close

ప్రధానాంశాలు

దుమ్ముగూడెం వద్ద బ్యారేజి

37 టీఎంసీల గోదావరి నీటి నిల్వ
320 మెగావాట్ల జల విద్యుత్కేంద్రం నిర్మాణం
అంచనాలు రూపొందించి, నెలాఖరులోగా టెండర్లు
కాళేశ్వరం నుంచి మధ్యమానేరుకు మూడు టీఎంసీలు
అందులోంచి మల్లన్న సాగర్‌కు రెండు టీఎంసీలు
సీతారామ ప్రాజెక్టులో మిగిలిన పనులకు టెండర్లు
నీటిపారుదల సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు

దుమ్ముగూడెం వద్ద గోదావరిలో పుష్కలమైన నీటి లభ్యత ఉంది. 150 రోజులు ప్రవాహం ఉంటుంది. జల విద్యుదుత్పత్తికి అవకాశం ఉంది. బ్యారేజి, జలవిద్యుత్‌ కేంద్రం నిర్మిస్తాం. వీలైనంత తక్కువ భూసేకరణతో, నదిలోనే నీరు ఆగేలా బ్యారేజి డిజైన్‌ను రూపొందిస్తాం.

-సీఎం కేసీఆర్‌

 

 

ఈనాడు, హైదరాబాద్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద 37 టీఎంసీల గోదావరి నీటిని నిల్వ చేసేందుకు కొత్త బ్యారేజి, 320 మెగావాట్ల జలవిద్యుత్‌ ఉత్పత్తి కోసం ప్లాంటు నిర్మించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మధ్యమానేరుకు మూడు టీఎంసీల నీటి ఎత్తిపోతలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ రెండు పనులకు మొత్తం రూ.13,500 నుంచి రూ.14,000 కోట్లు ఖర్చవుతుందన్నారు. దీనికి సంబంధించి వెంటనే అంచనాలు రూపొందించి, టెండర్లు పిలవాలని ఆయన అధికారులను ఆదేశించారు. తదుపరి మంత్రివర్గ సమావేశంలో ఈ రెండు పనులకు సంబంధించి ఆమోదం తీసుకుంటామన్నారు. వీటితోపాటు మల్లన్నసాగర్‌కు రెండో టీఎంసీ తరలించే పనులకు, సీతారామ ప్రాజెక్టులో మిగిలిన పనులకు కూడా వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. కంతనపల్లి బ్యారేజి పనులను వచ్చే మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్ర భారీ, మధ్యతరహా, చిన్న నీటివనరులు అంటూ తేడా లేకుండా నీటి పారుదలశాఖ అంతా ఒకటే విభాగంగా పనిచేయాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రాన్ని ఆరేడు నీటిపారుదల జోన్లుగా విభజించుకోవాలని, ఒక్కో జోన్‌కు ఒక్కో ఈఎన్‌సీ ఇన్‌ఛార్జిగా వ్యవహరించి, తన పరిధిలోని నీటిపారుదల వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించాలని కోరారు. సాగునీటి వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన నిధులను బడ్జెట్లోనే కేటాయించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులు, సాగునీటి కల్పనపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. దాదాపు అయిదు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, జెన్‌కో, ట్రాన్స్‌కోల ఛైర్మన్‌ దేవులపల్లి ప్రభాకర్‌రావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగరావు, కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఈఎన్సీలు మురళీధర్‌రావు, హరిరాం, వెంకటేశ్వర్లు, బి.నాగేంద్రరావు, జెన్‌కో డైరెక్టర్‌ వెంకట్రాజం, ట్రాన్స్‌కో డైరెక్టర్లు సూర్యప్రకాశ్‌, నర్సింగ్‌రావు, నీటి పారుదలశాఖ సలహాదారు పెంటారెడ్డి, విశ్రాంత ఇంజినీర్లు శ్యాంప్రసాద్‌రెడ్డి, చంద్రమౌళి, వెంకటరామారావు, ఇంద్రసేనారెడ్డి, ప్రత్యేకాధికారి శ్రీధర్‌ దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.

మూడు టీఎంసీలను లిఫ్టు చేయాలి
సీఎం మాట్లాడుతూ ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మధ్యమానేరుకు ప్రస్తుతం రెండు టీఎంసీల నీటిని పంప్‌ చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి రోజుకు మూడు టీఎంసీలను లిప్టు చేయాలి. అందులోంచి రెండు టీఎంసీలను మల్లన్న సాగర్‌కు పంపాలి. దుమ్ముగూడెం వద్ద జలవిద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించడానికి, కాళేశ్వరం నుంచి మూడు టీఎంసీలు ఎత్తిపోయడానికి అనుగుణంగా విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఆ శాఖ అధికారులు ఏర్పాట్లు చేయాలి.

త్వరలో వర్క్‌షాపు
నీటిపారుదల శాఖ ముఖ్య అధికారులంతా రాబోయే కొద్ది రోజుల్లోనే రాష్ట్ర స్థాయి వర్క్‌ షాపు నిర్వహించుకుని, తెలంగాణ సమగ్ర నీటిపారుదల విధానాన్ని ఖరారు చేయాలి. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, లిఫ్టులు, చెరువులకు సంబంధించిన అన్ని వివరాలతో సమగ్ర జాబితా తయారు చేయాలి. అన్ని ప్రాజెక్టులు, పంపుహౌస్‌లు, లిఫ్టులు, కాల్వలు, చెరువుల నిర్వహణకు అవసరమైన వ్యూహాన్ని, మాన్యువల్స్‌ ఖరారు చేయాలి. నీటిపారుదల విధానం, ఇన్వెంటరీ, నిర్వహణ వ్యూహం ఖరారైన తర్వాత, రాష్ట్ర స్థాయి నీటిపారుదల సదస్సు నిర్వహిస్తాం.

నాగార్జునసాగర్‌ ఆయకట్టు కోసం
కృష్ణా నదిలో నీటిప్రవాహం లేని సమయంలో నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీరందించే ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించాలి. మధ్యమానేరుకు మూడు టీఎంసీల నీళ్లు వస్తాయి. కాబట్టి పుష్కలమైన జలం అందుబాటులో ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటితో బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నింపి, అక్కడి నుంచి షామీర్‌పేట వాగు, మూసీ నది, ఆసిఫ్‌ నహర్‌కు నీటిని తరలించాలి. ఉదయ సముద్రాన్ని బైపాస్‌ చేసి పానగల్‌ వాగులో కలపాలి. అక్కడి నుంచి నేరుగా నాగార్జునసాగర్‌ ఆన్‌లైన్‌ రిజర్వాయర్‌ అయిన పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌కు నీటిని చేర్చాలి. దీనిద్వారా గోదావరి నీటిని సాగర్‌ ఆయకట్టుకు అందించవచ్చు. ఈ పనులపై సంపూర్ణ అవగాహన వచ్చేందుకు నీటిపారుదలశాఖ అధికారులు, విశ్రాంత ఇంజినీర్లు త్వరలోనే ఈ ప్రాంతాల్లో పరిశీలించాలి. గోదావరి బేసిన్‌లో మల్లన్నసాగర్‌ వద్ద, కృష్ణా బేసిన్‌లో పాలమూరు ఎత్తిపోతల పథకం వద్ద నీటిపారుదలశాఖ అధికారులు సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలి’’ అని ఆదేశించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.