close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
10 బృందాలు.. 72 గంటలు..

ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులు
మృత్యు బావిలో తేలిన నిజం

 

మృత్యు బావిలో నిజం తేలింది.. హంతకులెవరో తెలిసింది.. తొమ్మిది మందిని ఎలా హతమార్చాడో బహిర్గతమైంది.. పోలీసులు 72 గంటల పాటు విచారించి.. మిస్టరీని ఛేదించారు..

ఈనాడు, వరంగల్, న్యూస్‌టుడే, వరంగల్‌ క్రైం

వరంగల్‌ గొర్రెకుంట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. రెండు రోజుల వ్యవధిలో బావిలో తొమ్మిది మృతదేహాలు కనిపించాయి. ఒకేసారి ఇంతమంది చనిపోవడం తొలిసారి కావడం, హత్యా.. ఆత్మహత్యా అనేది తేలకపోవడంతో కేసు ఛేదన పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. గురువారం మధ్యాహ్నం నుంచి ఆదివారం రాత్రి వరకు విచారణ కొనసాగుతూనే ఉంది. మొత్తంగా 72 గంటల పాటు, పది బృందాలతో రాత్రింబవళ్లు ముమ్మరంగా దర్యాప్తు చేసి ఎట్టకేలకు కేసును ఛేదించగలిగారు. బిహార్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌ నేరం చేసినట్టు పోలీసుల వద్ద అంగీకరించాడు. శీతల పానీయాల్లో నిద్ర మాత్రలు కలిపి.. స్పృహ కోల్పోయిన తర్వాత బావిలో వేసినట్లు చెప్పినట్లు సమాచారం.
గురువారం
గొర్రెకుంట వద్ద దత్తసాయి గోనె సంచుల పరిశ్రమ పక్కనున్న పాడుబడ్డ బావిలో నాలుగు మృతదేహాలు కనిపించాయి. యజమాని సంతోష్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు రంగంలోకి దిగి సాయంత్రం వరకు మృతదేహాలను వెలికి తీశారు. మక్సూద్, ఆయన భార్య నిషా, కూతురు బుస్రా, ఆమె కొడుకు బబ్లూగా నిర్ధరించి ఎంజీఎం మార్చురీకి పంపారు. ముందు ఆత్మహత్యగా అనుమానించారు. మక్సూద్‌ కొడుకులిద్దరితో పాటు గోదాములో ఉండే బిహార్‌కు చెందిన శ్యాం, శ్రీరాం లేకపోవడంతో పోలీసులు గాలింపు ప్రారంభించారు.
శుక్రవారం
ఉదయం మరో మృతదేహం బావిలో పైకి తేలడంతో స్థానికులు గీసుకొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని బయటకు తీస్తుండగానే ఒకటి తర్వాత ఒకటి అయిదు మృతదేహాలు బయటపడ్డాయి. మక్సూద్‌ కుమారులతో పాటు, శ్రీరాం, శ్యాం, కరీమాబాద్‌కు చెందిన షకీల్‌గా గుర్తించారు. ఇవి హత్యలేనని అనుమానించిన పోలీసులు విచారణ ప్రారంభించారు. పది బృందాలను రంగంలోకి దింపారు. బావితోపాటు, గోదాము తదితర పరిసరాల్లో క్లూస్‌టీంతో పాటు సాంకేతిక బృందాలు విచారణ మొదలు పెట్టాయి. యాకూబ్‌తో పాటు మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు.

శనివారం
సాంకేతికపరమైన అంశాలతో పాటు పోస్టుమార్టం రిపోర్టును పరిశీలించారు. అందులో ప్రాథమికంగా కొందరు ప్రాణాలతోనే నీళ్లలోకి తోసివేతకు గురయ్యారని తెలిసి ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు. కాల్‌డేటా ఆధారంగా సంజయ్‌కుమార్‌ను పట్టుకుని విచారించారు. కేంద్ర నిఘా విభాగం, హైదరాబాద్‌ నుంచి ఫోరెన్సిక్‌ విభాగం దర్యాప్తు కోసం బావి వద్దకు వచ్చాయి.
ఆదివారం
హైదరాబాద్‌ నుంచి వచ్చిన క్లూస్‌టీంతోపాటు, శిక్షణ ఐపీఎస్‌ అధికారులు ఘటనా స్థలంలో మరిన్ని ఆధారాలను విశ్లేషించారు. వరంగల్‌లో సీసీ ఫుటేజీలతో పాటు, సీడీఆర్‌ (కాల్‌ డేటా రికార్డింగ్‌) వివరాల ఆధారంగా సంజయ్‌ నేరం చేసినట్లు అనుమానించారు. అతన్ని పూర్తిస్థాయిలో విచారణ చేయడంతో 9 మందిని తాను మరో వ్యక్తి సహాయంతో హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు.
మృత్యుబావి కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ వి. రవీందర్‌ పర్యవేక్షించారు. సుమారు 100 మంది సిబ్బంది ఈకేసు విచారణ కోసం పనిచేశారు.
టాస్క్‌ఫోర్స్‌
టాస్క్‌ఫోర్స్‌ విభాగంలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, సిబ్బందితో కలిపి మొత్తం కేసును ఛేదించేందుకు తీవ్రంగా కృషి చేశారు. అనుమానితులను గుర్తించి వారి గురించి వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తూ సహకరించారు.
సీసీఎస్‌
సీసీఎస్‌ విభాగం ప్రస్తుత కేసులో కీలకంగా పనిచేసింది. మృతిచెందిన తొమ్మిది మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో ఈ కోణంలో సీసీఎస్‌ కేసు విచారణ చేపట్టారు.

ఘటనా స్థలం వద్ద వివరాలు సేకరిస్తున్న శిక్షణ ఐపీఎస్‌ అధికారులు

యోగేశ్‌ గౌతమ్, అఖిలేష్‌ మహాజన్‌ 

ప్రత్యేక విభాగం (ఎస్‌బీ)
నిందితులకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు వారు ఎక్కడెక్కడ తిరిగారు.. నేర చరిత్ర ఇతర విషయాలపై ఆరా తీసింది. గతంలో మృతులు శివనగర్, కరీమాబాద్‌ ప్రాంతంలో ఉండేవారు. ప్రస్తుతం పరిశ్రమ వద్ద ఉన్నారు. ఇతరులతో వీరికి ఉన్న సంబంధాలు ఇతర అంశాలపై ప్రత్యేక విభాగం వివరాలు తీసుకొంది.

సాంకేతిక బృందం
ప్రస్తుత కేసును ఛేదించేందుకు పోలీసులకు సాంకేతిక ఆధారాలు ఉపకరించాయి. ముఖ్యంగా కాల్‌డేటా, సీసీ ఫుటేజీలు కేసులో కీలక సాక్ష్యాలు అందించాయి. మృతులు ఉపయోగించిన సెల్‌ఫోన్ల కాల్‌ డేటా విశ్లేషణ తీసుకొంది. కేసులో ఇదే నిందితుణ్ని పట్టుకోవడంలో తోడ్పడింది.  
క్లూస్‌ బృందం
ఘటన జరిగిన ప్రదేశంలో ఆధారాలను సేకరించి వివిధ వస్తువులపై ఉన్న వేలిముద్రలను తీసుకొని వాటిని కంప్యూటర్‌ ద్వారా గుర్తించి నిందితుల వివరాలు తెలుసుకోడంపై ఆరా  తీసింది.  
స్థానిక పోలీసులు
ఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్ష్యాలు, స్థానికులు, ఇతర విషయాలపై స్థానిక పోలీసులు విచారణ వేగంగా చేపట్టారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని పలు కోణాల్లో విచారించారు. కేసును ఛేదించేందుకు వీరు తీవ్రంగా కృషి చేశారు. ప్రతి చిన్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని చివరకు నిజాన్ని వెలికితీశారు.
* పోలీసులతోపాటు వైద్య ఆధారాలు కూడా కేసులో కీలకంగా మారాయి. ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశాక ఫోరెన్సిక్‌ నిపుణులు ప్రాథమికంగా తేల్చిన విషయం ఏంటంటే.. మగత నిద్రలో వీరిని బావిలోకి తోశారని తేల్చింది. పోలీసులకు ఈ సమాచారం ఎంతో ఉపకరించింది.

గొర్రెకుంటలోని గన్నీ సంచుల గోదాములో ఆధారాలకోసం పరిశోధిస్తున్న

క్లూస్‌ టీం అధికారులు

మూడు దుకాణాల నుంచి నిద్రమాత్రలు!
మృతులకు ఇచ్చిన శీతల పానీయాల్లో వినియోగించిన నిద్ర మాత్రలను నగరంలోని మూడు మందుల దుకాణాల నుంచి సంజయ్‌ తెచ్చినట్లు తెలిసింది. హత్యల పథక రచనను ఇంటర్నెట్‌ ద్వారా చూసి ఇక్కడ అమలు చేసినట్లు విచారణలో సంజయ్‌ వెల్లడించారని తెలిసింది.
స్థానిక మహిళ సమాచారంతో..
గురువారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో గోదాం వద్దకు ఒక ఆటో వచ్చినట్టు, ఆటోడ్రైవర్‌ లోనికి వెళ్లి గంట తర్వాత తిరిగి బయటకు వెళ్లినట్టు ఒక స్థానికురాలు పోలీసులకు తెలియజేశారు. ఈ సమాచారం పోలీసులకు ఎంతో తోడ్పడింది. సంజయ్‌ చెపుతున్నట్లు మరో వ్యక్తి ఆటో డ్రైవర్‌ అని పోలీసులు నిర్ధారించుకొన్నారు. అతని కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.