close
దేశం ఆక్రందన

‘దిశ’ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌
నినాదాలతో దద్దరిల్లిన జంతర్‌మంతర్‌
కోల్‌కతాలో రహదారిపైకి వచ్చిన వర్సిటీ విద్యార్థులు
సహాయక నెంబర్లు అందుబాటులోకి తెచ్చిన దుర్గా పూజ కమిటీలు

అదే ఆగ్రహం.. అదే ఆక్రోశం.. హైదరాబాద్‌ శివారులో హత్యాచారానికి గురైన ‘దిశ’ కుటుంబానికి న్యాయం చేయాలంటూ సోమవారమూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దిల్లీ, కోల్‌కతా, బెంగళూరుల్లో మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని మహిళలు దిల్లీలో ఆందోళన చేశారు. దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద మంగళవారం నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగనున్నట్లు దిల్లీ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు స్వాతి మాలీవాల్‌ సోమవారం ప్రకటించారు.

దిల్లీ, కోల్‌కతా: హైదరాబాద్‌కు చెందిన ‘దిశ’ హత్యాచారం ఘటనను ఖండిస్తూ సోమవారం దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద మహిళలు నిరసన తెలిపారు. తలకు నల్ల రిబ్బన్లు కట్టుకున్న 70 మంది ‘మాకు న్యాయం కావాలి’, ‘అత్యాచారానికి పాల్పడ్డవారిని ఉరి తీయాలి’ అంటూ ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. ‘‘ఓ రాజకీయ నాయకురాలిగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టలేదు. సమాజంలో జరుగుతున్న ఘటనలపై కలత చెందిన పౌర సమాజం సభ్యురాలిగా మాత్రమే చేపట్టాను. మహిళలకు రక్షణ లేదన్న విషయమై చర్చించడానికి మనకు మరో నిర్భయ అవసరం ఎందుకు?’’ అని ఆందోళనకు నేతృత్వం వహించిన కాంగ్రెస్‌ నాయకురాలు అమృతా ధవన్‌ చెప్పారు. న్యాయవ్యవస్థ త్వరగా న్యాయం చేయాలని, అప్పుడే బాధితులకు కాస్తంత సాంత్వన లభిస్తుందన్నారు. ‘‘నిర్భయ కేసుల్లో నిందితులు ఇప్పటికీ జైల్లో ఉన్నారు. చక్కగా తింటున్నారు. విశ్రమిస్తున్నారు. కానీ, బాధిత కుటుంబాల పరిస్థితి ఏమిటి?’’ అని ఆమె ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు ‘మాకు న్యాయం కావాలి’ ‘మీ ఉసురు తీసిన హంతకులు ఇప్పటికీ జీవించి ఉన్నందుకు సిగ్గు పడుతున్నాం’ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ మౌనం వీడి మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. దిల్లీ విశ్వవిద్యాలయం హన్స్‌రాజ్‌ కళాశాలకు చెందిన అదితి పురోహిత్‌ అనే విద్యార్థిని ఈ సందర్భంగా భావోద్వేగానికి గురై ఏడ్చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను తొలిసారిగా నిరసనలో పాల్గొన్నాను. ఇల్లు విడిచి దిల్లీలో ఉంటున్న అమ్మాయిగా ఆందోళనలో పాల్గొన్నాను. ‘దిశ’ ఘటన నన్ను, నా కుటుంబాన్ని తీవ్రంగా బాధించింది’’ అని పేర్కొన్నారు. రోజూ సాయంత్రం 5 గంటలకే వసతిగృహానికి వెళ్లిపోవాలంటూ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఝాన్సీ నుంచి తన తల్లిదండ్రులు ఫోన్‌ చేస్తున్నారని అదితి చెప్పారు.

* సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణీ అలీ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు ఎస్‌.పుణ్యవతి, విద్యార్థి సంఘాల ప్రతినిధులూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళనలు చేపట్టారు.
* పశ్చిమ్‌బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయానికి చెందిన వందలాది మంది విద్యార్థులు వర్సిటీ ప్రాంగణం నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందంటూ ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శించారు. జాధవ్‌పుర్‌ విశ్వవిద్యాలయం విద్యార్థులు వర్సిటీ ప్రాంగణం వెలుపల మానవహారంగా నిలబడి ‘దిశ’ హత్యాచారాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు.
* కోల్‌కతాలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించే దుర్గా పూజ కమిటీలు కొన్ని మహిళల కోసం ప్రత్యేక సహాయక నెంబర్లను అందుబాటులోకి తెచ్చాయి. కాళీ ఘాట్‌ ప్రాంతానికి చెందిన ఓ కమిటీ సోమవారం తన ఫేస్‌బుక్‌ పేజీలో ఆరు మొబైల్‌ నెంబర్లను ఉంచింది. ఆపదలో ఉన్న మహిళలకు సహకరిస్తామని పేర్కొంది.
* దేశంలో అత్యాచార ఘటనలను నిరసిస్తూ దిల్లీ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు స్వాతి మాలీవాల్‌ మంగళవారం నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగనున్నారు.


అబ్బాయిలపైనా కన్నేసి ఉంచాలి
మహిళలపై అకృత్యాలకు ప్రాథమిక కారణం తల్లిదండ్రులు తమ కుమారులను పెంచుతున్న విధానమే. మనకి అమ్మాయిలను ఎలా నియంత్రణలో ఉంచాలన్న విషయం మాత్రమే తెలుసు. అదే సమయంలో అబ్బాయిలను ఎలా పెంచాలన్న విషయం తెలియదు. కుమారులు వారి నియంత్రణలో ఉండడం లేదు. మగ పిల్లలపై కూడా తల్లిదండ్రులు దృష్టిపెట్టాలి. వారి కార్యకలాపాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. పిల్లలకు పరీక్షల్లో మార్కుల విషయమే కాకుండా.. విలువల విద్య, మంచి విషయాలను బోధించాలి.
- కిరణ్‌బేడీ, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌
వీలైనంత త్వరగా విచారణ పూర్తిచేయాలి 
హైదరాబాద్‌కు చెందిన యువ పశు వైద్యురాలి హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ఈ ఘటన అత్యంత విచారకరం. బాధిత కుటుంబానికి న్యాయం చేయడానికి వీలుగా ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా దోషులను శిక్షించాలి.
- బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.