close

ప్రధానాంశాలు

జాతీయ రైతు విధానం తీసుకురావాలి

తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు

ఈనాడు, దిల్లీ: విదేశాల్లో రైతులు కార్లలో తిరుగుతుంటే... మన రైతులు కాలి నడకన తిరుగుతున్నారని... రైతుల కష్టాలు రాష్ట్రానికో రకంగా ఉన్నందున అన్నింటి పరిష్కారానికి జాతీయ రైతు విధానం తీసుకురావాలని తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. ‘వివిధ కారణాలతో పంట నష్టం-రైతులపై వాటి ప్రభావం’పై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి కిసాన్‌ యోజన కింద దేశంలో ప్రతి రైతుకు ఎకరాకు రూ.6 వేలు ఇవ్వాలని ఆయన కోరారు. నదుల అనుసంధానం ద్వారా వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేసి సాగునీటి కష్టాలు తీర్చాలని కోరారు. తన నియోజకవర్గంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో పామాయిల్‌ సాగు చేస్తున్న రైతులకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు.

సర్‌... రైతుబిడ్డను బెల్‌ కొట్టొద్దు
పంట నష్టంపై నామా సుదీర్ఘంగా మాట్లాడుతుండడంతో సభాపతి స్థానంలో ఉన్న కొడికున్నల్‌ సురేష్‌ ముగించాలని బెల్‌ కొట్టారు. బదులుగా నామా... ‘సర్‌... నేను రైతు బిడ్డను.. రైతు నష్టాలపై మాట్లాడుతున్నా.. రెండు నిమిషాల సమయం ఇవ్వండి.. బెల్‌ కొట్టొద్దు’ అని విజ్ఞప్తి చేశారు.
ఇదే చర్చలో నాగర్‌కర్నూల్‌ ఎంపీ పి.రాములు మాట్లాడుతూ... రుణాల కోసం రైతులు బ్యాంకుల వద్దకు వెళ్లకుండా బ్యాంకులే రైతుల వద్దకు వెళ్లి రుణాలు ఇచ్చేలా చూడాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. పాడి, మత్స్య, కోళ్ల పరిశ్రమలను, ఉద్యాన పంటలను ప్రోత్సహించాలని ఆయన కోరారు.

ఏకాభిప్రాయంతోనే ఎన్‌హెచ్‌-65 సమస్య పరిష్కారం: నితిన్‌ గడ్కరీ
ఈనాడు, దిల్లీ: ప్రభుత్వ అధికారి, గుత్తేదారు సంస్థ ప్రతినిధి ఏకాభిప్రాయానికి వస్తేనే మియాపూర్‌-సంగారెడ్డి (ఎన్‌హెచ్‌-65) రహదారి సమస్య పరిష్కారమవుతుందని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో చేపట్టిన ఎన్‌హెచ్‌-65లో కొంత భాగం పూర్తిగా దెబ్బతిందని.. పనులు చేయకుండా గుత్తేదారు మధ్యవర్తిత్వానికి (ఆర్బిట్రేషన్‌) వెళ్లారని తెరాస లోక్‌సభాపక్ష ఉప నేత కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో గురువారం ఆయన ఈ సమస్యపై ప్రశ్నించారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ బదులిస్తూ మధ్యవర్తిత్వం అనేది పాక్షిక న్యాయ వ్యవస్థ అని, అందులో జోక్యం చేసుకోలేమన్నారు.
* హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ను నేరుగా అనుసంధానించే జాతీయ రహదారి లేదని గడ్కరీ తెలిపారు. వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ను కలిపే నాలుగు వరుసల రహదారిని హైదరాబాద్‌-యాదగిరి, యాదగిరి-వరంగల్‌గా చేసినట్లు పేర్కొన్నారు. మొదటి భాగం పనులు పూర్తయ్యాయని.. రెండో భాగం పనులు తుది దశలో ఉన్నాయని తెలిపారు.

తెలంగాణలో ఇళ్లు లేని పేదల వసతి కేంద్రాలు 28
దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజన జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్‌ కింద ఇళ్లు లేని పట్టణ పేదలకు తెలంగాణలో 55 వసతి కేంద్రాలు మంజూరు చేయగా, 28 నడుస్తున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరి తెలిపారు. చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ జి.రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి
నూతన విశ్వవిద్యాలయాల ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చొరవ చూపాలని కేంద్రం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపింది. భూపాలపల్లి జిల్లాలోని ములుగులో ఈ వర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ నిశాంక్‌ పోఖ్రియాల్‌ చెప్పారు. ఆయన గురువారం రాజ్యసభలో తెరాస ఎంపీ బడుగు లింగయ్య యాదవ్‌ అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు.

వినియోగించని సాక్షర నిధులు రూ.27.18 కోట్లు
సాక్షర భారత్‌లో భాగంగా కేంద్రవాటా ఇచ్చిన నిధుల్లో తెలంగాణ రూ.27.18 కోట్లు ఖర్చు చేయలేదని కేంద్రం పేర్కొంది. 2009-10 నుంచి 2017-18 వరకు రూ.282.91 కోట్లు కేంద్ర వాటాగా విడుదల చేశామని తెలిపింది. నిధులు ఖర్చు చేయని నేపథ్యలోనే తదుపరి విడుదల చేయడం లేదని స్పష్టం చేసింది. భాజపా సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రమేశ్‌ నిశాంక్‌ పోఖ్రియాల్‌ గురువారం రాజ్యసభలో ఈ జవాబిచ్చారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.