close

ప్రధానాంశాలు

గ్రేటర్‌ ట్రాఫిక్‌ కమిషనరేట్‌

మూడు కమిషనరేట్ల విలీనానికి ప్రణాళిక
రహదారుల సమగ్రాభివృద్ధికి చర్యలు
ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రి కేటీఆర్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రహదారులపై ట్రాఫిక్‌ సమస్యలు, వాహనదారుల భద్రత, ఇతరత్రా అంశాల్లో సమన్వయలేమికి స్వస్తి పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గ్రేటర్‌ పరిధిలో మూడు పోలీస్‌ కమిషనరేట్లలోని ట్రాఫిక్‌ పోలీసుల విభాగాలను విలీనం చేసేందుకు ప్రణాళిక రచించింది. సంబంధిత ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. వాహన రద్దీ లేకుండా రహదారులను అభివృద్ధి చేయడంపై గురువారం బుద్ధభవన్‌లో ట్రాఫిక్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్తు, టీఎస్‌ఐఐసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ‘‘రోడ్డు మార్గాలపై ట్రాఫిక్‌ నిబంధనల అమలు, జరిమానాల విధింపు, కేసుల నమోదు, ఇతర అంశాల్లో ఒక్కో కమిషనరేట్‌ ఒక్కోలా చర్యలు తీసుకుంటోంది. వాహనాల నియంత్రణలో సమన్వయం కుదరట్లేదు. గంటల పాటు వాహనదారులు రోడ్లపై నిలుస్తున్నారు. ప్రముఖుల పర్యటనల ఏర్పాట్లలోనూ లోపాలు కనిపిస్తున్నాయి. ఒక్కో ప్రాంతం, ఒక్కో కమిషనరేట్‌ పరిధిలో ఉండటం అందుకు కారణం. అధికారుల మధ్య సమన్వయం కొరవడి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వాటిని నివారించేందుకు గ్రేటర్‌ పరిధిలోని మూడు ట్రాఫిక్‌ విభాగాలను ఒకే గొడుకు కిందకు తేవాలని నిర్ణయించాం.’’ అని అధికారులకు వివరించారు.

సౌకర్యవంతమైన రహదారులు
అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగర రోడ్లను వాహనాలు, పాదచారుల సౌకర్యవంతమైన ప్రయాణానికి అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలి. ట్రాఫిక్‌ వ్యవస్థను శాస్త్రీయంగా క్రమబద్ధీకరించాలి. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు నగరాల్లో ప్రజా రవాణా వినియోగం మెరుగ్గా ఉంది. ముంబయిలోనూ ఇటీవల ప్రజారవాణాను ఉపయోగించే వారి సంఖ్య 72 లక్షల నుంచి 1.2 కోట్లకు పెరిగింది. నాణ్యమైన రహదారులను అందుబాటులోకి తీసుకొస్తే హైదరాబాద్‌లోనూ అది సాకారమవుతుంది. మెట్రో రైలు, ఎంఎంటీఎస్‌ మార్గాలు, బస్‌ స్టేషన్లు, ప్రధాన రహదారులకు ఇరువైపులా కాలిబాటలు, లైన్‌ మార్కింగ్‌లు ఉండాలి. రోడ్లపై సైకిళ్లకు ప్రత్యేక లైన్‌ కేటాయించాలి. పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలి. పార్కింగ్‌ వసతి పెంపు, ఖాళీ స్థలాలను పార్కింగ్‌ కేంద్రాలుగా మార్చే విషయమై యజమానులతో సంప్రదింపులు జరగాలి. వాణిజ్య ప్రాంతాల్లోని సెట్‌బ్యాక్‌ స్థలాలను కాలిబాటలకు ఉపయోగిస్తాం’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

లేఅవుట్ల ఖాళీ స్థలాల్లో ప్రజా మరుగుదొడ్లు
‘‘అధికారిక లేఅవుట్లలోని ఖాళీ స్థలాల్లో ప్రజలకు ఉపయోగపడేలా ప్రజా మరుగుదొడ్లు, బస్‌షెల్టర్లు, స్కైవేలు, ఉద్యానవనాలు నిర్మించాలి. రహదారుల సమగ్రాభివృద్ధి(సీఆర్‌ఎం) ప్రాజెక్టులో భాగంగా 709 కి.మీల ప్రధాన రోడ్ల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాం. ఈనెల 9 నుంచి పనులు మొదలయ్యేందుకు జోనల్‌ కమిషనర్లు చర్యలు తీసుకోవాలి. ఐదేళ్లపాటు రోడ్లను చూసుకునే బాధ్యత ఏజెన్సీలదే’’ అని చెప్పారు.

మహిళల భద్రతపై చర్చ
‘‘అన్ని శాఖల అధికారులు మహిళల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. నగరంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలి. ఆ మేరకు చీకట్లు, నిర్మానుష్య ప్రాంతాలను గుర్తించండి.. టోల్‌ఫ్రీ నెంబరు 100కు విస్తృత ప్రచారం కల్పించండి. మద్యం దుకాణాలు, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో బహిరంగ మద్యపానం చేసేవారిపై చర్యలు తీసుకోండి. సంబంధిత దుకాణాలు మూసేయాలి. పార్కులు, ఖాళీ స్థలాలు అసాంఘిక శక్తులకు అడ్డాలుగా మారకూడదు. నగరంలో ప్రస్తుతం 4లక్షలకు పైగా వీధి దీపాలున్నాయి. అవసరమైన రహదారులు, వీధులు, ఖాళీ స్థలాల్లో మరిన్ని ఏర్పాటుచేస్తాం. మహిళా ఉద్యోగుల భద్రతపై బల్దియా చేపట్టిన అవగాహన కార్యక్రమాలు అభినందనీయం’’ అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

రోడ్ల నిర్వహణను ప్రైవేటుకు ఇవ్వాలన్న ఆలోచన తనకు 25 ఏళ్ల కిందటే వచ్చిందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. నిర్వహణ సక్రమంగా లేక మనదేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ట్రాఫిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థను ఆధునికీకరించేందుకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, ముఖ్య ఇంజినీరు జియావుద్దీన్‌, సీసీపీ దేవేందర్‌రెడ్డి, పోలీసు కమిషనర్లు అంజనీకుమార్‌, సజ్జనార్‌, మహేశ్‌ భగవత్‌, ఏసీపీలు, బల్దియా అదనపు కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.