close

ప్రధానాంశాలు

సన్న బియ్యం ఇస్తామనలేదు

‘స్వర్ణ’ అలాంటివి ఇస్తామనే చెప్పాను
 ‘సాక్షి’లో తప్పుగా రాశారు
 శాసనసభలో ఏపీ సీఎం జగన్‌
 శాసనసభలో ‘ఈటీవీ’ క్లిప్‌ ప్రదర్శన
  ‘సన్నబియ్యం’ అంశంపై వాడివేడి చర్చ

ఈనాడు, అమరావతి: తెల్ల రేషన్‌ కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేస్తామని తాను ఎక్కడా, ఎప్పుడూ చెప్పలేదని ఏపీ సీఎం జగన్‌ మంగళవారం శాసనసభలో స్పష్టం చేశారు. ‘సన్న బియ్యం’ అన్నది జనం వాడుకలో ఉన్న మాటే తప్ప, అలాంటి రకం ఎక్కడా లేదన్నారు. ప్రజలు తినగలిగిన, నాణ్యమైన స్వర్ణతో పాటు, అలాంటి ఇతర రకాల బియ్యం సరఫరా చేస్తామని గతంలో చెప్పానన్నారు. ప్రజలకు సన్నబియ్యం సరఫరాకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందంటూ ‘సాక్షి’ పత్రికలో తప్పుగా రాశారని సీఎం పేర్కొన్నారు. ‘‘మీ లాగానే వాళ్లూ అయోమయానికి గురయ్యారు. ఆ రోజు ఇతర పత్రికల్లో ఏం రాశారో చూస్తే మీకు జ్ఞానోదయమవుతుంది’’అని తెదేపా సభ్యులను ఉద్దేశించి అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నాణ్యమైనబియ్యం పంపిణీని ప్రయోగాత్మకంగా ప్రారంభించినప్పుడు తాను ఏమన్నానో వీడియోక్లిప్‌లో చూసి తెలుసుకోవాలన్నారు. అప్పట్లో ‘ఈటీవీ’లో ప్రసారమైన వీడియో క్లిప్‌ను శాసనసభలో ప్రదర్శించారు. ‘సన్నబియ్యం’ అంశంపై ప్రశ్నోత్తరాల సమయంలో వాడివేడి చర్చ జరిగింది. ఈ అంశంపై తెదేపా సభ్యుడు అచ్చెన్నాయుడు అడిగిన ప్రశ్నకు.. రాష్ట్రంలో ఎక్కడా సన్నబియ్యం సరఫరా చేయడం లేదని, నాణ్యమైన బియ్యం ఇస్తామనే తాము చెప్పామని పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని బదులిచ్చారు. అచ్చెన్నాయుడు స్పందిస్తూ..‘‘సన్నబియ్యం సరఫరా చేస్తామని ఎన్నికల ముందు వందల సభల్లో జగన్‌ చెప్పారు. అధికారంలోకి వచ్చాక పౌర సరఫరాల శాఖపై సమీక్ష సందర్భంగా సెప్టెంబరు 1 నుంచి శ్రీకాకుళం జిల్లాలో సన్నబియ్యం పంపిణీని ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని ఆదేశించారు. సంచులూ ముద్రించారు. ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారు. ఎందుకు మడమ తిప్పారు?’’ అని ప్రశ్నించారు.

సాక్షిలో వచ్చినవి అవాస్తవాలా?
‘‘సెప్టెంబరు 1 నుంచి సన్నబియ్యం సరఫరాకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, వచ్చే ఖరీఫ్‌లో 50 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యం సేకరణకు ఏర్పాట్లు చేస్తోందని ప్రభుత్వ గెజిట్‌ ‘సాక్షి’లో రాశారు. ఆ పత్రికలో వచ్చినవి వాస్తవాలా?అవాస్తవాలా?’’ అని తెదేపా సభ్యుడు రామానాయుడు ప్రశ్నించారు.

ప్రజలు తినే బియ్యాన్ని ఇస్తున్నాం
‘‘ఫలానా రకం బియ్యం సరఫరా చేస్తామని మా ఎన్నికల ప్రణాళికలో ఎక్కడా ప్రస్తావించలేదు. చంద్రబాబు హయాంలో ప్రజలు దొడ్డు బియ్యం తినలేక మళ్లీ డీలర్‌కే అమ్మేసేవారు. మేం ఇస్తున్న బియ్యాన్ని ప్రజలు సంతోషంగా తింటున్నారు. ఏప్రిల్‌ నుంచి రాష్ట్రమంతా అదే తరహా బియ్యం సరఫరా చేస్తాం. దీనికి ప్రభుత్వానికి అదనంగా రూ.1400 కోట్లు ఖర్చవుతుంది. ఈ ఖరీఫ్‌, రబీల్లో స్వర్ణ, అలాంటి నాణ్యమైన రకాల బియ్యాన్నే సేకరిస్తాం.  మేం మేనిఫెస్టోలో చెప్పనివి అమలు చేస్తుంటే... తెదేపా సభ్యులకు ఈర్ష్య’’ అని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.