close

ప్రధానాంశాలు

హేట్సాఫ్‌ కేసీఆర్‌

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ వ్యవహారంలో ఏపీ సీఎం జగన్‌ కితాబు
దిశ ఉదంతంపై సమాజం సిగ్గుతో తలవంచుకోవాలి
సినిమాల్లో హీరో ఎన్‌కౌంటర్‌ చేస్తే చప్పట్లు కొడతాం
నిజజీవితంలో చేస్తే మానవ హక్కుల కమిషన్‌ తప్పుపడుతోంది
అఘాయిత్య కేసుల్లో సత్వర శిక్షలకు రేపు ఏపీ అసెంబ్లీలో విప్లవాత్మక బిల్లు

ఈనాడు-అమరావతి: ‘హైదరాబాద్‌లో దిశ ఉదంతం సమాజమంతా సిగ్గుతో తలవంచుకోవలసిన ఘటన. వైద్యురాలు బైక్‌ దిగి టోల్‌ కట్టడానికి వెళితే నలుగురు వ్యక్తులు పంక్చర్‌ చేసి రిపేర్‌ చేయిస్తామని నమ్మించి అత్యాచారం చేసి కాల్చేసిన ఘటన కళ్ల ముందు కనిపిస్తోంది. తల్లిదండ్రుల బాధ చూశాక దారుణానికి పాల్పడిన వారిని కాల్చేసినా తప్పులేదని అందరం అనుకున్నాం. నాకూ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు ఒక తండ్రిగా ఎలా స్పందించాలి? నిందితులకు ఏ రకమైన శిక్ష పడితే ఉపశమనం కలుగుతుందో ఆలోచన చేయాలి.  దిశ ఘటనపై మీడియా, టీవీ వాళ్లు బాగా స్పందించారు. హ్యాట్సాఫ్‌ టు కేసీఆర్‌, తెలంగాణ పోలీసులు(నిందితుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో)’ అంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

మూడు వారాల్లో శిక్ష పడేలా..
అసెంబ్లీలో సోమవారం మహిళా భద్రతపై స్వల్పకాలిక చర్చలో ఆయన ప్రసంగించారు. ‘రాష్ట్రంలో చిన్నపిల్లలపై జరుగుతున్న సంఘటనలతోపాటు హైదరాబాద్‌లో దిశ ఉదంతం నా మనసును ఎంతో కలచివేసింది. ఒక తండ్రిగా బాధను అర్థం చేసుకోగలను. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు చేయాలి. ప్రతి ఆడపిల్ల, తల్లి, చెల్లి సురక్షితంగా ఉండేలా అఘాయిత్యాలకు పాల్పడిన వారికి మూడు వారాల్లో శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం. వారంలో దర్యాప్తు, రెండో వారంలో విచారణ, మూడో వారంలో శిక్ష పడేలా చట్టంలో మార్పులు తీసుకొస్తాం. మహిళలు, చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన కేసుల్లో నిందితులకు సత్వరమే శిక్ష పడేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలి. ఇందుకోసం మరో విప్లవాత్మక బిల్లు బుధవారం ఇదే చట్ట సభలో తీసుకొస్తాం.

దమ్మున్నోళ్లు చేస్తే తప్పంటున్నారు
సినిమాలో హీరో ఎన్‌కౌంటర్‌ చేస్తే చప్పట్లు కొడతాం. ఇదే నిజజీవితంలో దమ్మున్నోళ్లు ఎవరైనా చేస్తే ఏం జరుగుతుంది? జాతీయ మానవ హక్కుల కమిషన్‌ దిల్లీ నుంచి పరిగెత్తుకొని వచ్చి నిలదీస్తున్న పరిస్థితిని ఈ రోజు చూస్తున్నాం. దిల్లీ ఘటనతో నిర్భయ చట్టం తీసుకొచ్చాం. నాలుగు నెలల్లో శిక్ష పడాలని చట్టం చెబుతోంది. ఏడేళ్లయినా ఇప్పటికీ శిక్షలు లేవు. ఏదైనా జరిగితే బాధిత కుటుంబాలకు సత్వరం న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో నిందితులను ఎవరైనా కాల్చేసినా అలా చేసిన వారిని హీరోలుగా భావించి చప్పట్లు కొట్టే విధంగా సమాజం ఉంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నిందితులను కాల్చేయాలని ఎవరూ అనుకోరు. జరగకూడని పరిస్థితుల్లో దిశ ఘటనలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. అందుకే చట్టాలు మారాలి. తప్పు జరిగితే స్పందించే విధానంలో మార్పు రావాలి. చట్టాలు బలపడాలి. దిశ విషయంలో వీడియో కెమెరాల్లో బైక్‌కు పంక్చర్‌ చేయడం, యువతిని దుండగులు తీసుకెళ్లడం వంటివి కళ్ల ముందే కనిపించాయి. మన రాష్ట్రంలో ఇలాంటివి జరిగితే మనమూ, పోలీసులు ఎలా స్పందించాలో ప్రశ్నించుకోవాలి.

నాకు ఒకరే భార్య
‘బహుభార్యత్వం అంశంపై మాట్లాడుతూ నాకైతే ఒకరే భార్య’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు విరిశాయి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.