close
హైదరాబాద్‌లో ఇంటెల్‌ కేంద్రం

ఎలక్ట్రానిక్‌ తయారీలో 3 లక్షల కొత్త ఉద్యోగాలు
ఇంటెల్‌ హైదరాబాద్‌ కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఎలక్ట్రానిక్‌ తయారీ రంగాన్ని అభివృద్ధి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో ఈ రంగంలో 3 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని ఆయన వెల్లడించారు. అగ్రశ్రేణి టెక్నాలజీ సంస్థ అయిన ఇంటెల్‌ హైదరాబాద్‌లో తన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ కేంద్రాన్ని సోమవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐటీ రంగంలో హైదరాబాద్‌ నగరం శరవేగంగా విస్తరిస్తోందని, ఎన్నో అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ తమ అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయన్నారు. గత అయిదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మకమైన చర్యల వల్ల ఈ అభివృద్ధి సాధ్యమైనట్లు చెప్పారు. గూగుల్‌, ఆపిల్‌, మైక్రోసాఫ్ట్‌, క్వాల్‌కామ్‌, మైక్రాన్‌, అమెజాన్‌, ఉబర్‌, ఒపో వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు హైదరాబాద్‌ వచ్చినట్లు డెలాయిటీ ఇక్కడ తన కార్యకలాపాలను బహుముఖంగా విస్తరిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు ఇంటెల్‌ కూడా ఇక్కడకు వచ్చిందని తెలిపారు. అయితే మేం కేవలం ఐటీ సేవలకే పరిమితం కాలేదు, ఇప్పుడు మేం ఐటీ ప్రోడక్ట్స్‌ రూపొందించటం, డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, సెమీకండక్టర్‌, పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నాం- అన్నారాయన.

మూడవ ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్‌కు ప్రయత్నం
ఎలక్ట్రానిక్స్‌ తయారీని ప్రాధాన్యతా రంగంగా చూస్తున్నామని ఈ రంగంలో ఇప్పటికే రూ.5,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్లు, తద్వారా 30,000 కొత్త ఉద్యోగాలు వచ్చినట్లు కేటీఆర్‌ వెల్లడించారు. ‘ఈ మధ్యనే స్కైవర్త్‌ అనే చైనా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజ సంస్థ హైదరాబాద్‌లో 50 ఎకరాల్లో 100 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.700 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది’ అని  తెలిపారు. హైదరాబాద్‌లో ఇప్పటికే రెండు ఎలక్ట్రానిక్‌ క్లస్టర్లు ఉన్నాయని, తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలంటే మూడవ ఎలక్ట్రానిక్‌ క్లస్టర్‌ అవసరమని ఆయన అన్నారు. అందువల్ల ఇటీవలే కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ను కలిసి కొత్త క్లస్టర్‌ మరొకటి ఇవ్వాల్సిందిగా కోరినట్లు, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు.

ఎలక్ట్రానిక్స్‌ రంగంలో వినూత్నమైన ఉపకరణాలు, ఉత్పత్తులు ఆవిష్కరించే దిశగా నమూనాల తయారీని ప్రోత్సహించాల్సి ఉందని గుర్తించి అందుకు వీలుకల్పించేదిగా ‘టీ-వర్స్‌’ను రూపుదిద్దుతున్నట్లు వివరించారు. ఇది వచ్చే మూడు, నాలుగు నెలల్లో ప్రారంభం అవుతుందని చెప్పారు. దీనివల్ల ఎలక్ట్రానిక్‌ డిజైన్‌ కార్యకలాపాలు వేగవంతం అవుతాయన్నారు. ఐటీ రంగంలో త్వరలో బెంగళూరును మించిపోతామని ఈ సందర్భంగా కేటీఆర్‌ విశ్వాసం వెలిబుచ్చారు.

1500 మంది సిబ్బందితో ఇంటెల్‌ కేంద్రం
హైదరాబాద్‌లో మాదాపూర్‌ ప్రాంతంలో 3 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలంలో ఇంటెల్‌ డిజైన్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ కేంద్రం కొలువు తీరింది. ఇక్కడ 1500 మంది సిబ్బంది పనిచేస్తారని, ‘ఇంటెల్‌ ఇండియా మేకర్స్‌ ల్యాబ్‌’ ఇందులో ఉంటుందని ఇంటెల్‌ కంట్రీ హెడ్‌, డేటా సెంటర్‌ గ్రూపు ఉపాధ్యక్షురాలు నివృత్తి రాయ్‌ తెలిపారు. గత 20 ఏళ్లుగా భారతదేశంలో పరిశోధనా కార్యకలాపాలపై పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతూ వచ్చినట్లు, తద్వారా సాంకేతిక రంగం విస్తరణలº భాగస్వామి అయినట్లు వివరించారు. ‘మేకర్‌ ల్యాబ్‌’ ద్వారా హార్డ్‌వేర్‌ అండ్‌ సిస్టమ్స్‌ విభాగాల్లోని అంకుర సంస్థలకు ఇంక్యుబేషన్‌ మద్దతు లభిస్తుందని తెలిపారు.

అనువైన పరిస్థితులు కల్పిస్తున్నాం
తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాల విస్తరణకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. ట్రిపుల్‌ ఐటీ, ఐఐటీ వంటి సంస్థలకు తోడు టీ-హబ్‌, వీ-హబ్‌ వంటి ఇంక్యుబేటర్ల ద్వారా స్టార్టప్‌ సంస్థలకు, ఐటీ రంగానికి మేలు జరుగుతోందని వివరించారు. కొత్తగా గేమింగ్‌-యానిమేషన్‌ విభాగాల్లో విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు, ఈ మధ్యనే ‘ఇండియా జాయ్‌’ పేరుతో గేమింగ్‌-యానిమేషన్‌ సదస్సు నిర్వహించినట్లు వివరించారు. ఇంటెల్‌ కార్పొరేషన్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, ఛీఫ్‌ ఆర్కిటెక్ట్‌ రాజా ఎం.కోడూరి, సంస్థ ఉన్నతాధికార్లు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.