close

ప్రధానాంశాలు

జాబితాలో లేని ఆర్టీసీ ఛైర్మన్‌ పదవి

సంస్థ ప్రాంతీయ మండళ్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు జాబితాలోనే..
కొత్తగా కాళేశ్వరం, గురుకులాల సొసైటీకి చోటు
ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలకు రానున్న కొత్త ఛైర్మన్లు
ఈనాడు - హైదరాబాద్‌

లాభదాయక పదవుల జాబితాలో కీలకమైన ఆర్టీసీ ఛైర్మన్‌ పదవికి చోటు దక్కలేదు. ఈ పదవిని ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కేటాయించడానికి సీఎం విముఖంగా ఉన్నారని తెలుస్తోంది. వీరిని ఆయా సంస్థల ఛైర్మన్లుగా నియమించేందుకు వీలుగా రాష్ట్రప్రభుత్వం లాభదాయక పదవుల కింద ఎంపిక చేసిన కార్పొరేషన్ల జాబితాను గురువారం విడుదల చేసింది. దీనికి సంబంధించి ఆర్డినెన్స్‌ను బుధవారం జారీ చేయగా, అందులో కార్పొరేషన్ల వివరాలు ఇవ్వలేదు. గురువారం వాటిని వెల్లడించింది. ఇందులో 29 కార్పొరేషన్లు ఉన్నాయి. సంస్థ ప్రాంతీయ మండళ్లను, పట్టణాభివృద్ధి సంస్థలను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య 50కి చేరనుంది. కానీ కీలకమైన ఆర్టీసీ ఛైర్మన్‌ పదవి ఇందులో లేకపోవడం గమనార్హం. రాష్ట్రస్థాయి ఛైర్మన్‌ పదవి లేకపోయినా ఆర్టీసీ ప్రాంతీయ మండళ్ల ఛైర్మన్లు, డైరెక్టర్లకు అవకాశం కల్పించింది. దీన్ని మొదట్లో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డికి ఇవ్వాలని భావించినా ఆయన ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత పరిణామాల్లో సీఎం.. ఆర్టీసీ ఛైర్మన్‌ నియామకం వద్దనుకున్నట్లు తెలిసింది.  మరోవైపు గురుకుల విద్యాసంస్థల సొసైటీ, జెన్‌కో, ట్రాన్స్‌కో, విద్యుత్‌ పంపిణీ సంస్థలు జాబితాలోకి వచ్చాయి. తెరాస అధికారంలోకి వచ్చాక ఈ పదవులకు ఛైర్మన్ల నియామకం జరగలేదు. కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు సంస్థను కొత్తగా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన ప్రభుత్వం దీనిని తాజా జాబితాలో చేర్చింది. తెలంగాణలో 820కి పైగా గురుకులాలున్నాయి. దానికి సంబంధించిన సొసైటీని జాబితాలో చేర్చి ఛైర్మన్‌ నియామకం జరపనుంది. రాష్ట్రంలో కాళేశ్వరం అతిపెద్ద ప్రాజెక్టుగా ఆవిర్భవించింది. జెన్‌కో, ట్రాన్స్‌కోలు ముఖ్యమైనవే. వీటికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఛైర్మన్లుగా నియమితులయ్యే అవకాశం ఏర్పడింది.


ఛైర్మన్‌ పదవుల జాబితా ఇది

తెలంగాణ అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌, రాష్ట్ర రైతు సమన్వయ సమితి, మూసీ పరివాహక అభివృద్ధి సంస్థ, కార్మిక సంక్షేమ మండలి, భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి, రహదారుల అభివృద్ధి సంస్థ, కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు సంస్థ, యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (వైటీడీఏ), వేములవాడ దేవాలయ ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ, హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి ప్రాధికార సంస్థ (హెచ్‌ఎండీఏ), కులీ కుతుబ్‌షా నగరాభివృద్ధి సంస్థ, రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థలు, క్రీడా ప్రాధికార సంస్థ, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్‌, హైదరాబాద్‌ నగర గ్రంథాలయ సంస్థ, తెలుగు అకాడమీ, హాకా, అధికార భాషాసంఘం, గురుకుల విద్యాలయాల సంస్థల సొసైటీ, హజ్‌ కమిటీ, సాంఘిక సంక్షేమ మండలి, ఆహార కమిషన్‌, సెట్విన్‌, సాహిత్య అకాడమీ, రోడ్డు రవాణా సంస్థ ప్రాంతీయ మండళ్ల ఛైర్మన్లు/డైరెక్టర్లు, విద్యుదుత్పాదన సంస్థ (జెన్‌కో), విద్యుత్‌ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో), విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కం)లు, రాష్ట్ర యోగాధ్యయన పరిషత్‌.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.