close

ప్రధానాంశాలు

అకృత్యాలు.. దండనలో నిర్లక్ష్యాలు

సంచలన కేసుల్లోనూ అమలు కాని ఉరిశిక్ష తీర్పులు
నేతల ప్రమేయం ఉన్న కేసుల్లో ఫిర్యాదుదారులకు తప్పని వేధింపులు

ప్రజాస్వామ్యంలో మనం చేసుకున్న చట్టాలే.. మన ‘అమ్మాయిల’ మాన ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోతున్నాయి. ఆడపిల్లలపై ఎడతెగని అకృత్యాలు సమాజపు నాగరికతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అనేక కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం, నేరస్థులకు కొమ్ముకాస్తున్న అధికారులు, రాజకీయ నేతల ధోరణులు విస్తుగొలుపుతున్నాయి. చాలాసార్లు కోర్టుల జోక్యంతో తప్ప బాధితులకు రక్షణ, చట్టబద్ధ విచారణ జరగని పరిస్థితులు నెలకొన్నాయి. న్యాయస్థానాలు ఉరిశిక్షలు విధిస్తున్నా.. అమలు మాత్రం కావడంలేదు. అలాంటి కొన్ని దారుణ ఘటనలు, విచారణల తీరు ఇలా...

రిజర్వులోనే నిర్భయ కేసు తీర్పు

2012 డిసెంబరు 16న దిల్లీలో నడుస్తున్న బస్సులో యువతి(23)పై సామూహిక హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఘటన జరిగిన 13 రోజుల తర్వాత ఆమె ప్రాణాలు కోల్పోయింది. నిందితులందర్నీ అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తుండగానే ఒకడు ఉరేసుకున్నాడు. మిగిలిన వారిపై 2013 జులై 8న ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ ముగించారు. నిందితుల్లోని ఒక బాలుడు మినహా మిగిలిన నలుగురికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. నిందితుల తరఫు న్యాయవాదులు దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా కింది కోర్టు తీర్పును సమర్థించింది. న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్లగా నిందితులు దారుణమైన ఘటనకు పాల్పడ్డారని, వారి చర్యతో సమాజం వణికిపోయిందని వ్యాఖ్యానిస్తూ తీర్పును రిజర్వు చేసింది.


శక్తి మిల్లు సామూహిక అత్యాచారాలు

2013, ఆగస్టు 22న దక్షిణ ముంబయిలోని పాడుబడిన శక్తి మిల్లు ఫొటోలు తీయడానికి వెళ్లిన ఒక ఆంగ్ల మాసపత్రిక ఫొటో జర్నలిస్టు (22)పై మిల్లు ప్రాంగణంలో అయిదుగురు వ్యక్తులు సామూహికంగా అత్యాచారం చేశారు. తర్వాత ఓ కాల్‌సెంటర్‌ ఉద్యోగిని(18) సైతం తాను కూడా అదే ఏడాది జులై 31న అయిదుగురి చేతిలో సామూహిక అత్యాచారానికి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు కేసుల్లో ముగ్గురికి మరణశిక్ష విధిస్తూ ముంబయి సెషన్స్‌ కోర్టు 2014, ఏప్రిల్‌ 4న తీర్పు ఇచ్చింది. శిక్ష ఇంకా అమలు కాలేదు.


పొలాచ్చి  వణుకు పుట్టిస్తున్న ఉదంతం

ఈ ఏడాది ఫిబ్రవరి 12న తమిళనాడు పొలాచ్చిలో కళాశాల విద్యార్థిని(19)ని పరిచయస్తులైన శబరిరాజన్‌, తిరునవక్కరుసు.. సతీష్‌, వసంతకుమార్‌ అనే మరో ఇద్దరితో కలిసి కారులో వివస్త్రను చేసి, సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. తాము పిలిచినప్పుడు వచ్చి కోరిక తీర్చాలని, పోలీసులకు చెబితే వీడియోలను ఇంటర్నెట్‌లో పెడతామని బెదిరించారు. దీనిపై ఆమె సోదరుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు లైంగిక వేధింపుల రాకెట్‌ను వెలుగులోకి తెచ్చారు. నలుగురు నిందితులపై ఫిబ్రవరి 24న అత్యాచారం, వేధింపులు, దోపిడీ కేసు నమోదు చేశారు. నిందితులు దాదాపు 200 మంది యువతులు, మహిళల్ని ఇలానే వేధించినట్లు విచారణలో తేలింది. ఫిర్యాదు చేసిన విద్యార్థిని సోదరుడిపై ఫిబ్రవరి 25న నలుగురు వ్యక్తులు దాడిచేశారు. కేసులో పోలీసులు బార్‌ నాగరాజు (ఏఐడీఎంకే కార్యకర్త) అనే అయిదో వ్యక్తినీ నిందితుడిగా చేర్చారు. క్రమంగా కేసు రాజకీయ రంగు పులుముకుంది. నాగరాజును కేసులో ఇరికించారంటూ ఏఐడీఎంకే విమర్శించింది. అదే సమయంలో నక్కీరన్‌ పత్రిక ఎడిటర్‌ గోపాల్‌... మొత్తం రాకెట్‌లో తమిళనాడు డిప్యూటీ స్పీకర్‌ జయరామన్‌ కుమారుల ప్రమేయం ఉందంటూ వీడియో విడుదల చేశారు. దీన్ని జయరామన్‌ ఖండించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా స్థానిక ఎస్పీ బాధితురాలి పేరును వెల్లడించడం దుమారం రేగింది. తమిళనాడు హైకోర్టు.. ఎస్పీపై చర్యలకు ఆదేశించగా... పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌లోని వీడియోలు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌ అవుతూనే ఉన్నాయి. వాటిని తొలగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కేసు విచారణలో ఉంది.


ఉన్నావ్‌  బాధితురాలిపై దారుణ దాష్టీకం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ బాలిక (17) కష్టాల కన్నీటి గాథ దుర్మార్గుల అకృత్యాలకు పరాకాష్ఠ. 2017 జూన్‌ 4న సాక్షాత్తూ ఎమ్మెల్యే ఇంటిలోనే ఆమె దారుణ అత్యాచారానికి గురైంది. తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ఆమెపై కొందరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అప్పటి భాజపా ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగారే ఈ కేసులో ప్రధాన నిందితుడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా.. ఆ తర్వాత నెలల తరబడి ఎన్నో కష్టనష్టాలకు గురైంది. ఆమె తండ్రి పోలీసు కస్టడీలో చనిపోయారు. నిందితులు చేయించినట్లుగా భావిస్తున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సమీప బంధువులను కోల్పోయింది. తాను కూడా తీవ్రంగా గాయపడింది. ఈ కేసులన్నీ విచారణలో ఉన్నాయి. (2018లో జరిగిన మరో ఘటనకు సంబంధించిన బాధితురాల్ని ఇటీవల నిందితులే సజీవదహనం చేశారు)


కశ్మీర్‌ ముక్కుపచ్చలారని కథువా బాలికపై రాక్షసకాండ

2018, జనవరి 10న జమ్ము-కశ్మీర్‌లోని కథువా సమీప రస్న గ్రామానికి చెందిన సంచార ముస్లిం దంపతులు తమ కుమార్తె(8) కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం తర్వాత గ్రామ సమీప అడవిలో బాలిక శవమై కనిపించింది. పోలీసులు నిందితులను అరెస్టు చేసి, 8మందిపై ఛార్జిషీట్‌ నమోదు చేశారు. బాలికను బంధించారని, ఆహారం ఇవ్వకుండా హింసించారని, అత్యాచారం చేశారని తీవ్ర నిరసనలు వెల్లువెత్తగా... నిందితులకు మద్దతుగా ఓ పార్టీ కార్యకర్తలు ర్యాలీ తీశారు. సీబీఐతో స్వతంత్ర దర్యాప్తు చేయాలని నిర్వహించిన మరోర్యాలీలో ఇద్దరు భాజపా రాష్ట్ర మంత్రులు పాల్గొనడం చర్చనీయాంశమైంది. తర్వాత వారిద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ ఏడాది జూన్‌ 10న న్యాయస్థానం ఈ కేసులో ముగ్గురికి యావజ్జీవ, ముగ్గురికి అయిదేళ్ల కారాగార శిక్ష విధించింది. తప్పుడు సాక్ష్యం ఇవ్వాలంటూ సాక్షులను హింసించిన ఆరోపణలపై సిట్‌లోని ఆరుగురు సభ్యులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని అక్టోబరులో కోర్టు ఆదేశించింది.


ముజఫర్‌పుర్‌  షెల్టర్‌ హోం కేసు

బిహార్‌లోని ముజఫర్‌పుర్‌లోని ఆశ్రయ కేంద్రంలో పదుల సంఖ్యలో బాలికలను లైంగికంగా, శారీరకంగా హింసించిన కేసు సంచలనం సృష్టించింది. బిహార్‌ పీపుల్స్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే బ్రజేశ్‌ఠాకూర్‌ ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ ఉదంతం 2018, మే 26న వెలుగులోకి వచ్చింది. కేసు విచారణ చేసిన సీబీఐ తమ వద్ద మొత్తం 20 మందిపై తగిన సాక్ష్యాలు ఉన్నాయని పోస్కో కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం విచారణ ముగియగా... ఈనెల 12న తీర్పు వెలువడే అవకాశముంది.

- ఈనాడు, ప్రత్యేక విభాగం

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.