close

ప్రధానాంశాలు

నిరసన గళం

పౌరసత్వ బిల్లుపై విరుచుకుపడ్డ విపక్షాలు
నేడు రాజ్యసభ ముందుకు
  ఇది రాజ్యాంగంపై దాడి: రాహుల్‌
  రాజ్యసభలో మద్దతిస్తామనుకోవద్దు: శివసేన
  జేడీ(యూ)లోనూ వ్యతిరేకత
  బిల్లును ఉపసంహరించాల్సిందేనన్న మేధావులు

దిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుపై మంగళవారం వేడి రాజుకుంది. ఈ బిల్లు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉందని, పౌరసత్వం ఇవ్వడానికి మతాన్ని ప్రాతిపదికగా తీసుకోవడమేమిటని పలు విపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి. ఈశాన్య రాష్ట్రాల్లో బిల్లుకు వ్యతిరేకంగా బంద్‌ నిర్వహించారు. భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ఇలాంటి బిల్లు తగదంటూ దాదాపు వెయ్యిమంది మేధావులు, కళాకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్‌సభలో మంగళవారం వేడి రాజేసిన బిల్లు బుధ వారం రాజ్యసభనూ వేడెక్కించనుంది. ఇక్కడ కూడా బిల్లును ఆమోదింప చేసుకోవాలన్న పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 240 మంది సభ్యులున్న సభలో తమకు 124 నుంచి 130 వరకు ఓట్లు వస్తాయని అధికార పక్షం అంచనా వేస్తోంది. బిజూ జనతాదళ్‌, వైకాపా, తెదేపా సభ్యులతో పాటు మరికొన్ని ప్రాంతీయ పార్టీల నుంచి తమకు మద్దతు లభిస్తుందని, ఏడుగురు స్వతంత్రులు అండగా నిలుస్తారని భాజపా అంచనా. బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌, తృణమూల్‌, బీఎస్పీ, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, వామపక్షాలు, తెరాస తదితర పార్టీలన్నింటికీ కలిపి రాజ్యసభలో 97 మంది సభ్యులున్నారు. శివసేన, ఆప్‌ వంటి కొన్ని పార్టీలను కలిపితే ఈ బలం 110కి చేరుతుంది. తాము మద్దతు ఇవ్వాలంటే కొన్ని విషయాల్లో స్పష్టత కావాలంటూ శివసేన మెలిక పెడుతోంది.

పొరుగు దేశాల నుంచి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించాలని సంకల్పిస్తున్న పౌరసత్వ (సవరణ) బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించినా దీనిపై దేశవ్యాప్తంగా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా పలుచోట్ల ర్యాలీలు, ధర్నాలు జరిగాయి. లోక్‌సభలో ప్రభుత్వానికి మద్దతు పలికిన కొన్ని పార్టీల్లోనూ అంతర్మథనం మొదలైంది. బుధవారం రాజ్యసభలో స్వరం సవరించుకునేందుకు అవి సమాయత్తమవుతున్నాయి. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ బిల్లును.. రాజ్యాంగంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభిస్తే పోరాట బరి ఇక సుప్రీంకోర్టుకు మారుతుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించారు.

గళమెత్తిన మేధావులు
ప్రస్తుత రూపంలోని పౌరసత్వ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ సుమారు వెయ్యి మంది శాస్త్రవేత్తలు, మేధావులు ఉమ్మడిగా పిటిషన్‌పై సంతకం చేశారు. ‘‘అన్ని మతాల వారినీ సమానంగా చూడాలనేది మన రాజ్యాంగమే ప్రబోధిస్తోంది. పౌరసత్వానికి ఓ ప్రాతిపదికగా మతాన్ని తీసుకోవడమంటే అది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి దెబ్బకొట్టడమే. ముస్లింలను జాగ్రత్తగా పక్కకు తప్పించిన తీరు భారతదేశ బహుళత్వ కూర్పునకు భంగం కలిగిస్తుంది’’ అని వారు పేర్కొన్నారు. హార్వర్డ్‌ సహా దేశ విదేశాల్లోని పలు విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఇతర విద్యాసంస్థలకు చెందిన ఆచార్యులు దీనిపై సంతకాలు చేశారు. మరో 600 మంది కళాకారులు, మాజీ న్యాయమూర్తులు ఇలాంటి అభ్యర్థనే రూపొందించారు. ప్రతిపాదిత చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. దీనిపై సంతకం చేసినవారిలో రచయితలు- అరుంధతీ రాయ్‌, అమితవ ఘోష్‌, చిత్ర పరిశ్రమకు చెందిన అపర్ణాసేన్‌, నందితా దాస్‌, మేధావులు- రొమిలా థాపర్‌, చరిత్రకారుడు రామచంద్రగుహ, ఉద్యమకర్తలు తీస్తా సెతల్వాడ్‌, బెజవాడ విల్సన్‌ తదితరులు ఉన్నారు.

మద్దతుపై జేడీ(యు)లో భిన్నాభిప్రాయం
పట్నా: పార్లమెంటులో పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చే విషయంలో జేడీ(యు) పార్టీలో చీలిక తలెత్తింది. ఈ బిల్లు వివక్షపూరితంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిశోర్‌, ప్రధాన కార్యదర్శి వపన్‌ వర్మ పేర్కొన్నారు. లోక్‌సభలో తమ పార్టీ ఆ బిల్లుకు మద్దతు తెలపడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

శ్రీలంక తమిళులకూ ఇవ్వండి: శ్రీశ్రీ రవిశంకర్‌
చెన్నై: జాతుల మధ్య ఘర్షణల సమయంలో శ్రీలంక నుంచి వచ్చిన తమిళ శరణార్థులకూ భారత పౌరసత్వం ఇవ్వాలని ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌, ప్రముఖ పాటల రచయిత వైరముత్తు విజ్ఞప్తి చేశారు. లక్షకు పైగా ఉన్న ఈ శరణార్థులంతా మూడు దశాబ్దాలుగా మన దేశంలోనే నివసిస్తున్నారని, వీరి విషయాన్ని కేంద్రం పరిశీలించాలని రవిశంకర్‌ ట్విటర్‌ ద్వారా కోరారు.


స్పష్టత వచ్చేవరకు మద్దతు ఇవ్వం: ఠాక్రే

పౌరసత్వ సవరణ బిల్లుపై లోక్‌సభలో తాము లేవనెత్తిన సందేహాలకు స్పష్టత వచ్చే వరకు రాజ్యసభలో దానికి మద్దతు ఇచ్చేది లేదని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ముంబయిలో స్పష్టం చేశారు. శరణార్థులు ఏ రాష్ట్రంలో ఉండాలనే అంశం సహా బిల్లుపై సవివరంగా చర్చ జరగాలన్నారు. బిల్లును వ్యతిరేకించేవారిని దేశద్రోహులుగా చూడరాదన్నారు. పౌరసత్వ బిల్లుపై శివసేన అనుకూలంగా స్పందించినంతమాత్రాన అన్నివేళలా ఒకే అభిప్రాయాన్ని తమ రెండు పార్టీలూ వ్యక్తం చేయడం అసాధ్యమని ఎన్సీపీ పేర్కొంది. కుల, మత, భాష, ప్రాంతాల ప్రాతిపదికన ఎవరికీ అన్యాయం జరగకూడదనేదే తమ ఉద్దేశమంది.


దేశ పునాదుల నాశనానికి ప్రయత్నించడమే

పౌరసత్వ (సవరణ) బిల్లు... రాజ్యాంగంపై జరిగిన దాడి. దీనికి మద్దతు ఇచ్చేవారంతా దేశ పునాదుల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లే.

- రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు

 

అమిత్‌షాపై ఆంక్షలు విధించాల్సిందే: యూఎస్‌ కమిషన్‌
వాషింగ్టన్‌: భారతదేశం ప్రతిపాదిస్తున్న పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభిస్తే హోం మంత్రి అమిత్‌షా పైనా, ఇతర ముఖ్య నేతలపైనా కొన్ని ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై ఏర్పాటైన యూఎస్‌ కమిషన్‌ డిమాండ్‌ చేసింది. డిమాండ్‌ చేసిన సంస్థకు స్థాయిలేదని భారత్‌ తిప్పికొట్టింది.

ఒప్పందాలను ఉల్లంఘించేలా బిల్లు ఉంది
అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలను, పాక్‌తో ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించేలా బిల్లు ఉంది. హిందూ దేశాన్ని విస్తరించాలన్న ఆరెస్సెస్‌ ఆలోచనలో ఇదొక భాగం. జమ్మూ-కశ్మీర్‌లో ఆంక్షల్ని ఎత్తివేసేలా అంతర్జాతీయ సమాజం భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలి.

- ఇమ్రాన్‌ఖాన్‌, పాక్‌ ప్రధాని

 

హిందూ దేశంగా మార్చే ప్రయత్నమిది
మతపరమైన విభజన తీసుకువచ్చి భారత్‌ను హిందూ దేశంగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని నిర్ణయించరాదు.

-సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.