close

ప్రధానాంశాలు

అధికార పీఠాలపై యువ కెరటాలు

34 ఏళ్లకే ఫిన్లాండ్‌ ప్రధాని పదవి
రికార్డు సృష్టించిన సనా మారిన్‌

ముప్పయి నాలుగేళ్లకే.. ఓ మహిళ.. ఓ దేశానికి ప్రధాని అయ్యారంటే ఆశ్చర్యంగా ఉందా? రాజరికాల్లోనో, రాజరికం ఇప్పటికీ ఉన్న దేశాల్లోనో కాదు.. ప్రజాస్వామ్య దేశంలోనే.. నేతల వారసురాలిగా కాదు.. స్వీయ ప్రయత్నంతోనే అనోయింట్స్‌ సనామారిన్‌ 34 ఏళ్లకే ఫిన్లాండ్‌ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈమే కాదండోయ్‌.. మొత్తం పది దేశాలను 40 ఏళ్లు, ఆ లోపు వారే ప్రస్తుతం నడిపిస్తున్నారంటే 21వ శతాబ్దంలో యువత సత్తా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వివిధ దేశాల ప్రధానులుగా, అధినేతలుగా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా సాగుతున్న పలువురు పిన్న వయసు నేతల వివరాలివీ..

హెల్సింకీ: ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన ప్రధానిగా ఫిన్లాండ్‌కు చెందిన సనా మారిన్‌ ప్రత్యేకత సాధించనున్నారు. ఫిన్లాండ్‌ ప్రధాని అన్‌టి రిన్నే ఆ పదవి నుంచి వైదొలగడంతో నిర్వహించిన ఓటింగ్‌లో సమీప ప్రత్యర్థి అన్‌టీలిండ్‌మన్‌పై విజయం సాధించారు. 34 ఏళ్ళ సనా మారిన్‌ ఫిన్లాండ్‌లో అయిదుపార్టీల సంకీర్ణ సర్కారుకు సారథ్యం వహిస్తారు. ఈ వారంలోనే ప్రమాణస్వీకారం  చేస్తారు. ఈదేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించనున్న మూడో మహిళ సనామారినే అవుతారు. సోషల్‌ డెమాక్రాటిక్‌ పార్టీకి చెందిన ఆమె ప్రస్తుతం ఫిన్లాండ్‌ రవాణా, కమ్యూనికేషన్ల మంత్రిగా ఉన్నారు.


 

ఒలెక్సీ హన్‌చరక్‌ (35)

ఉక్రెయిన్‌ ప్రధానిగా ఈ ఏడాది ఆగస్టులో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు న్యాయవాద వృత్తిలో ఉన్నారు. ఈయన తండ్రి కూడా రాజకీయ నాయకుడే.
* ఉక్రెయిన్‌ జనాభా: 4.25 కోట్లు
* ప్రపంచంలో 46వ అతిపెద్ద దేశం 


నయిబ్‌ బుకెలి (38)

ఎల్‌సాల్వెడార్‌ అధ్యక్షుడిగా ఈ ఏడాది జూన్‌లో బాధ్యతలు స్వీకరించారు. 18 ఏళ్ల వయసులోనే సొంత కంపెనీ ఏర్పాటు ద్వారా గుర్తింపు పొందారు. 2012లో న్యూకాస్‌కాట్‌లాన్‌ మేయర్‌గా, 2015లో ఎల్‌సాల్వెడార్‌ రాజధాని శాన్‌సాల్వెడార్‌ నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈయన తండ్రి వ్యాపారవేత్తగా, మత ప్రముఖుడిగా గుర్తింపుపొందారు. ఆయన తండ్రి ముస్లిం కాగా.. తల్లి క్రిస్టియన్‌. తనకు మతం కంటే దేవుడే తొలి ప్రాధాన్యమని నయిబ్‌ చెబుతారు.
* ఎల్‌సాల్వెడార్‌ జనాభా: 64 లక్షలు 


జెసిండా కేట్‌ లారెల్‌ ఆర్డెర్న్‌ (39)

న్యూజిలాండ్‌ ప్రధానిగా 2017 అక్టోబరులో బాధ్యతలు చేపట్టారు. 2001లో కమ్యూనికేషన్‌ స్టడీస్‌ (రాజకీయాలు, ప్రజాసంబంధాలు)లో డిగ్రీ పూర్తయ్యాక ప్రధానమంత్రి కార్యాలయంలో పరిశోధకురాలిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత యూకేలో అప్పటి బ్రిటిష్‌ ప్రధాని టోనిబ్లెయిర్‌కి విధాన సలహాదారుగా పని చేశారు. 2008లో సోషలిస్ట్‌ యూత్‌ అంతర్జాతీయ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అదే సంవత్సరం తొలిసారి ఎంపీగా గెలిచారు. 2017 ఆగస్టులో లేబర్‌ పార్టీ ఉపనాయకురాలిగా ఎన్నికయ్యారు.. ఇలా అంచెలంచెలుగా పిన్నవయసులోనే ప్రధాని పదవిని చేపట్టారు. ప్రధానిగా ఉండగానే ఆమె బిడ్డకు జన్మనివ్వడం గమనార్హం. జెసిండా తండ్రి పోలీస్‌ అధికారి.
* న్యూజిలాండ్‌ జనాభా: 49 లక్షలు.
* విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో అగ్ర దేశాలతో పోటీ పడుతోంది


రాజరికం.. వారసత్వం

* వివాదాస్పద నాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉత్తరకొరియా పాలకుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌ ప్రస్తుత వయసు 35 ఏళ్లు. ఆయన 1982లో జన్మించినట్లు ఆధారాలున్నా.. వివిధ కారణాలతో 1984 జనవరి 8ని అధికారికంగా ఆయన జన్మదినంగా నమోదు చేశారు. 2011 డిసెంబరులో ఆ దేశ 3వ సుప్రీం నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు.
* భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ వాంగ్‌చుక్‌ ప్రస్తుత వయసు 39 ఏళ్లు. ఆయన తండ్రి జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్‌ తన వారసుడిగా యువరాజుని 2006 డిసెంబరులో పట్టాభిషిక్తుడిని చేశారు.


* ఖతార్‌ పాలకుడు (ఎమిర్‌ ఆఫ్‌ ఖతార్‌) తమీమ్‌ బిన్‌ హమద్‌ ఆల్‌ థని వయసు ఇప్పుడు 39 ఏళ్లు. గత పాలకుడు హమద్‌ బిన్‌ ఖలీఫా నాలుగో కుమారుడు. 2013 జూన్‌లో ఎమిర్‌ ఆఫ్‌ ఖతార్‌గా నియమితులయ్యారు.


హైతీ తాత్కాలిక ప్రధానిగా 39 ఏళ్ల ఫ్రిట్జ్‌ విలియం మైఖేల్‌ సేవలందిస్తున్నారు. ఈ ఏడాది జులైలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆర్థిక మంత్రిత్వశాఖలో చీఫ్‌ అకౌంటెంట్‌ అధికారిగా పనిచేశారు.


కోస్టారికా 48వ అధ్యక్షుడిగా కార్లోస్‌ అల్వరాడో గతేడాది మే నుంచి సేవలందిస్తున్నారు. 1980 జనవరిలో జన్మించిన ఆయన 38వ ఏటే దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.  అంతకుముందు మంత్రిగా సేవలందించారు.


అండోరా ప్రధాని (ప్రభుత్వ అధినేత)గా 40 ఏళ్ల జేవియర్‌ ఎస్పాట్‌ జమోరా సేవలందిస్తున్నారు. 1979లో పుట్టిన జేవియర్‌ ఈ ఏడాది మేలో ఈ బాధ్యతలు చేపట్టారు.


- ఈనాడు ప్రత్యేక విభాగం

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.