close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అవన్నీ నకిలీవే...

ఆ కరోనా కిట్లు, ఔషధాలు వాడితే ముప్పే
హెచ్చరిస్తున్న అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ
యూఎస్‌ విపణిలో విచ్చలవిడిగా అమ్మకాలు
మన దేశంలోనూ సొంత వైద్యమే!
అవసరం లేకున్నా యాంటీ-బయాటిక్‌ల వెంటపడుతున్న ప్రజలు
ఈనాడు - హైదరాబాద్‌

రోనా వైరస్‌ వ్యాధి (కొవిడ్‌-19) శరవేగంగా విస్తరిస్తున్న అమెరికాలో నకిలీ టెస్ట్‌ కిట్లు, మందుల బెడద ఎక్కువైంది. ప్రజల్లో నెలకొన్న ఆందోళన, భయభ్రాంతులను సొమ్ము చేసుకునేందుకు కొన్ని కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మా కంపెనీ టెస్ట్‌ కిట్‌తో మీరు ఇంట్లోనే సొంతంగా పరీక్ష చేసుకొని కరోనా వ్యాధి వచ్చిందీ లేనిదీ నిర్ధారించుకోవచ్చు... అని ప్రచారం చేసుకుంటూ టెస్ట్‌ కిట్లు విక్రయించే సంస్థలు అధికమయ్యాయి. అదేవిధంగా  ఈ వ్యాధికి మేం తయారు చేస్తున్న మందులు పరిష్కారాన్ని చూపుతాయి- అని చెప్పుకునే కంపెనీలు కూడా తయారయ్యాయి. ప్రజలు కూడా ఈ టెస్ట్‌ కిట్లు, మందులను కొనుగోలు చేయటానికి మొగ్గుచూపుతున్నారు. ఆన్‌లైన్లో, ఫార్మసీల్లో కరోనా కిట్లు, మందులు ‘ఆర్డర్‌’ చేయటానికి మొగ్గుచూపుతున్నారు. దీంతో నకిలీల ముప్పును అరికట్టటానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) రంగంలోకి దిగింది. మార్కెట్లో చెలామణి అవుతున్న అన్నిరకాల టెస్ట్‌ కిట్లను నమ్మవద్దని, అందులో అన్నీ నకిలీవని, ఈ కిట్లను తాము ఆమోదించలేదని తాజాగా యూఎస్‌ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. అంతేగాక కరోనా వైరస్‌ వ్యాధిని అదుపు చేసే కచ్చితమైన ఔషధం ఇంకా రాలేదని, కాబట్టి నకిలీ టెస్ట్‌ కిట్లు, వ్యాధిని తగ్గిస్తాయని ప్రచారంలో ఉన్న ఔషధాల జోలికి పోవద్దని ప్రజలకు తాజాగా సూచిస్తోంది.

‘‘కొవిడ్‌-19 వ్యాధిని అదుపు చేసే ఔషధాలు, వ్యాక్సిన్లను సాధ్యమైనంత త్వరగా ఆవిష్కరించే నిమిత్తం ఫార్మా కంపెనీలతో మేం కలిసి పనిచేస్తున్నాం, కానీ ఈ లోపు కొన్ని కంపెనీలు ఈ అత్యవసర పరిస్థితిలో సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి, అందులో భాగంగా నిర్ధారణ కాని, అనుమతి లేని ఉత్పత్తులను ప్రజల ముందుకు తెస్తున్నాయి. ఆ ఉత్పత్తుల వల్ల ప్రయోజనం లేకపోగా లేనిపోని సమస్యలు తలెత్తవచ్చు, కాబట్టి అప్రమత్తంగా ఉండాలి’’ అని యూఎస్‌ఎఫ్‌డీఏ పేర్కొంది. ప్రధానంగా ఆన్‌లైన్లో ఇటువంటి ఉత్పత్తులు, ఔషధాలు, న్యూట్రినెంట్లు...అధికంగా అమ్మకానికి కనిపిస్తున్నాయని వివరించింది. ఇంటి దగ్గరే కరోనా వ్యాధి నిర్ధారణకు వీలుకల్పించే కిట్‌ అందుబాటులోకి వస్తే ప్రయోజనకరమే, కానీ అటువంటిది ఇంకా తయారు కాలేదు- అని యూఎస్‌ఎఫ్‌డీఏ పేర్కొంది. ఇటువంటి విక్రయదార్లను అదుపు చేసే ప్రయత్నాలు చేపట్టినట్లు వివరించింది. తగిన హెచ్చరికలు చేయటంతో పాటు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కొవిడ్‌-19 వ్యాధిని అదుపు చేసే ఔషధాలు, వ్యాక్సిన్లను అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో యూఎస్‌లో కొన్ని ఫార్మా- బయోటెక్‌ కంపెనీలు క్రియాశీలకంగా ఉన్నాయి. ఈ కంపెనీలు గుర్తించిన ఔషధ మూలకణాలపై ప్రస్తుతం క్లినికల్‌ ట్రయల్స్‌ (ఔషధ పరీక్షలు) జరుగుతున్నట్లు యూఎస్‌ఎఫ్‌డీఏ పేర్కొంది.

ఇటువంటి ధోరణి అమెరికాలోనే కాదు, మనదేశంలోనూ కొంతమేరకు కనిపిస్తోంది. ఆందోళనకు గురవుతున్న ప్రజలు మెడికల్‌ షాపులకు వెళ్లి  యాంటీ-బయొటిక్‌ ట్యాబ్లెట్లు- క్యాప్సుల్స్‌, మలేరియా మందులు కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నారు. అందువల్ల కొన్ని ప్రాంతాల్లోని మెడికల్‌ షాపుల్లో ఈ మందుల కొరత ఏర్పడింది. ఇప్పటికే అజిత్రోమైసిన్‌, అమాక్సిలిన్‌ ట్యాబ్లెట్లు- క్యాప్సుల్స్‌ దొరకటం లేదు. అదే విధంగా మలేరియాను అదుపు చేసేందుకు వినియోగించే క్లోరోక్విన్‌ మాత్రలు, జలుబు- దగ్గు- అలెర్జీని అదుపు చేసే ఔషధమైన లెవోసిట్రిజిన్‌ ట్యాబ్లెట్లకు కూడా కొరత ఏర్పడింది. మరోపక్క రోగనిరోధక శక్తిని (ఇమ్యూనిటీ బూస్టర్‌) పెంపొందిస్తాయనే పేరుతో కొత్త ట్యాబ్లెట్లు మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఇక హోమియోపతి ఔషధాలు విక్రయించే షాపుల్లో అయితే క్యూ-కట్టే పరిస్థితి ఉంది. కొన్ని రకాల హోమియోపతి మందులు కరోనా వైరస్‌ వ్యాధి రాకుండా నిరోధిస్తాయనే ప్రచారం జరగటంతో షాపులకు వెళ్లి అక్కడ వారు చెప్పిన మందు కొనుగోలు చేస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. కానీ ఇలా సొంత వైద్యం వైపు మొగ్గుచూపటం ప్రమాదకరమని, ఏదైనా అనుమానం ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి కానీ, ఎవరి వారు తోచిన ముందులు వేసుకోవటం సరికాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాధి సోకకుండా నివారించే, నిర్ధారిత- రుజువైన ఔషధాలు లేవని, అందువల్ల ఎవరో చెప్పారని తోచిన మందులు వేసుకుంటే ఇబ్బందులు ఎదురుకావచ్చని పేర్కొంటున్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు