close

ప్రధానాంశాలు

మా ఎమ్మెల్యేల్ని ఎన్‌కౌంటర్‌ చేయిస్తారా?

శాసనసభ సమావేశాల్ని దారుణంగా నిర్వహిస్తున్నారు
టీవీ ఛానళ్ల నిషేధంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం: చంద్రబాబు

ఈనాడు, అమరావతి: వైకాపా నాయకులకు గర్వం, అహంభావం పెరిగిపోయి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని తెదేపా అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. శాసనసభ నిర్వహించే విధానం దారుణంగా ఉందన్నారు. ‘‘పోడియం వద్దకు నిరసన తెలిపేందుకు వెళ్లిన మా ఎమ్మెల్యేల్ని ఎన్‌కౌంటర్‌ చేయిస్తామని వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు హెచ్చరించారు. తెలంగాణలో నలుగుర్ని లేపేశారు, మీపైనా ఏదో కేసుపెట్టి లేపేస్తాం అని బెదిరించారు’’ అని ఆయన మండిపడ్డారు. సోమవారం రాత్రి పొద్దుపోయాక పార్టీ కార్యాలయంలో చంద్రబాబు విలేకర్లతో మాట్లాడారు. ‘‘అందర్నీ భయభ్రాంతుల్ని చేస్తున్నారు. శాసనసభ సమావేశాలు ప్రసారం చేయకుండా ఈటీవీ, ఏబీఎన్‌, టీవీ5 ఛానళ్లను నిషేధించారు. మేం సభలో ఉన్నామో లేదో కూడా బయటివారికి తెలియని పరిస్థితి కల్పిస్తున్నారు. ఇంత నీచమైన, దారుణమైన రాజకీయాలు జీవితంలో చూడలేదు’’ అని మండిపడ్డారు. స్పీకర్‌ వైఖరిని నిరసిస్తూ, సభను హుందాగా నడపాలని కోరుతూ తమ సభ్యులు మంగళవారం ఆయనకు లేఖ అందజేస్తారని తెలిపారు.

మీడియాపై ఆంక్షలకు నిరసనగా ధర్నా
మీడియాపై ఆంక్షలకు నిరసగా బుధవారం శాసనసభ ప్రాంగణంలో ధర్నాచేస్తామని, తర్వాత గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఈ అంశంపై కోర్టుకు వెళతామని, జాతీయస్థాయిలో పోరాడతామని చెప్పారు. ‘‘ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఆర్థికమూలాల్ని దెబ్బతీయడం నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పుడే చూస్తున్నాను. ఇప్పుడు ఏకంగా ఎన్‌కౌంటరే చేస్తామంటున్నారు’’ అని మండిపడ్డారు. పవన్‌కల్యాణ్‌పై సీఎం జగన్‌ వ్యాఖ్యలు దారుణం, పరమనీచమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘‘తనకు ఒక్కరే భార్య ఉన్నారని, కొందరు నాయకులకు ముగ్గురు నలుగురు ఉన్నారని సీఎం వ్యాఖ్యానించారు. సీఎం స్థాయిలో అలా ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడారా? ఓటుకి నోటు కేసు అంటూ.. నా గురించి మాట్లాడుతున్నారు. ఆ కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని, అది రాజకీయ ఉద్దేశాలతో పెట్టిన కేసని కోర్టు స్పష్టంగా చెప్పింది. అయినా పదేపదే దానిగురించే మాట్లాడుతున్నారు. రూ.43 వేల కోట్ల అవినీతికి సంబంధించి, 11 కేసుల్లో ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్లేవాళ్లకు ఇతరుల గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది? ఆ మాటకొస్తే పవన్‌కల్యాణ్‌ ప్రజాజీవితంలో ఎవరికీ అన్యాయం చేయలేదు. మాట్లాడితే చాలు.. ఆయన మాకు దత్తపుత్రుడంటూ వైకాపా సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు’’ అని ధ్వజమెత్తారు. ఉల్లిధరలపై శాసనసభలో చర్చను అడ్డుకోడానికే మహిళలపై అత్యాచారాల అంశాన్ని చర్చకు చేపట్టారని చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం శాసనసభ సమావేశాలు మొదలవడానికి ముందు రైతుల సమస్యలపై ర్యాలీ చేస్తామన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.