close

ప్రధానాంశాలు

వాయిదా వేస్తే భారమే

3 నెలల మారటోరియంపై విశ్లేషణ
ఈనాడు - హైదరాబాద్‌

రుణాలపై నెలవారీ వాయిదాల (ఈఎంఐ)ను 3 నెలల పాటు వాయిదా (మారటోరియం) వేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎలా అమలవుతుందనే విషయమై బ్యాంకులు స్పష్టత ఇస్తున్నాయి. ఈనెల (ఏప్రిల్‌) నుంచి అమలు చేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, గృహ రుణ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈఎంఐ వాయిదా కోరుకునేవారు బ్యాంక్‌ సూచించిన కాల్‌సెంటర్‌ లేదా ఇమెయిల్‌ ఐడీకి దరఖాస్తు చేసుకుంటేనే ఇది అమలవుతుంది. అయితే ఈ నెలలకు చెల్లించాల్సిన వడ్డీ కూడా, మిగిలిన అసలుకు కలుస్తుంది. అందువల్ల బాకీ మొత్తం పెరుగుతుంది కనుక భారమే అవుతుంది.

ఈ రుణాలన్నింటికీ..
అన్ని రకాల టర్మ్‌ రుణాలకూ వాయిదా వర్తిస్తుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. రిటైల్‌ రుణగ్రహీతలతోపాటు ఎంఎస్‌ఎంఈలు, కార్పొరేట్లు కూడా ఈ సదుపాయం వాడుకోవచ్చు. వ్యవసాయ రుణాలు, రిటైల్‌.. ఇలా ఏ రుణమైనా సరే వాయిదా పద్ధతిలో చెల్లిస్తూ ఉంటే, వాటిన్నింటికీ ఈ మారటోరియం వర్తిస్తుంది. ఓవర్‌డ్రాఫ్ట్‌గా తీసుకున్న వాటికీ ఈ వెసులుబాటు తీసుకోవచ్చు. క్రెడిట్‌ కార్డు బిల్లుపై ఈఎంఐలు, మొత్తం బిల్లునూ వాయిదా వేసుకోవచ్చు (మార్చి 1 కన్నా ముందు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించి ఉండాలన్నది నిబంధన). ఒక బ్యాంకులో గృహరుణం, మరో బ్యాంకులో వ్యక్తిగత రుణం, ఇంకో సంస్థ నుంచి క్రెడిట్‌ కార్డు ఉన్నా.. వీటన్నింటికీ ఈ వాయిదాల వెసులుబాటు కోరవచ్చు. ఒకే బ్యాంకులో ఉన్నా సరే దీనిని అనుమతిస్తారు.

వడ్డీతోసహా..
మార్చి 1, 2020 నుంచి మే 31, 2020 వరకూ రుణాలపై మారటోరియం అని ప్రకటించారు. మొత్తం 90 రోజులకు ఇది వర్తిస్తుందన్నమాట. అంటే 3 నెలల పాటు వాయిదాలను చెల్లించక్కర్లేదన్నమాట.
* మార్చి ఈఎంఐ ఇప్పటికే చెల్లించేశాం. ఇక మిగిలింది ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించినవే. మరి, 3 నెలలకు ఎలా? అనే సందేహం రావచ్చు.. దీనికి సంబంధించి బ్యాంకులు రెండు రకాల ఐచ్ఛికాలను ఎంచుకునే వెసులుబాటునిచ్చాయి.
* కావాలనుకున్న వారు మార్చి నెలతోపాటు, ఏప్రిల్‌, మేలకు మారటోరియం ఎంచుకోవచ్చు. ఇప్పటికే మీరు చెల్లించిన మార్చి ఈఎంఐని వెనక్కిచ్చేస్తారు. లేదా రెండు నెలల వ్యవధికే మారటోరియం ఎంచుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు, ఆర్థిక సంస్థలన్నీ ఈ విషయంలో ఒకే విధంగా నిబంధనలను అమలు చేస్తున్నాయి.

వ్యవధి.. ఈఎంఐ..
మూడు లేదా రెండు నెలల మారటోరియం గమనించాల్సిన ముఖ్య విషయం ఒకటుంది.. ఇక్కడ బ్యాంకులు మరో అవకాశం (ఆప్షన్‌) ఇస్తున్నాయి.. వ్యవధి పెరగాలా? లేదా ఈఎంఐ పెంచాలా? అనేది రుణగ్రహీత నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఆయా బ్యాంకుల నిబంధనలు, రుణగ్రహీత వయసును బట్టి ఇందులో ఏది వర్తిస్తుందనేది బ్యాంకులు నిర్ణయించే వీలూ ఉంది. ఉదాహరణకు ఒక బ్యాంకు రుణ గ్రహీత వయసు 60 ఏళ్ల వయసు మించకముందే వాయిదాలూ పూర్తి కావాలనే నిబంధనతో ఉందనుకుందాం. అలాంటప్పుడు ఈ మూడు నెలలు పెంచితే.. ఈ నిబంధన అడ్డం కావచ్చు. ఆ సందర్భంలో కచ్చితంగా ఈఎంఐ పెంచుతుంది. ఈ విషయంలో మీరు బ్యాంకును సంప్రదించడం ఉత్తమం.

ఏం చేయాలి?
ఇప్పటికే దాదాపు అన్ని బ్యాంకులు, బ్యాకింగేతర ఆర్థిక సంస్థలు తమ రుణ గ్రహీతలకు మారటోరియంపై సమాచారాన్ని అందించాయి. మొబైల్‌, ఇ-మెయిళ్లకు సమాచారాన్నిస్తున్నాయి. వెబ్‌సైట్లలో ప్రత్యేకంగా మారటోరియం కోసం దరఖాస్తు చేసుకునే ఏర్పాట్లు చేశాయి. ఎస్‌ఎంఎస్‌ పంపించి, దానికి సమాధానం ఇస్తే.. మారటోరియాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వ బ్యాంకులు పేర్కొన్నాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకులు ప్రత్యేక ఫోన్‌ నెంబర్లను ఏర్పాటు చేశాయి. కాబట్టి, మీ బ్యాంకు వెబ్‌సైటును లేదా వినియోగదారుల కేంద్రాన్ని సంప్రదించి ఏం చేయాలన్నది స్పష్టంగా తెలుసుకోండి. క్రెడిట్‌ కార్డు బిల్లులకూ ఇదే వర్తిస్తుంది.

చేతిలో డబ్బు ఉంటే..
మీ దగ్గర ఎప్పటిలాగే నిధులు ఉంటే.. రుణ వాయిదాలను ఆపకుండా చెల్లించడమే మేలు. దీనివల్ల ఈఎంఐలు, వాయిదాలు పెరగడంలాంటి ఇబ్బందులేమీ ఉండదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అత్యవసర నిధి అనేది ఎంతో అవసరం. దీన్ని వాడి వాయిదాలు చెల్లించకండి. ఒకవేళ నిజంగా మీ ఆదాయం తగ్గితే.. అప్పుడు మారటోరియాన్ని వాడుకోండి..

భారమెలా?
మీరు రూ.30లక్షల గృహరుణం తీసుకున్నారనుకుందాం. 9 శాతం వడ్డీ, వ్యవధి 20 ఏళ్లు (240 నెలలు) ఉందనుకుందాం.. మీరు 3నెలలు వాయిదాలు చెల్లించడం ఆపేస్తే.. ఈ మొత్తానికి చెల్లించాల్సిన వడ్డీ దాదాపు రూ.68,000 మీ అసలులో కలుస్తుంది. అంటే.. మీ రుణ మొత్తం రూ.30,68,000 అవుతుందన్నమాట.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.