close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొత్త మార్పులు.. మరిన్ని అవకాశాలు

పారిశ్రామిక రంగంపై రాష్ట్ర ప్రభుత్వ నూతన విధానం
పరిశ్రమల్లో స్థానిక యువతకు మెరుగవనున్న ఉపాధి
ఈనాడు డిజిటల్, మహబూబ్‌నగర్‌

వలసల జిల్లాగా ఉమ్మడి జిల్లాకు పేరుంది. పనుల కోసం హైదరాబాద్‌తోపాటు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి. ప్రస్తుతం ఈ పరిస్థితి మారుతోంది. ఉమ్మడి జిల్లాలో విద్యారంగంలో పెను మార్పులు వచ్చాయి. మహబూబ్‌నగర్‌లో పాలమూరు విశ్వవిద్యాలయం వచ్చింది. ఏటా వందల సంఖ్యలో విద్యార్థులు తమ చదువులు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. వీరంతా ఉపాధి కోసం హైదరాబాద్‌ లేదా ఇతర పెద్ద నగరాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మహబూబ్‌నగర్, జడ్చర్ల, పోలేపల్లి పారిశ్రామికవాడలతోపాటు రాజాపూర్, బాలానగర్‌ మండలాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో ఇతర ప్రాంతాలకు చెందిన నైపుణ్య ఉద్యోగులు, కార్మికులే పని చేస్తున్నారు. ఎక్కువగా బిహార్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌ జిల్లాలకు చెందిన వారికే ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలు మొత్తం 3,526 ఉండగా 32,543 మంది ఉపాధి పొందుతున్నారు. 36 భారీ పరిశ్రమలు ఉండగా అందులో 6,672 మంది పని చేస్తున్నారు. ఈ పరిశ్రమల్లో పనిచేస్తున్న వారిలో 80 శాతం మంది ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు సంబంధించిన వారే కావడం గమనార్హం.

కొత్త విధానంతో మేలు.. : ప్రభుత్వం కొత్త విధానం ద్వారా పాలమూరు జిల్లాలకు చెందిన వారికి పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. దీని ద్వారా కొత్తగా వచ్చే పరిశ్రమల్లో పాలమూరు యువత నైపుణ్య రంగంలో ఉపాధి అవకాశాలను స్థానికంగానే పొందనున్నారు. దీంతో పాటు పాక్షిక నైపుణ్యాలు ఉన్నవారికీ అవకాశం లభించనుంది. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం శివారులో ఐటీ పార్కు ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఐటీ టవర్‌ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఐటీ పార్కులో రానున్న ఐదేళ్లలో భారీగా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్నాయి. దీంతోపాటు హైదరాబాద్‌ - బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే జిల్లా అధికారులు బాలానగర్, రాజాపూర్, భూత్పూరు, మూసాపేట, అడ్డాకుల మండలాల్లో ప్రభుత్వ భూములను గుర్తించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలతో సహా రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలతో కలిపి మొత్తం 19,746 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు కానుంది. మరో ఐదేళ్లలో ఈ కారిడార్‌కు రూపురేఖలు రానున్నాయి. పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలిరానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త విధానం ద్వారా ఎంటెక్, బీటెక్, ఎంబీఏ, సాఫ్ట్‌వేర్‌ కోర్సులు చేసిన స్థానిక యువతకు 50 నుంచి 60 శాతం ఉద్యోగాలు రానున్నాయి. ఇతర కోర్సులు పూర్తి చేసిన వారికి 70 నుంచి 80 శాతం ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త విధానం ద్వారా స్థానిక యువతకు పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాల్లో పెద్దపీట ఉండనుందని మహబూబ్‌నగర్‌ పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి ‘ఈనాడు’కు తెలిపారు. అందుకోసం ప్రభుత్వం పరిశ్రమలకు విద్యుత్తు, పెట్టుబడి, జీఎస్‌టీలో పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వనున్నట్లు చెప్పారు. తర్వలో దీనికి కావాల్సిన విధివిధానాలు విడుదల అవుతాయన్నారు. రాయితీలు పొందిన పరిశ్రమలు తప్పనిసరిగా స్థానిక యువతకు అవకాశం కల్పించాల్సి ఉంటుందన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.