close
వచ్చే బడ్జెట్‌లో మార్కెట్‌ స్థిరీకరణ నిధి

ప్రతీ గింజా కొంటాం
పంటల కొనుగోలుకు నిధుల కొరత లేదు
పత్తిని ఆరబెట్టి తెస్తేనే సీసీఐ మద్దతు ధర
గత డిసెంబరు లెక్కల మేరకు రుణమాఫీ
‘ఈనాడు’తో వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి
ఈనాడు - హైదరాబాద్‌

పంటలను మద్దతు ధరకు కొనేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నాం. వచ్చే బడ్జెట్‌లో ఇందుకోసం ‘మార్కెట్‌ స్థిరీకరణ నిధి’ ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరుగుతున్నందున పంటలను మద్దతు ధరకు కొనేందుకు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.

ధాన్యం కొనుగోలులో జాప్యం సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. మంత్రివర్గంలో దీనిపై చర్చించామన్నారు. నిధుల కొరత లేదని, ప్రతి గింజను కొనమని సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చారని తెలిపారు. ఖరీఫ్‌ సీజన్‌లో పండిన పంటల కొనుగోలు, రబీలో పంటల సాగుకు చర్యలు, ఉల్లి ధరల మంట, పంట రుణాల మాఫీ తదితర అంశాలపై ఆయన ‘ఈనాడు’తో ముఖాముఖి మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

* భారత పత్తి సంస్థ(సీసీఐ) ఇప్పటికే పత్తిని మద్దతు ధరకు కొంటోంది. తేమ ఎక్కువగా ఉంటే మద్దతు ధర ఇవ్వడానికి సీసీఐ నిబంధనలు అంగీకరించవు. అధిక తేమ, నాణ్యత లేని పత్తిని విదేశాలకు ఎగుమతి చేస్తే మన దేశానికి కూడా చెడ్డపేరు వస్తుంది. రైతులు అర్థం చేసుకుని ముందే ఆరబెట్టి తేవాలి. ఎన్ని రోజులైనా, ఎంత పంటనైనా మద్దతు ధరకు కొనేందుకు ఏర్పాట్లు చేశాం.
* పత్తి పండించే కౌలురైతుల సమస్య మా దృష్టికి వచ్చింది. వారు పత్తిని తెచ్చే ముందు వారి గ్రామంలోని వ్యవసాయ విస్తరణాధికారి(ఏఈవో) నుంచి ధ్రువీకరణ పత్రం తెస్తే చాలు. అలా తేలేని రైతులకు సంబంధించి వారి గ్రామ ఏఈవోతో ఫోన్‌లో మాట్లాడి ధ్రువీకరించుకుని పత్తిని కొనాలని సీసీఐకి సూచించాం.
* ఇతర పంటలకు సకాలంలో మద్దతు ధర చెల్లించేందుకు మార్క్‌ఫెడ్‌కు ఇటీవలే రూ.1537 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతించాం. రైతు పంట అమ్మగానే ఒక్కొక్కరికి వెంటనే చెల్లించడానికి నిబంధనలన్నీ పరిశీలించాల్సి ఉంటుంది. ప్రభుత్వం అందరికీ పక్కాగా చెల్లిస్తుంది. జాప్యం లేకుండా ఇచ్చేందుకు మార్క్‌ఫెడ్‌ ఏర్పాట్లు చేస్తోంది.

* కూరగాయల కొరత తీర్చడానికి ఉన్నతాధికారులతో చర్చించాం. నగరాలు, పట్టణాల చుట్టుపక్కల ఈ పంటలే సాగుచేస్తే ఆదాయం పెరుగుతుందని రైతులకు అవగాహన కల్పిస్తాం. సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచబోతున్నాం. అధిక దిగుబడి వస్తే రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేందుకు కూరగాయల శుద్ధి, నిల్వకు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.
* దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డల కొరత ఎక్కువగా ఉంది. రెండు రైతుబజార్లలో కిలో రూ.40కి అమ్మడానికి ఏర్పాట్లు చేశాం. రాష్ట్రానికి ఉల్లిగడ్డలు పంపమని కేంద్రాన్ని కూడా కోరాం.
* రాష్ట్ర ప్రజల ఆహారవసరాల ప్రకారం ఏ పంట ఏ ప్రాంతంలో పండించాలనే ప్రణాళిక ఉంది. దీని ప్రకారం కూరగాయలు, ఇతర ఆహార పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతుల్లో అవగాహన కల్పించి, ఆదాయం పెరిగే పంటలు వేసేలా ప్రోత్సహిస్తాం.
* రబీ (యాసంగి) సీజన్‌కు సంబంధించిన రైతుబంధు సొమ్మును త్వరలో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. ఖరీఫ్‌లో 90 శాతం మంది ఖాతాల్లో ఇప్పటికే జమ చేశాం. గత ఏడాది కన్నా రైతుల సంఖ్య పెరిగింది. అందరికీ ఇస్తాం.
* బ్యాంకులో పాత రుణ బకాయి కట్టి కొత్త పంటరుణం తీసుకునేందుకు రైతులంతా రెన్యువల్‌ చేసుకోవాలని శాసనసభలోనే సీఎం ప్రకటించారు. గత డిసెంబరు నాటికి రైతుకున్న అప్పు ప్రకారం రుణమాఫీ కింద రైతుల చేతికే నేరుగా సొమ్ము అందజేయాలని యోచిస్తున్నాం. రుణమాఫీ అమల్లో బ్యాంకుల ప్రమేయం లేకుండా చూడాలని సీఎం యోచిస్తున్నారు. ఆయన గతంలో అసెంబ్లీలో చెప్పిన ప్రకారం అర్హులైన వారందరికీ రుణమాఫీ నిధులు అందజేస్తాం.
* జర్మనీ, నెదర్లాండ్స్‌లో ఇటీవల పర్యటించాం. విత్తనోత్పత్తి, శుద్ధి, నాణ్యతపై జర్మనీ సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకుంటున్నాం. నెదర్లాండ్స్‌ రైతులు ఆహారధాన్యాలు, పూలు, పండ్ల సాగులో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నారు. వారి నుంచి అధునాతన పరిజ్ఞానం తీసుకుని ఇక్కడి రైతులకు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. రాష్ట్రంలో పాలు, పూలు, కూరగాయల దిగుబడి బాగా పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని మంత్రివర్గ సమావేశంలో సీఎం చర్చించారు. వచ్చే బడ్జెట్‌లో దీనికి ఎక్కువగా నిధులు ఇవ్వాలని ప్రతిపాదించాం
బిందుసేద్యం పథకానికి అవసరమైన నిధుల కోసం నాబార్డు నుంచి రుణం తీసుకుంటున్నాం. ఈ రుణం తీసుకోవడానికి ప్రభుత్వ అనుమతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దస్త్రం పంపాం. అనుమతి రాగానే రైతులకు మంజూరు చేస్తాం.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.