close

ప్రధానాంశాలు

రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌!

ఆరోగ్యశ్రీ పక్కన ఈ పథకం పేరూ చేర్పు
కేంద్ర పథకం అమలుతో అదనంగా 400 చికిత్సలు అందుబాటులోకి
సుమారు రూ.250 కోట్ల వరకు రాష్ట్రానికి నిధులు
చికిత్సల ధరలు, అమలుతీరులో మార్పులు చేయనక్కర్లేదు
కేంద్ర ఆరోగ్య ఉన్నతాధికారుల ప్రతిపాదనలు
గవర్నర్‌ సమక్షంలో రాష్ట్ర వైద్యాధికారులతో భేటీ

ఈనాడు- హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక కేంద్ర పథకం ‘ఆయుష్మాన్‌ భారత్‌’ త్వరలో రాష్ట్రంలోనూ అమల్లోకి రానుందా? ఆరోగ్యశ్రీ పేరు పక్కన ఆయుష్మాన్‌ భారత్‌ పేరును కూడా చేర్చి సంయుక్తంగా నిరుపేదలకు ఉచిత వైద్య పథకాలను తెలంగాణలో అమలు చేయనున్నారా? అంటే.. ఈ ప్రశ్నలకు ప్రస్తుతానికి స్పష్టమైన సమాధానం రాకపోయినా, జరుగుతున్న పరిణామాలను బట్టి సానుకూల వాతావరణమే ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సమక్షంలో జరిగిన భేటీలో తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ అమలుపై రాష్ట్ర ఉన్నతాధికారులకు ఉన్న సందేహాలన్నింటిపైనా కేంద్ర ఆరోగ్య ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కేంద్ర పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను  విడమర్చి చెప్పడంతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథక నిబంధనలను, చికిత్సల ధరలను యథాతథంగా కొనసాగించడానికి కూడా తమకు అభ్యంతరాలు లేవని కేంద్ర అధికారులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. కేంద్ర అధికారులు చేసిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని వైద్యఆరోగ్యశాఖ అధికారులు తెలిపినట్లు సమాచారం.

సీఎం సూచనల మేరకు..
కొద్దిరోజుల కిందట గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ అయిన సందర్భంగా రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ పథకం అమలుపై చర్చకొచ్చినట్లు తెలిసింది. దేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 33 చోట్ల ఈ పథకం విజయవంతంగా అమలవుతోందని, రాష్ట్రంలోనూ ఎందుకు అమలు చేయకూడదని, దీనివల్ల రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందడంతో పాటు కేంద్రం నుంచి అదనపు నిధులు సమకూరుతాయని గవర్నర్‌ ప్రస్తావించినట్లు సమాచారం. దీనిపై స్పందించిన సీఎం.. అమలులో సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి గవర్నర్‌ సమక్షంలో భేటీకి రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే గురువారం గవర్నర్‌ సమక్షంలో కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు సమావేశమైనట్లు సమాచారం.


రాష్ట్రం లేవనెత్తిన అంశాలు..

* తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద 77.19 లక్షల కుటుంబాలకు 946 రకాల చికిత్సలను పూర్తి ఉచితంగా అందజేస్తున్నారు.
* ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఉండగా..గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు తదితర అవయవ మార్పిడి చికిత్సలకు గరిష్ఠంగా రూ.13 లక్షల వరకు అందిస్తున్నారు.
* ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ.782.7 కోట్లను ఖర్చుచేస్తోంది.
* ఆయుష్మాన్‌ భారత్‌ను అమలు చేస్తే.. ఆ పథకం కింద 26.11 లక్షల కుటుంబాలకే చికిత్సలు వర్తింపజేస్తారు. మిగిలినవారి పరిస్థితి ఏమిటి?
* చికిత్సల ధరలు ఆరోగ్యశ్రీ కంటే తక్కువగా ఉన్నాయి. వాటిని రాష్ట్రంలో అమలు చేస్తే ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశముంది?
* చెల్లింపులు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా చెల్లిస్తుండగా.. ఆయుష్మాన్‌ భారత్‌ అమలైతే చెల్లింపులెలా?


కేంద్రం ప్రతిపాదనలు

* ఆయుష్మాన్‌ భారత్‌ పథకం పరిధిలోకి రావడం వల్ల మొత్తంగా 1350 రకాల చికిత్సలు పూర్తిగా ఉచితం.
* దీనివల్ల ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీలో చేర్చని చికిత్సలు, ఆయుష్‌ వైద్య సేవలు కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.
* ప్రస్తుతం ప్రతి కుటుంబానికి ఏడాదికి ఉన్న రూ.2 లక్షల గరిష్ఠ పరిమితి.. రూ.5 లక్షలకు పెరుగుతుంది.
* ప్రస్తుత అవయవ మార్పిడి చికిత్సలను ఆరోగ్యశ్రీ కిందనే కొనసాగించవచ్చు.
* ఆయుష్మాన్‌ భారత్‌ చికిత్సల ధరలను యథాతథంగా అమలు చేయనక్కర్లేదు. ఆరోగ్యశ్రీ పరిధిలో అమలవుతున్న చికిత్సల ధరలను రాష్ట్రంలో కొనసాగించుకోవచ్చు.
* కొత్తగా అందుబాటులోకి వచ్చే చికిత్సల ధరలను ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలో అమలుచేసుకోవచ్చు.
* ఈ పథకం పరిధిలోకొచ్చే కుటుంబాలకయ్యే మొత్తం ఖర్చులో 60శాతాన్ని కేంద్రం చెల్లిస్తుంది. అంటే సుమారుగా ఏడాదికి రూ.200-250కోట్ల వరకు కేంద్రంనుంచి రాష్ట్రానికి వస్తాయి. ఆ మేరకు రాష్ట్రానికి ఆర్థికంగా మేలుచేకూరుతుంది.
* చెల్లింపులు నేరుగా లబ్ధిదారులకు కాకుండా.. రాష్ట్ర వాటా నిధులు ఆరోగ్యశ్రీ ట్రస్టు ఖాతాలోకే చేరవేస్తాం.
* ఆయుష్మాన్‌ భారత్‌ దేశవ్యాప్తంగా అమలవుతుండటం వల్ల.. తెలంగాణ ప్రజలు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా చికిత్స పొందే వెసులుబాటు ఉంటుంది.
* ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడికొచ్చి చికిత్స పొందడానికి మార్గం సులభతరమవుతుంది. తద్వారా రాష్ట్రానికి పరోక్షంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.