది.
ముఖ్యాంశాలు
దేవతార్చన

- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- పోలీసులపై పూల జల్లు
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..