close

ప్రధానాంశాలు

అమరావతిని ఆపొద్దు

రౌండ్‌టేబుల్‌ సదస్సులో తీర్మానం
తప్పు చేస్తే చర్యలు తీసుకోండి
ఏపీ ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్‌

ఈనాడు అమరావతి: వైకాపా ప్రభుత్వం తప్పుడు వార్తలు ప్రచారం చేసి రాజధాని అమరావతిని చంపేయాలనుకుంటోందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజమెత్తారు. తాము తప్పులు చేసి ఉంటే చర్యలు తీసుకోవాలని ఆయన సవాల్‌ చేశారు. ‘‘మీరు తప్పులు చేసినట్టే అందరూ చేస్తారని ఎందుకనుకుంటున్నారు? రాజధానిలో బినామీ లావాదేవీలు జరిగితే ప్రాసిక్యూట్‌ చేయండి. ఆ నెపంతో అమరావతి నిర్మాణం ఆపేసి రాష్ట్రానికి ద్రోహం చేయొద్దు’’ అని మండిపడ్డారు.  ‘ప్రజా రాజధాని అమరావతి- ఉపాధి కల్పన, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన’ అన్న అంశంపై వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులతో తెదేపా గురువారం విజయవాడలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సదస్సులో చంద్రబాబు భావోద్వేగంతో మాట్లాడారు. ‘‘మనకూ ఒక గొప్ప రాజధాని నగరం ఉందని సగర్వంగా చెప్పుకునేందుకూ, ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని అమరావతికి శ్రీకారం చుట్టాం. నేను చేసింది తప్పు అని నిరూపించినా, ఈ ప్రాజెక్టు తప్పు అని ప్రజలు అన్నా... క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని అభాండాలు వేస్తున్నారు. ఫలానా చోట రాజధాని వస్తుందని ముందు నుంచీ చెబుతూనే ఉన్నాం. అక్కడ అంతా కలిపి 116 ఎకరాల క్రయ విక్రయాలు జరిగాయి. చిన్నచిన్న వాళ్లు కొనుక్కున్నారు. దానికి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అని పేరు పెడతారా?’’ అని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం వైఖరి చూస్తుంటే అమరావతిలో తూతూమంత్రంగా ఏవో చిన్న చిన్న రోడ్లు వేసి చేతులు దులిపేసుకునేలా కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. తెదేపా సదస్సుకి పోటీగా తుళ్లూరులో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆర్థిక మంత్రి బుగ్గన చేసిన ఆరోపణల్ని చంద్రబాబు తిప్పికొట్టారు. ఇదే సదస్సులో ‘గ్రాఫిక్‌ చిత్రాలు కాదు... నేలపై నిజాలు’ పేరుతో అమరావతిలో ఇంత వరకు జరిగిన అభివృద్ధిపై చంద్రబాబు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ‘‘హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ కట్టకముందు అక్కడ ఎకరం రూ.లక్ష ఉండేది. ఆ తర్వాత రూ.30 కోట్లకు వెళ్లింది. తెలుగుజాతి కోసందాన్ని నిర్మించాం’’ అని చంద్రబాబు అన్నారు.

ఈ సదస్సుకి సీపీఐ, జనసేన, లోక్‌సత్తా తదితర 14 పార్టీల నాయకులు, 21 సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. అమరావతిపై నెలకొన్న సందిగ్ధతలకు తెరదించాలని పేర్కొంటూ సమావేశం ఒక తీర్మానం ఆమోదించింది. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను యథాతథంగా అమలు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం పనుల్ని శరవేగంగా పూర్తి చేయాలని, అఖిలపక్షం వేయాలని ఏకగ్రీవంగా కోరింది. అనంతరం ‘సేవ్‌ అమరావతి’ పేరిట సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.