close

ప్రధానాంశాలు

వాతావరణం.. పోషకాహార లోపం!

అభివృద్ధికి ఇవే పెను సవాళ్లు
ప్రపంచ మౌలిక సమస్యలపై మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ అంతరంగం

ఆయన జగమెరిగిన ప్రముఖుడు.. ప్రపంచంలో అత్యంత సంపన్నుడు.. కంప్యూటర్‌ విప్లవంలో, సాఫ్ట్‌వేర్‌ రంగ విస్తృతిలో కీలక పాత్రధారి. ఎన్నో సామాజిక, దాతృత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వ్యక్తి. నేడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న వివిధ జాడ్యాల్ని సునిశిత దృష్టితో పరిశీలిస్తూ.. వాటికి తనదైన కోణాల్లో పరిష్కారాల్ని సూచిస్తున్న దార్శనికుడు. వాతావరణ మార్పులు, పోషకాహార లోపం నేటి ప్రపంచానికి పెను శాపాలని విశ్లేషిస్తున్నారు బిల్‌-మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ సహాధ్యక్షుడు బిల్‌గేట్స్‌. నూతన ఆవిష్కరణలతోనే ఈ రంగాల్లో గణనీయ మార్పులు తేవచ్చంటూ నొక్కిచెబుతున్నారు. సామాజిక మాధ్యమాల విస్తృతిపైనా తన విశేష అభిప్రాయాలను బిల్‌గేట్స్‌ విప్రో సంస్థ ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీతో పంచుకున్నారు. ముఖ్యాంశాలు...

కృత్రిమ మేధ..
ఇది కేవలం సాంకేతిక సంరంభం మాత్రమే కాదు. దీన్ని ఉపయోగించి ఆరోగ్య-విద్య రంగాల్లో అపూర్వమైన మౌలిక సదుపాయాలను, అద్భుతమైన పురోగతిని సాధించొచ్చని నమ్మకంగా చెబుతున్నారు బిల్‌గేట్స్‌.

 

హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో.. ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్యల పరిష్కారానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు బిల్‌గేట్స్‌. వాతావరణ మార్పులు, భూతాపం, నిరుపేదల్లో పోషకాహార లోపం, అనారోగ్యం, నిరక్షరాస్యత, విద్యుత్తు కొరత, ఉద్యోగాల్లో కోత వంటి ఎన్నో రుగ్మతలపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వీటిలో చాలా సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చునని బిల్‌గేట్స్‌ చెబుతున్నారు. పోషకాహార లోపంపై భారత్‌ దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కిచెబుతున్నారు.

వాతావరణ మార్పులు

వాతావరణ మార్పులు 21వ శతాబ్దానికి పెను సవాళ్లు విసురుతున్నాయి. కాలుష్యం, సముద్రమట్టాల పెరుగుదల, ద్వీపాలు మునిగిపోవడంతో ప్రజాజీవితాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్బన ఉద్గారాలను తగ్గించడానికి, విద్యుత్తు, సాంకేతిక రంగాల్లో వినూత్నంగా ముందడుగేసేందుకు అటు గేట్స్‌ ఫౌండేషన్‌, ఇటు వ్యక్తిగతంగా మీరు ఉదారంగా ఖర్చు చేస్తున్నారు. వాతావరణ మార్పులపై పౌరులు, ప్రభుత్వాలు మరింత తెలుసుకోవడానికి ఏం చేయాలి?

ర్బన ఉద్గారాలను సున్నాకు తగ్గించడానికి పాటించాల్సిన విధానాలపై నేను ఓ పుస్తకం రాస్తున్నా. వచ్చే జూన్‌ నాటికి బయటికి వస్తుంది. ప్రస్తుతం మనం ఏటా 5100 కోట్ల టన్నుల ఉద్గారాలను వాతావరణంలోకి వదులుతున్నాం. దీన్ని తగ్గించడం, ఎప్పుడో ఒకప్పుడు సున్నాకు తీసుకురావడం అనే ఆలోచన ఎన్నో సవాళ్లతో కూడింది.

* ప్రపంచవ్యాప్తంగా మనం వాడుతున్న విద్యుత్తులో 80% సహజ ఇంధనాల(బొగ్గు, గ్యాస్‌, పెట్రోలు)ను మండించగా వస్తున్నదే. ఉద్గారాలను సున్నాకు కుదించాలంటే అణు, ప్రత్యామ్నాయ, జల విద్యుత్తు వైపు పూర్తిగా మళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం దీని వాటా 20% మాత్రమే. ఈ రంగంలో విస్తృత, వినూత్న పరిశోధనలు జరగాల్సి ఉంది. నూతన ఆలోచనల కారణంగానే విద్యుత్తు కార్లు వచ్చాయి. రానున్న 10-15 ఏళ్లలో పెట్రోలు, డీజిల్‌ కార్లతో అవి రాయితీలు ఆశించకుండానే పోటీ పడనున్నాయి.
* ప్రోటీన్లతో తయారైన కొత్త రకం మాంసం వచ్చింది. ప్రస్తుతం ధర కొంచెం ఎక్కువే. ఉద్గారాలకు కారణమవుతున్న జంతు మాంసం కన్నా ఇది మేలు. మున్ముందు దీని నాణ్యత మెరుగుపడుతుంది. ధరా తగ్గుతుంది.
* అపరిమిత నగరీకరణ కారణంగా 2060 నాటికి ఇప్పుడున్న వాటికి ఎన్నోరెట్లు ఎక్కువగా భవనాలను నిర్మించాల్సి వస్తుంది. దీనికి సిమెంటు, స్టీలు వాడకం తప్పనిసరి. వీటి తయారీ సమయంలో కర్బన ఉద్గారాలు అత్యధికంగా వెలువడుతున్నాయి. ఈ రంగంలోనూ నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సి ఉంది.
* ఈ క్రతువులో ప్రతిదేశమూ పాలుపంచుకోవాలి. వర్ధమాన దేశాలతో ధనిక దేశాలు కలిసి అడుగేయాలి.

భారత్‌లో సహజ ఇంధనాలను మండిస్తూ విద్యుదుత్పత్తిని నాలుగింతలు పెంచారు. ఇది ఉద్గారాలకు కారణం అవుతుంది కదా? భూతాపాన్ని పెంచినప్పుడు దాన్ని తగ్గించడానికి ఏ దేశమైనా ముందుకు రావాల్సిందే. పదేళ్ల క్రితం నేను కలిసిన బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ను కలిశా. నేను ఆశిస్తున్న రంగంలో బిహార్‌లో ఆయన చాలా కృషిచేశారు. మా ఫౌండేషన్‌ సైతం ఎంతో సాయం చేస్తోంది. పట్నా లాంటి చోట భూతాపం గురించి ఆయన ప్రస్తావిస్తారని అసలు ఊహించలేదు. తాగునీరు, నాణ్యమైన విత్తనాల సరఫరాతోపాటు భూతాపాన్ని తగ్గించడంలోనూ మా సాయం కోరారు. యువతరంలో ఈ మేలుకొలుపే లోపిస్తోంది. ఒక ప్రణాళిక ప్రకారం కృషి చేస్తే ఈ సమస్యను 30-40 సంవత్సరాల్లో పరిష్కరించవచ్చని భావిస్తున్నా. భూతాపంతో ఉత్తర భారతం, ఆఫ్రికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిరుపేదలు, రైతులు మొదట బాధపడుతున్నారు. అందుకే నేను ప్రత్యామ్నాయ విద్యుత్తు రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నా.


తమ విద్యుత్తు అవసరాలను తీర్చేస్థాయిలో ప్రత్యామ్నాయ వనరుల్లేవని వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు వాదిస్తున్నాయి. అదే సమయంలో భూతాప ప్రభావం ఆయా దేశాల నిరుపేదలపైనే అధికంగా ఉంటోంది. ఇలా... సంప్రదాయ విద్యుత్తుతో జరిగే ప్రగతికి రెండు పార్శ్వాలు ఉంటున్నాయి..!
అవును... ప్రగతి ఎంతో ముఖ్యం. అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే ఉద్గారాలను వెలువరించాయి. ‘మీరుంటున్న ప్రాంతం ఎంత వేడెక్కినా మీరు ఏసీలు వాడొద్దు’ అని పేద దేశాల ప్రజలకు చెప్పలేం. అందుకే మరింత విద్యుత్తును ఉత్పత్తి చేయాలి. దీని కోసమే కొత్త సాంకేతికత ఆవశ్యకతను నా పుస్తకంలో ప్రస్తావిస్తున్నా.


మీరు ఇటీవల అణు విద్యుత్తును ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. దీనిపై ఎందుకు అంతగా పట్టుబడుతున్నారు?
వినూత్న ఆలోచనలు ఎప్పుడూ వివాదాస్పదం అవుతుంటాయి. నేను మిలియన్ల కొద్దీ డాలర్లను నవతరం అణువిద్యుత్‌ రంగంలో పెట్టుబడిగా పెట్టా. ప్రస్తుత అణువిద్యుత్తు కేంద్రాలు కొంతమేరకు సురక్షితమైనా నిర్వహణ ఖర్చు ఎక్కువ. అవి దాదాపు 50 ఏళ్ల క్రితం రూపొందించినవి. అప్పుడు డిజిటల్‌ కంప్యూటర్లను వాడలేదు. ఇప్పుడు మనం ఎంతో మన్నికైన... నాలుగో తరం అణువిద్యుత్కేంద్రాలను తయారు చేసుకోగలం. వీటిని ఎక్కడ అవసరముంటే అక్కడే ఏర్పాటు చేసుకోవచ్చు. సురక్షితంపై ఉన్న భిన్న వాదనల నేపథ్యంలో వాటిని సులభంగా అంగీకరిస్తారని అనుకోను. కానీ మనం అణువిద్యుత్తుకు మళ్లాల్సిందే.. ప్రజల ఎదుట ప్రదర్శించేందుకు నవతరం అణుకేంద్రాన్ని ప్రయోగాత్మకంగా తయారు చేయడమే నా ముందున్న లక్ష్యం.


సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో మీకు ఇష్టమైంది?నాకు మూడు సుస్థిర అభివృద్ధి
లక్ష్యాలున్నాయి. అవి.. ఆరోగ్యం, వాతావరణం, లింగ సమానత్వం. వీటిలో ఆరోగ్యం మాకు అత్యంత ప్రాధాన్యమైంది. భారత్‌లో ఈ రంగం సత్వర పురోగతికి తగిన అవకాశాలున్నాయి. యువతకు అందే చదువు, వారి ఆరోగ్యం చుట్టే మున్ముందు భారత్‌ ఆర్థిక భవిష్యత్తు తిరుగుతుంది. అందుకే వీటిపై పెట్టుబడులను సక్రమంగా ఖర్చు చేయాలి.


సామాజిక మాధ్యమాలు

సామాజిక మాధ్యమాలు(సోషల్‌ మీడియా) విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. అనుసంధానం పెరగడంతోపాటు ప్రజలకు చాలా సమాచారం అందుతోంది. అయితే వీటికున్న శక్తి కారణంగా ఈ మాధ్యమ వేదికలు దుర్వినియోగమయ్యే ప్రమాదముంది. సమాచార సృష్టికర్తలు, ప్రసారం చేసేవారు, వినియోగించే వారి బాధ్యతలు ఎలా ఉండాలి?
సోషల్‌ మీడియా విస్తృతి, ప్రభావం ఇంతలా ఉంటాయని ఎవరూ ఊహించలేదు. దీనితో వాస్తవంగా తెలియాల్సిన ప్రధాన అంశాలు మరుగున పడుతున్నాయి. అతివాదులు, మితవాదులు ఎవరినైనా.. వారి భావజాలానికి అనుగుణంగా వివిధ కథనాల(నిజమైనా, అబద్ధమైనా)తో ప్రజలను ప్రభావితం చేస్తున్నారు. గతంలో మనమంతా ఒకే వార్తాపత్రిక చదివేవాళ్లం. ఒకే మొదటిపేజీ, ఒకేలాంటి రాజకీయ ప్రకటనలు ఉండేవి. అతిగా ఉండే రాజకీయ ప్రకటనలు ఎవరూ ఇచ్చేవారు కాదు. ఎందుకంటే 10 శాతానికి మించి ఓటర్లు అలాంటి వాటిని విశ్వసించరని వారికి తెలుసు. ప్రస్తుత శాటిలైట్‌ టీవీలు, వందల ఛానెళ్లు వార్తలను వారికి ఇష్టమైన రీతిలో ముక్కలు ముక్కలుగా ప్రసారం చేస్తున్నాయి. ఈ పరిస్థితి నిజంగా అతిగా ఉంది. ఒకరిని లక్ష్యంగా చేసుకుని ఇచ్చే రాజకీయ ప్రకటనలు ఒకరిపై ఒకరికి కోపం పెంచేలా ఉంటున్నాయి. ఇలాంటి వాటిపట్ల నియంత్రణ ఉండాలి. ప్రజలను తప్పుదోవ పట్టించే ‘లక్ష్యిత’ ప్రకటనలను నిషేధించాల్సిన అవసరముంది. ఇలాంటి సమాచారాన్ని ఎలా సృష్టిస్తున్నారని, సాంకేతికను ఎలా నియంత్రించాలని తొలిసారిగా ప్రజలు అడుగుతున్నారు. 


మనకు అందుతున్న, మనం వ్యాప్తిచేస్తున్న సమాచారం నిజమని ఎలా నిర్ధారించుకోగలం?
నిజ నిర్ధారణ, బోగస్‌ వార్తలు, సమాచార నవీకరణకు టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది?
మా ఫౌండేషన్‌లో టీకాలపై చాలా పెద్ద కృషే జరిగింది. భారత్‌లో అద్భుత భాగస్వాములు సహా చాలామందితో కలిసి ప్రపంచవ్యాప్తంగా పిల్లల కోసం డయేరియా, న్యూమోనియా టీకాలను సంపాదించాం. ప్రస్తుత డిజిటల్‌ ప్రపంచంలో... ‘వ్యాక్సిన్లు మంచివి కావు, పిల్లలకు హాని చేస్తాయి. కాబట్టి పిల్లలకు వ్యాక్సిన్‌ వేయించొద్దు’ అనే భావన ఉండటంతో వ్యాక్సినేషన్‌కు ఆటంకం కలుగుతోంది. ఇలాంటి అవాస్తవాల వ్యాప్తికి సామాజిక మాధ్యమాలు వీలు కల్పిస్తున్నాయి. వ్యాక్సిన్లు నిజంగా పిల్లలను ఎలా కాపాడుతాయో చెబుతూ ఓ వ్యాసం పెడితే వాటిని అవి వ్యాప్తి చేయడంలేదు. ఇలాంటి విషయాల్లో ఒక అబద్ధం చెబితే అది అలాగే ప్రజల్లోకి వెళుతుంది. అందువల్ల ఈ వేదికలు వాస్తవాలను, ప్రజల్లో అవగాహనను మరింత పెంచేవిగా ఉండాలి.


దోమలు, ఈగలతో వ్యాపించే మలేరియా వంటి వ్యాధులపై వాతావరణ మార్పుల ప్రభావం అధికంగా ఉంటుంది. పోలియోపై పోరాటం సాగించినట్లుగానే వీటిపైనా మీరు దృష్టి సారించారు. అసలు ఆరోగ్య రంగంలో మన ముందున్న సవాళ్లు ఏమిటి?
వాతావరణ మార్పుల బాధితుల్లో 80% మంది నిరుపేద రైతులే. పగటిపూట వేడిగా ఉండటమనేదే కాకుండా కొన్ని ప్రాంతాలు నివాసానికీ దుర్భరంగా మారుతున్నాóు. ప్రతి మూడేళ్లకోసారి వారి పంటలు తీవ్రంగా పాడవుతున్నాయి. ఏటా దిగుబడి తగ్గుతోంది. అది పోషకాహారలోపానికి దారితీసి, మృత్యువాతకు కారణం అవుతోంది. దీని నివారణకు రైతులకు మంచి విత్తనాలు, సలహాలు, రుణాలనూ అందించాలి. న్యూమోనియా, డయేరియా వంటివి సోకినా వారి ప్రాణాలకు భరోసా దక్కేలా ఆరోగ్య పరిరక్షణలోనూ ప్రగతి చూపాల్సి ఉంటుంది.

* సహజంగా ఎత్తు ప్రాంతాల్లో దోమలు జీవించవు. అయితే వాతావరణం వేడెక్కుతున్నకొద్దీ అవి ఎత్తు ప్రాంతాల్లోకి చొచ్చుకెళతాయి. ఆఫ్రికాలోని చాలా పట్టణాలు దోమలు చొరబడని ఎత్తు ప్రాంతాల్లో ఉన్నాయి. ఒకవేళ వేడి పెరిగితే అక్కడికీ చేరతాయి. ఈ విపరిణామం ప్రమాదకర మలేరియా వ్యాప్తికి దారితీస్తుంది.

పెట్టుబడి వెనక్కి వచ్చే అవకాశం లేని సాంకేతికతపై ఖర్చు చేయడానికి ఎంతో ధైర్యముండాలి. ఈ కోణంలో దాతలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వాలకు ఎలాంటి బాధ్యత ఉందని భావిస్తున్నారు?
పారిస్‌లో నాలుగేళ్ల క్రితం వాతావరణ ఒప్పందం కుదిరిన సమయంలో భారత ప్రధాని మోదీ ‘మిషన్‌ ఇన్నోవేషన్‌’ను ప్రకటించారు. ‘ఆర్‌ అండ్‌ డీ’లో ప్రభుత్వాల ఖర్చును రెండింతలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ పరిణామం విద్యుత్తు బస్సులు, కార్ల విభాగంలో నిబంధనలను సరళీకరించడానికి ఉపకరిస్తుంది. విభిన్న పరిశోధనలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి అనుసంధానం చేయొచ్చు. అందుకే ఈ రంగంలో ప్రభుత్వాలది కీలకపాత్ర.

* విద్యుత్తు రంగంలో వెంచర్‌ క్యాపిటలిస్టులకు ఆశించిన ఫలితాలు రాలేదు. అందుకే జాన్‌డీర్‌, వినోద్‌ ఖోస్లా వంటి వారితో ‘బ్రేక్‌త్రూ ఎనర్జీ వెంచర్స్‌’ అనే బృందాన్ని ఏర్పాటుచేశాం. పెట్టుబడుల కోసం నేను 25 మందిని సంప్రదిస్తే 21 మంది సమ్మతించగా.. 100 కోట్ల డాలర్లు సులభంగా పోగయ్యాయి. మాకున్న 100 పురోగమన ఆలోచనల్లో నుంచి ఇప్పటివరకు 30 ఆలోచనలపై ఖర్చు చేశాం. మొత్తంగా 10-15% వరకే ఫలితాలు రావచ్చు. అయినా మా ప్రయత్నాలు కొనసాగిస్తాం³.


జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కార్యక్రమం కింద భారత్‌లో మలేరియా కేసులు నాలుగేళ్లలో గణనీయంగా తగ్గాయి. ఈ వ్యాధిని మరింతగా నియంత్రించాల్సి ఉంది.

 


భారత్‌లో ఆరోగ్య పరిస్థితులపై మీ దృష్టి కోణం?

భారతదేశంలో అద్భుత నైపుణ్యమున్న మానవ వనరులున్నాయి. ప్రభుత్వమూ చక్కగా సహకరిస్తోంది. నిరుపేదలు, మహిళలకు సైతం పేమెంట్‌ బ్యాంకుల ద్వారా మేం ఆర్థిక భరోసా అందిస్తాం. ఆరోగ్యరంగంలో మా బృందం కృషి ప్రాథమిక స్థాయిలో ఉంది. ఆరోగ్య రికార్డుల తయారీలో ఉత్సాహంగా పనిచేస్తోంది. మా బృందం విద్యా రంగంపైనా పనిచేస్తోంది. పోషకాహార లోపంపై ప్రభుత్వం అధిక దృష్టి నిలపాలి. ఎందుకంటే ఇది చిన్నారుల మేధో ప్రజ్ఞ(ఐక్యూ)ని 15 పాయింట్లు తగ్గిస్తుంది. నేర్చుకునే సామర్థ్యాన్నీ తగ్గిస్తుంది. లోతైన శాస్త్రీయ అధ్యయనాలు, సాంకేతిక అంశాల వినియోగంతో భారత్‌ ప్రగతి సాధిస్తుందనే నమ్మకముంది. ఈ అంశాల్లో భారత్‌ అనుకున్నది సాధిస్తే.. ఆఫ్రికా ఇతర దేశాల్లోని పేదలకూ మేలు చేకూరుతుందని మా ఫౌండేషన్‌ నమ్మకంగా ఉంది.


కృత్రిమ మేధ

కృత్రిమ మేధ(ఏఐ) మన జీవితాల్లోకి దూసుకొస్తోంది. అతి తక్కువ సమయంలోనే గణితం నుంచి ఆరోగ్యం వరకు, పల్లె నుంచి అంతరిక్షం వరకు విస్తరించింది. ఏఐని మీరు అణువిద్యుత్తు, తుపాకీ రెండింటితో పోల్చారు. దీనిపై మీ సమగ్ర దృష్టికోణం..?
ఏఐ అభివృద్ధి గత పదేళ్లలో వేగం పుంజుకుంది.  ప్రస్తుతం ఏఐను సాంకేతిక సాధనంగా వాడుతున్నాం. దీన్ని ఉపయోగించి అల్ట్రాసౌండ్‌ పరికరాన్ని తయారు చేస్తున్నాం. గర్భిణుల్లో ఏమైనా ఇబ్బందులున్నా, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్లున్నా ఏఐతో తేలిగ్గా గుర్తించొచ్చు. ఉపయోగించే వ్యక్తికి అంత నైపుణ్యమూ అవసరం లేదు. మరెన్నో అద్భుత పరికరాల్ని ఇది మనకు ఇవ్వగలదు. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఇతర సంస్థల్లో దీనిపై అనేక పరిశోధనలు సాగుతున్నాయి.

ఏఐ మన ఉద్యోగాల్ని లాగేసుకుంటుందా.. మీ అభిప్రాయం?
అభివృద్ధి ఉన్నప్పుడు అన్ని సౌకర్యాలు ఒనగూరుతాయి. అప్పుడు మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. యంత్రాలే పనులన్నీ చేస్తున్నప్పుడు మీరు స్వతంత్రంగా ఉన్నట్లు లెక్కకాదు. ఒకప్పుడు అందరం వ్యవసాయం చేసేవాళ్లం. ఇప్పుడు మనలో కొంతమందే రైతులున్నారు. ఈ మార్పు క్రమంగా వచ్చింది. ప్రతి పౌరుడు భద్రత వలయం(సరిపడా ఆహారం, వనరులు, నివాసం-అద్దె చెల్లించే సామర్థ్యం)లోకి చేరేలా ప్రభుత్వాలు ముందడుగేయాలి. ప్రపంచంలో నేడు ఎన్నో కొరతలున్నాయి. ఏఐని విస్తృతంగా వినియోగించే స్థాయికి మనం చేరుకుంటే అందరికీ లోటులేని పరిస్థితి వస్తుంది. అయితే అది నా జీవితకాలంలో రాకపోవచ్చు.ఏఐ రెండో దశతో ఉద్యోగాల మార్కెట్‌ ఏమవుతుందోనంటూ పెద్ద చర్చ జరుగుతోంది. దానిపై మనం ఎలా ఆలోచిస్తామనేది ముఖ్యం.

గేట్స్‌ ఫౌండేషన్‌లో ఏఐని ఎలా వాడుకుంటున్నారు?
ఔషధ ఆవిష్కరణల్లో వినియోగిస్తున్నాం. క్షయ టీకా, త్వరలో రానున్న హెచ్‌ఐవీ టీకాల తయారీలోనూ పాక్షికంగా ఉపయోగపడుతోంది. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ని గుర్తించే పరీక్షల్లో ఈ సాంకేతికత ప్రత్యక్ష ఉపయోగాన్ని గుర్తించొచ్చు. సెల్‌ఫోన్‌ కెమెరా, అల్ట్రాసౌండ్‌ ద్వారా తీసే చిత్రాల విశ్లేషణ ద్వారా వైద్య రంగంలో ఏఐ అద్భుతాలు చేయబోతోంది. వీటిలో కొన్నింటిని మీ సెల్‌ఫోన్‌లోనూ పొందొచ్చు. అది మీ ఆరోగ్య సంరక్షణకు, వ్యక్తిగత ట్యూటర్‌లానూ సహాయ పడుతుంది. మరో ఐదేళ్లలో ఇవి అందుబాటులోకి వస్తాయి. కొత్త విధానాల్లో పనులు చేయడానికి ఈ సాంకేతికత సమాజాన్ని సిద్ధంచేస్తుంది.


టెక్నాలజీ ప్రయోజనకరం కాదా? మన సమాజంలో, జీవన మార్గంలో ఇది పరీక్షకు నిలబడుతుందా?
సాంకేతికత మన సమయాన్ని ఆదా చేస్తుంది. కానీ ఆ ఖాళీ సమయంలో ఏం చేయాలన్నది మనకు అది చెప్పలేదు. అప్పుడు ఎవరి పని వారు చేసుకోవాలన్నది నా ఉద్దేశం. కొన్ని ఉద్యోగాలు చాలా ‘బోరింగ్‌’గా ఉంటాయి. సమయంతో ఏం చేయాలో.. దేనికి విలువ ఇవ్వాలో చెప్పేందుకు యంత్రాలు మనకు దోహదపడవు. అయితే వ్యవసాయ సమాజానికి ఇవి పనికొస్తాయి. నేను మంచి రైతును. వాస్తవంగా నేను పనిచేయాల్సిన అవసరం లేదు. కానీ... కొత్త శాస్త్రం(సైన్సు) నేర్చుకోవడం, భాగస్వాములు, మా ఫౌండేషన్‌, మనచుట్టూ జరుగుతున్న వాటిపై అవగాహన పెంచుకోవడం... వంటివి నాకు చాలా ఆసక్తి కలిగిస్తాయి. ప్రస్తుతం మనం - చాలా సంపన్న ప్రపంచంలోను, అదే సమయంలో చాలా పేదరిక సమాజంలోను ఉన్నాం. ఈ వైరుద్ధ్యం నుంచి బయటపడే సామర్థ్యాన్ని సంపాదించాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించుకుంటున్నాం అన్నదే కీలకం. మలేరియా వంటి వాటిని తీసుకుంటే... సంపన్న దేశాల్లో మలేరియా లేదు, పేద దేశాల్లో దీని నిర్మూలనకు కొత్త సాధనాలను తయారుచేసే సామర్థ్యం లేదు. బాధపడే వారివద్ద తగినంత డబ్బు లేదు. ఇది ప్రాధాన్య అంశం కాబట్టి అందరికీ తప్పక తెలియాలి.


- ఆంగ్ల పత్రిక మింట్‌ సౌజన్యంతో

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.