close

ప్రధానాంశాలు

ఈఎంఐలు 3 నెలలు వాయిదా

రుణగ్రహీతలకు భరోసా
క్రెడిట్‌ కార్డులకూ వర్తింపు
ఈనాడు - హైదరాబాద్‌

దేశంలో నెలకొన్న అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో ప్రజల ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. ఒకటో తారీఖు వస్తున్న దృష్ట్యా.. ఏప్రిల్‌లో రుణ వాయిదాలు ఎలా చెల్లించాలనే ఆందోళన చాలామందిలో నెలకొంది. ఈ భయాందోళనల నేపథ్యంలో ఆర్‌బీఐ చల్లని కబురు వినిపించిందనే చెప్పాలి. కొవిడ్‌-19 మహమ్మారి వల్ల ఆదాయాలు ప్రభావితమై.. ఖర్చులు అధికమై.. వాయిదాలు చెల్లించలేని పరిస్థితి వచ్చిన వారికి మూడు నెలలపాటు వాయిదాలపై మారటోరియం అవకాశాన్ని కల్పించింది. భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ చాలా పటిష్ఠంగా ఉందనీ, డిపాజిటర్లు ఏమాత్రం ఆందోళన చెందవద్దని పేర్కొంది.

వాయిదాలు వాయిదా...
రిటైల్‌ రుణగ్రహీతలు తీసుకున్న అన్ని రకాల టర్మ్‌ రుణాల వాయిదాల చెల్లింపుల (ఈఎంఐ)పై ఆర్‌బీఐ మూడు నెలల మారటోరియం ప్రకటించింది.
అన్ని వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, బ్యాకింగేతర రుణ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ), గృహ రుణ సంస్థలు (హెచ్‌ఎఫ్‌సీ), ఇతర ఆర్థిక సంస్థలు ఇచ్చిన టర్మ్‌ రుణాలన్నింటికీ ఇది వర్తిస్తుంది.
గృహరుణాలు, వ్యక్తిగత రుణాలు, విద్యా రుణం, వాహన రుణాలతోపాటు, టీవీ, మొబైల్‌, ఫ్రిజ్‌లు ఏసీలు తదితరాల కొనుగోలుకు అప్పు తీసుకుని, వాయిదాల్లో చెల్లిస్తుంటే ఈ మారటోరియం వెసులుబాటును వినియోగించుకోవచ్చు.
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు అందించే పీ2పీ రుణాలకు ఇది వర్తించదు.
రద్దు కాదు..
రుణాలకు సంబంధించి మూడు నెలల వాయిదాలను ఆర్‌బీఐ రద్దు చేసిందనే ప్రచారంలో నిజం లేదు. ఇది కేవలం వాయిదాలను వాయిదా వేయడమే. కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రజలకు ఆర్థికంగా కొంత వెసులుబాటును కల్పించాలనేదే ఆర్‌బీఐ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఇచ్చిన వ్యవధి మీ మొత్తం రుణ వ్యవధిలో పెరుగుతుంది. ఉదాహరణకు మీ రుణం 2021 ఏప్రిల్‌ నాటికి పూర్తవుతుందనుకుందాం. మీరు మారటోరియం వ్యవధిని వినియోగించుకుంటే.. జులై 2021 వరకూ మీ వ్యవధి పెరుగుతుంది. అయితే, ఈ మారటోరియం వ్యవధిలో చెల్లించాల్సిన వడ్డీని, అసలుకు జమ చేస్తారు. అంటే, అప్పుడు రుణ బాకీ ఆ మేరకు పెరుగుతుంది. ఉదాహరణకు మీ గృహరుణం బాకీ అసలు రూ.20లక్షలు ఉందనుకుందాం.. దీనికి నెలకు మీరు రూ.20,000లు ఈఎంఐ చెల్లిస్తున్నారనుకుందాం.. ఇందులో రూ.15,000 వడ్డీ, రూ.5,000 అసలు ఉందనుకుందాం. అంటే, ఈ మూడు నెలల మారటోరియం వ్యవధిలో మీరు చెల్లించని వడ్డీ రూ.45,000 అవుతుంది. దీన్ని రూ.20 లక్షల అసలుకు కలుపుతారు. దాంతో మీరు బాకీ ఉన్న అసలు మొత్తం రూ.20,45,000 అవుతుంది. అయితే, ఈ మూడు నెలలు చెల్లింపు చేయలేదు కాబట్టి, రుణ వ్యవధి ఎటూ మూడు నెలలు పెరుగుతుంది. వాస్తవంగా పరిశీలిస్తే.. అసలు మొత్తం రూ.45,000 పెరిగింది కాబట్టి ఆమేరకు వడ్డీ కూడా కట్టాల్సి ఉంటుంది కాబట్టి, ఈ వ్యవధి మూడు నెలలకు మించే ఉండవచ్చు. అందువల్ల సాధ్యమైనంతవరకు మీ ఈఎంఐలను యధావిధిగా చెల్లించడమే ఉత్తమం. కాకపోతే ‘వాయిదాలు చెల్లించనందుకు ఎలాంటి రుసుము విధించరు. క్రెడిట్‌ స్కోరుపైనా దీని ప్రభావం ఉండదు. ఇది మూడు నెలల వాయిదాలను రద్దు చేసినట్లు కాదు. తాత్కాలికంగా వసూలు చేయడం లేదని అర్థం చేసుకోవాలి’ అని చెబుతున్నారు బ్యాంక్‌బజార్‌.కామ్‌ సీఈఓ అధిల్‌శెట్టి.
ఆదాయం తగ్గితేనే...
వాయిదాలు చెల్లించలేని పరిస్థితి ఉందని, కాబట్టి, వాయిదాలను చెల్లించలేమని చెబుతూ బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు మీ ఆదాయ పరిస్థితిని అంచనా వేసి, మీ ఆదాయం తగ్గిందని భావిస్తేనే మారటోరియానికి అనుమతించవచ్చు. దీనికి దరఖాస్తు ఎలా చేసుకోవాలి? ఆన్‌లైన్‌లోనా, సేవా కేంద్రాన్ని సంప్రదించాలా? అనే విషయంలో బ్యాంకులు ప్రస్తుతానికి స్పష్టత ఇవ్వలేదు. మీరు దరఖాస్తు చేయకపోతే.. మీ నెలసరి వాయిదాలను నిర్ణీత తేదీల్లో బ్యాంకు ఎప్పటిలాగానే మినహాయించుకుంటుంది. ‘ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి. అయినప్పటికీ.. ఆర్థికంగా వెసులుబాటు ఉన్నవారు ఈఎంఐలను ఎప్పటిలాగా చెల్లించడమే మేలు’ అని అధిల్‌ శెట్టి సూచిస్తున్నారు. వాయిదాలు చెల్లించలేని పరిస్థితి వస్తే.. మీ బ్యాంకును సంప్రదించడం మేలని తెలిపారు.
ఏయే నెలలకంటే..
మార్చి 1 నాటికి ఉన్న టర్మ్‌ రుణాలకు 3 నెలల ఈఎంఐలపై మారటోరియం వర్తిస్తుందని ఆర్‌బీఐ తెలిపింది. ఉదాహరణకు ప్రతి నెల 10వ తేదీ లోపు ఈఎంఐలు చెల్లిస్తున్నారని అనుకుందాం. మార్చి నెల ఈఎంఐలను (ఫిబ్రవరి- మార్చి మధ్య కాలానికి) ఇప్పటికే కట్టేసి ఉంటారు. మార్చి- ఏప్రిల్‌ మధ్య కాలానికి ఈఎంఐను ఏప్రిల్‌లో చెల్లిస్తారు.   ఇలాగే ప్రతి నెలా కడుతుంటారు. దీనిని బట్టి చూస్తే ఏప్రిల్‌, మే, జూన్‌లో చెల్లించే ఈఎంఐలకు మారటోరియం వర్తిస్తుందని అనుకోవచ్చు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సరిపోదు. ఏప్రిల్‌లో వచ్చేది మార్చి నెల వేతనం. కానీ, లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత.. ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? పూర్తి వేతనాలు అందుతాయా? లాంటి సందేహాలు అనేకం ఉన్నాయి.. సమస్య ఇప్పుడు కాదు.. ఏప్రిల్‌, మే.. ఆ తర్వాతే వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఏప్రిల్‌ నుంచి వర్తించేలా కనీసం ఆరు నుంచి తొమ్మిది నెలలపాటు మారటోరియం సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది’ అని ఒక ఆర్థిక నిపుణుడు అభిప్రాయపడ్డారు.
క్రెడిట్‌ కార్డుల బిల్లులకూ...
క్రెడిట్‌ కార్డు బిల్లులు చెల్లించలేకపోయినా.. మారటోరియం వెసులుబాటును వాడుకునేందుకు ఆర్‌బీఐ వెసులుబాటు కల్పించింది. అయితే, మీరు కార్డు బిల్లులు చెల్లించే పరిస్థితుల్లో ఉంటే.. ఎప్పటిలాగే కట్టేయండి. క్రెడిట్‌ కార్డు వడ్డీ రేట్లు కాస్త ఖరీదెక్కువ. మీరు బాకీ చెల్లించకపోతే.. ఆ మొత్తంపై వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇది భారమే. కాబట్టి, సాధ్యమైనంత వరకూ బిల్లులు చెల్లించడమే ఉత్తమం. మరీ తప్పదు అనుకుంటేనే మారటోరియాన్ని వాడుకోండి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.