close

ప్రధానాంశాలు

పార్లమెంట్‌ ఆవేదన

‘హైదరాబాద్‌ దారుణం’పై స్పందించిన ఉభయసభలు
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని స్పష్టీకరణ
ఏ చట్టం చేయడానికైనా సిద్ధమే
నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తాం: రాజ్‌నాథ్‌సింగ్‌
చట్టాల సవరణకు సిద్ధం: కిషన్‌రెడ్డి
రాజకీయ సంకల్పంతోనే పరిష్కారం: వెంకయ్యనాయుడు

అత్యున్నత చట్టసభల్లో అంతులేని బాధ... ఆక్రోశం... ప్రతి గొంతులోనూ ఆవేదన... ఏడేళ్ల క్రితం నిర్భయ ఘటనను చూసి తల్లడిల్లిన మనసులు... ఇన్నాళ్లైనా దిశ మారలేదెందుకని తొలిచే ప్రశ్నలతో  నిండిన మస్తిష్కాలు... ఒక్కటై ఆక్రందించాయి...  సహనానికైనా ఓ హద్దుండదా అని ప్రశ్నించుకున్నాయి... సమాజ నిర్మాణంలో సగభాగమైన మహిళలు ఎన్నాళ్లిలా క్రూరత్వానికి బలికావాలని నిలదీశాయి. న్యాయ ప్రక్రియ పేరుతో నేరాన్ని నీరుగారుస్తారా? కామాంధులకు కాలం చెల్లనివ్వరా? అని నిష్ఠూరమాడాయి. మగువ భద్రతే మాకు ముఖ్యం... దానికోసం ఏం చేయడానికైనా సిద్ధం అని ముక్తకంఠంతో ఘోషించాయి కారాగారాలు... క్షమాభిక్షలకు ముగింపు పలికి తక్షణం కీచకుల పీచమణచాలని డిమాండ్‌ చేశాయి...

హైదరాబాద్‌లో జరిగిన ఘటనకు మించిన అమానవీయ సంఘటన ఇంకొకటి ఉండదు. దేశం మొత్తం ఈ ఘటనను ఖండిస్తోంది. అందరిలో ఆవేదన ఉంది. 
-రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 
...కావాల్సింది రాజకీయ సంకల్పమే తప్ప కొత్త బిల్లులు కాదు. న్యాయవ్యవస్థ, ప్రభుత్వాలు, మనమందరం కలిసి ఇలాంటి రుగ్మతలకు సమాధానం ఇవ్వాలి. అంతకుమించిన ప్రత్యామ్నాయం లేదు. మన న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలి. దుర్మార్గం చేసిన వాడి వయసు గురించి ఎందుకు పట్టించుకోవాలి? 
-ఎం.వెంకయ్యనాయుడు, రాజ్యసభ ఛైర్మన్‌ 
నిర్భయ ఘటన జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు కనీసం భౌతిక కాయమైనా లభించింది. ఈ ఘటనలో అది కూడా దక్కలేదు. అందుకే చట్టాలను కఠినతరం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 
- కిషన్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి 

హైదరాబాద్‌లో దిశ హత్యాచార ఘటనను పార్లమెంటు సోమవారం ముక్తకంఠంతో ఖండించింది... శూన్యగంటలో రాజ్యసభ, లోక్‌సభాపతులు చర్చకు అవకాశం ఇవ్వడంతో ఎంపీలు రాజకీయాలకు అతీతంగా మాట్లాడారు. మానవత్వానికే మచ్చ తెచ్చేలా తెగబడిన నిందితులకు తక్షణం కఠిన శిక్ష పడేలా చూడాలని పలువురు సభ్యులు డిమాండ్‌ చేశారు. సభ్యుల ఆవేదనను అర్థం చేసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దిశ ఘటనపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి లోక్‌సభ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానం అందజేశారు. ఆయనతో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నినాద ఫలకాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, డీఎంకే, బీఎస్పీ, ఎన్సీపీ ఎంపీలు వారికి మద్దతు పలికారు. ప్రభుత్వం తరఫున రాజ్‌నాథ్‌సింగ్‌, హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. కొందరు సభ్యులు ఇచ్చిన సావధాన తీర్మానంపై రాజ్యసభలో ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు ప్రత్యేక చర్చకు అనుమతించారు.


మాటలకందని విషాదమిది..

నిర్భయ తరహా ఘటనలు  నిత్యకృత్యమయ్యాయి

ప్రభుత్వ పరంగా చేయాల్సింది చేస్తాం

దిశ హత్యోదంతంపై  కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

ఈనాడు- దిల్లీ

  

అమానవీయ రీతిలో హైదరాబాద్‌లో చోటుచేసుకున్న యువ వైద్యురాలు దిశ హత్యాచార ఉదంతాన్ని ఖండించడానికి మాటలు రావడం లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. నిందితులకు కఠినమైన శిక్షలు విధించడానికి ప్రభుత్వపరంగా చేయాల్సిందంతా చేస్తామని స్పష్టంచేశారు. ఈ అంశంపై పూర్తిస్థాయిలో చర్చించి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని, ఎలాంటి చట్టం కావాలనుకున్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ‘‘హైదరాబాద్‌లో జరిగిన ఘటనకు మించిన అమానవీయ సంఘటన ఇంకొకటి ఉండదు. దేశం మొత్తం దీనిని ఖండిస్తోంది. అందరూ ఆవేదన చెందుతున్నారు. నిందితులకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలని పార్టీలకు అతీతంగా సభ్యులు ముక్త కంఠంతో కోరారు. నిర్భయ ఘటన తర్వాత కఠిన చట్టం తీసుకొచ్చారు. ఇక ఇలాంటి ఘటనలు సాధ్యమైనంత తగ్గుతాయని ప్రజలంతా అనుకున్నారు. అయినా ఇవి నిత్యకృత్యంగా మారాయి’’ అని రాజ్‌నాథ్‌ చెప్పారు.

పునరావృతం కాకూడదు: స్పీకర్‌ ఓం బిర్లా
‘‘ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రతిసారీ పార్లమెంటు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చింది. కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం చెప్పింది. చర్చకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినందున బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కచ్చితంగా చర్చ చేపడతాం. అత్యంత కఠినమైన చట్టాలు చేయడం... ఉన్న చట్టాల్లో అవసరమైన సవరణలు తీసుకురావడం... సభ ఏది నిర్ణయిస్తే దానిపై కచ్చితంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఘటనపై సభాముఖంగా విచారం వ్యక్తం చేస్తున్నా. ఇలాంటివి పునరావృతం కాకూడదని దేశం తరఫున కోరుకుంటున్నా’’ అని స్పీకర్‌ ఓం బిర్లా చెప్పారు.

దోషులకు ఉరి శిక్ష వేయాలి
‘‘అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో దుర్ఘటన జరిగింది. యువతి కనిపించట్లేదని తల్లిదండ్రులు పోలీసుస్టేషన్‌కు వెళ్తే తమ పరిధి కాదంటూ ఆలస్యం చేశారు. తర్వాత పోలీసులు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర హోంమంత్రి బాధ్యతారహితంగా మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రహదారుల వెంట మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుచేసి దోషులకు ఉరిశిక్ష వేయాలి.’’

- ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ

పోలీసుల వైఫల్యంతోనే ఘటన
‘‘పోలీసుల వైఫల్యంతోనే ఈ ఘటన జరిగింది. ఇలాంటి కేసుల్లో శిక్ష విధించగానే అమలయ్యేలా ఈ సమావేశాల్లో చట్టం తేవాలి. నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లయినా శిక్ష అమలుకాలేదు. తమిళనాడు, ఝార్ఖండ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్రలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ‘మన్‌కీ బాత్‌’లో మోదీ పలుమార్లు మహిళల రక్షణ గురించి చెప్పారు.’’

- రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ
ఉగ్రవాదుల తరహాలోనే కీచకులపైనా ఉక్కుపాదం: కిషన్‌రెడ్డి
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ- లైంగిక దాడులకు పాల్పడే వారిపైనా ఉగ్రవాదుల తరహాలోనే ఉక్కుపాదం మోపడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. హైదరాబాద్‌ ఘటన భయంకరమైందని, ఇకపై అలాంటివి జరగకూడదన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ‘‘ఇలాంటి ఘటనలపై కేంద్రం చాలా కఠిన వైఖరితో ఉంది. ఐపీసీ, సీఆర్‌పీసీల్లో సవరణలు తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీని బాధ్యతను కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌కు అప్పగించాం. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు కోరుతూ లేఖలు రాశాం. న్యాయశాఖ, పోలీసు విభాగాల సలహాలు అడిగాం. ముసాయిదా సిద్ధంగా ఉంది. సాధ్యమైనంత త్వరగా దీన్ని పార్లమెంటు ముందుకు తీసుకురావడానికి హోం మంత్రి అమిత్‌షా కృషి చేస్తున్నారు. ఇలాంటి సంఘటనల సమయంలో పోలీసులు చాలా క్రియాశీలంగా పనిచేయాలి. అన్ని పార్టీలు కలిసి సమస్యను పరిష్కరించాల్సి ఉంది. ఆపద సమయాల్లో ఆదుకునేందుకు 112 నంబరును అందుబాటులోకి తెచ్చాం. 100, 101, 102, 108... వీటన్నింటినీ దీనిలో సమీకృతం చేశాం. అన్ని ప్రాంతాల్లో ఇది మొదలైంది. తెలంగాణలో ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. దీనికి ఫోన్‌ చేస్తే బాధితురాలు ఎక్కడున్నారన్నది శాటిలైట్‌ ద్వారా తెలుసుకోవడానికి వీలవుతుంది’’ అని వివరించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.