close

ప్రధానాంశాలు

ఆర్థిక మాంద్యం కమ్ముకుంటోంది

అభివృద్ధి చెందుతున్న దేశాలపై తీవ్ర ప్రభావం
ఐక్యరాజ్యసమితి ప్రత్యేక నివేదిక

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది తీవ్ర మాంద్యంలోకి జారుకుంటుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. కరోనా కాటుతో ప్రపంచ దేశాలు లక్షల కోట్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోతాయని అంచనా వేసింది. భారత్‌, చైనా మినహా అభివృద్ధి చెందుతున్న దేశాలపై దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి విభాగం(యూఎన్‌సీటీఏడీ) ఓ నివేదికను విడుదలచేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు 2.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం ఉందని అభివృద్ధి చెందిన దేశాలకు సూచించింది. రానున్న రెండేళ్లలో బాధిత దేశాలు 2-3 ట్రిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులను సైతం కోల్పోతాయని అంచనావేసింది. అయితే చైనా, భారత్‌లు ఈ మాంద్యం నుంచి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయంది. దీనికి కారణాలను మాత్రం వివరించలేదు.

మున్ముందు మరింత జఠిలం: కరోనా దెబ్బకు రెండు నెలల వ్యవధిలోనే పేద, వర్ధమాన దేశాలు దారుణంగా దెబ్బతింటున్నాయి. ఎగుమతులు-దిగుమతులు నిలిచాయి. పర్యాటకం కుదేలైంది. వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. పన్నుల ఆదాయం పడిపోయింది. మున్ముందు పరిస్థితి ఊహించనంత జఠిలం అవుతుందని ఐరాస ఆందోళన వ్యక్తంచేసింది.

ఆదుకునేందుకు వ్యూహం: అభివృద్ధి చెందిన జీ-20 దేశాల బయట ఏకంగా 600 కోట్ల జనాభా నివసిస్తోందని, వారి బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత అభివృద్ధి చెందిన దేశాలపై ఉందని యూఎన్‌సీటీఏడీ సూచించింది. గడ్డు పరిస్థితుల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలను గట్టెంచడానికి పలు సూచనలు ప్రతిపాదించింది.
* అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్‌) నిబంధనల్ని సడలించి, ఆయా దేశాలకు లక్ష కోట్ల డాలర్ల మేర ద్రవ్య లభ్యతను కల్పించాలి.
* ఆయా దేశాల్లో నిధుల సరఫరాకు ఆటంకం కలగకుండా ఐఎంఎఫ్‌ ఆధ్వర్యంలో నిఘా, నియంత్రణ ఏర్పాటుచేయాలి.

పేదరికంలోకి 1.10 కోట్ల మంది: ప్రపంచ బ్యాంకు
ప్రస్తుత అసాధారణ పరిస్థితుల కారణంగా ఏకంగా 1.10 కోట్ల మంది కొత్తగా పేదరికంలోకి జారిపోతారని ప్రపంచ బ్యాంకు నివేదికలో ప్రకటించింది. తూర్పు ఆసియా, పసిఫిక్‌ దేశాల్లో 2019 అంచనాల ప్రకారం 5.8% వృద్ధి ఉంటుందని భావించారు. అది 2020 చివరికి 2.1 శాతానికి పరిమితం అవుతుందని లెక్కవేశారు. కానీ... ప్రస్తుతం మైనస్‌ 0.5%గా ఉండనుంది. చైనాలోనూ వృద్ధి 0.1 శాతానికి పడిపోతుందని ప్రపంచబ్యాంకు వెల్లడించింది.

- ఈనాడు ప్రత్యేక విభాగం

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.