close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చుట్టేస్తున్న మహమ్మారి

ఒక్కరోజులో 387 కరోనా కేసులు

గుంటూరు నగరంలోనే 243

ఈనాడు, గుంటూరు

కారంపూడిలోని గాంధీబొమ్మ సెంటర్‌ రెడ్‌జోన్‌

ప్రాంతంలో పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు

జిల్లాలో కరోనా కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. రెండు వారాలుగా వైరస్‌ విజృంభణతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య మూడు వేలు దాటింది. సోమవారం ఒక్కరోజే 387 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో కంటెయిన్‌మెంట్‌ జోన్లలో కట్టడి వ్యూహాన్ని పక్కాగా అమలు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. క్వారంటైన్‌ కేంద్రాలను కొవిడ్‌ కేర్‌ కేంద్రాలుగా మార్చి పాజిటివ్‌ కేసులు వందల సంఖ్యలో వస్తున్నా వారందరికీ వసతి, వైద్యం అందించడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ జిల్లా ప్రత్యేకాధికారి రాజశేఖర్‌తో చర్చించి వైరస్‌ కట్టడికి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు లేకపోవడంతో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు కొందరు పరీక్షలకు దూరంగా ఉంటున్నారు. దీంతో వారికి తెలియకుండానే మరికొందరికి వైరస్‌ వ్యాపిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

నగరంలో వైరస్‌ విజృంభణ

గుంటూరులో గడిచిన 24గంటల వ్యవధిలో 243పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో బయటకు వెళ్లాలంటే నగరవాసులు భయపడే పరిస్థితి నెలకొంది. వ్యాపారులు కొందరు స్వచ్ఛందంగా వాణిజ్యసముదాయాలు మూసివేసి ఇళ్లకే పరిమితమయ్యారు. జిల్లా యంత్రాంగం కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం 12గంటల వరకే వ్యాపార కార్యకలాపాలకు అనుమతించింది. కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో జులై 28 వరకు దుకాణాలు పూర్తిగా మూసేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. రాకపోకలు సాగించడానికి వీలుగా ఒకే మార్గాన్ని తెరిచి ఎక్కడికక్కడ నియంత్రిస్తున్నారు. పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేశారు. నగరంలో జనం గుమిగూడే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సామాజిక దూరం పాటించేలా చూస్తున్నారు. వ్యాపారులు సైతం మాస్క్‌లు లేకుండా వచ్చే వినియోగదారులకు సరకులు విక్రయించడం లేదు.

అప్రమత్తతతోనే అడ్డుకట్ట

కరోనా వైరస్‌ సోకినట్లు అనుమానం వచ్చిన వెంటనే స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవడంతోపాటు ఐసోలేషన్‌కు వెళ్లడం వల్ల ఇతరులకు వైరస్‌ సోకకుండా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అనుమానితులు స్వాబ్‌లు ఇచ్చిన తర్వాత ఫలితాలు వచ్చేలోపు సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్ల కరోనా విస్తరిస్తోంది. పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అప్పటికే కొందరికి వైరస్‌ విస్తరిస్తోంది. జిల్లాలో ఇటీవల ఒక అధికారికి కరోనా వైరస్‌ సోకినట్లు అనుమానం వచ్చింది. వెంటనే స్వచ్ఛందంగా వెళ్లి పరీక్ష చేయించుకున్నారు. ఫలితం వచ్చేవరకు ఇతరులతో కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితాల్లో పాజిటివ్‌ నిర్ధారణ అయిన తర్వాత ఐసోలేషన్‌కు వెళ్లారు. ఈక్రమంలో కుటుంబ సభ్యులతోపాటు, రోజువారీగా తనతోపాటు కార్యాలయంలో పనిచేసే యంత్రాంగానికి పరీక్షలు చేయించగా ఒక్కరికి కూడా వైరస్‌ సోకలేదు. సదరు అధికారికి కరోనా వైరస్‌ విస్తరణపై అవగాహనతోపాటు అనునిత్యం మాస్క్‌ ధరించడంతోపాటు వస్తువులు తాకిన వెంటనే చేతులు శానిటైజ్‌ చేసుకోవడం, ఇతరులతో కలిసినప్పుడు సామాజిక దూరం పాటించడం వంటివి పక్కా అమలు చేయడంతో వైరస్‌ మరొకరికి విస్తరించకుండా అడ్డుకోగలిగారు. ఇలా ప్రతి ఒక్కరూ వారి పరిధిలో స్వీయ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటే మేలు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌ వివరాలు..

జిల్లా వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో సోమవారం 387 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గుంటూరు నగరపాలక సంస్థలో 243 కేసులు గడిచిన 24గంటల్లో నమోదయ్యాయి. అమరావతి 5, అమర్తలూరు 1, అచ్చంపేట 1, బాపట్ల 1, బొల్లాపల్లి 6, చిలకలూరిపేట 5, దాచేపల్లి 1, దుగ్గిరాల 1, దుర్గి 1, యడ్లపాడు 1, గుంటూరు గ్రామీణ 1, గురజాల 3, ఈపూరు 1, క్రోసూరు 2, మాచర్ల 2, మంగళగిరి 16, నరసరావుపేట 25, నూజండ్ల 1, పెదనందిపాడు 4, పెదకాకాని 2, పిడుగురాళ్ల 3, పెదకూరపాడు 1, పొన్నూరు 2, రేపల్లె 3, రొంపిచర్ల 1, సత్తెనపల్లి 6, శావల్యాపురం 2, తాడేపల్లి 16, తెనాలి 23, తాడికొండ 2, తుళ్లూరు 1, చుండూరు 2, వట్టిచెరుకూరు 1, వేమూరులో ఒక పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి.

రాష్ట్ర బులెటిన్‌లో జిల్లా వివరాలు ఇలా....
గడిచిన 24గంటల్లో నమోదైన పాజిటివ్‌ కేసులు 191
జిల్లాలో మొత్తం కరోనా కేసులు 3210
కోవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నవారు 1683
కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లినవారు 1495
ఇప్పటివరకు కరోనా మృతులు 32
గడిచిన 24గంటల్లో మృతి చెందిన వారు 3 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.