close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విరాళాల వెల్లువ

సినీ ప్రముఖుల ఔదార్యం

విపత్తు ఎదురైందంటే చాలు... సమాజానికి కష్టం వచ్చిందని తెలిస్తే చాలు... ఆపన్న హస్తం అందించడంలో ముందుంటుంది సినీ పరిశ్రమ. మేమున్నాం... అంటూ సినీ ప్రముఖులు అండగా నిలిచేందుకు ముందుకొస్తుంటారు. ఈసారీ కరోనా వైరస్‌ రూపంలో వచ్చిన కష్టాలకు బాసటగా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న పోరాటానికి ఊతంగా చిత్రసీమ తమ వంతు సాయం అందించేందుకు ముందు కొచ్చింది. పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు విరాళాలు ప్రకటిస్తూ ఔదార్యం చాటారు.

సినీ కార్మికుల కోసం చిరంజీవి రూ. 1 కోటి

రోనాతో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో సినిమా రంగం కూడా స్తంభించిపోయింది. చాలా మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ రంగంలో ఉన్న కార్మికులకి అండగా నిలుస్తూ చిరంజీవి రూ.1 కోటి విరాళం ప్రకటించారు. ‘‘కరోనా మహమ్మారిని నిలువరించడానికి లాక్‌ డౌన్‌ చెయ్యడం తప్పని సరి. ఇదే  సమయంలో దీని వల్ల దేశ వ్యాప్తంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అల్ప ఆదాయ వర్గాల్ని, రోజువారి వేతన జీవులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలోనూ ఇలాంటి వారున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే తెలుగు సినీ పరిశ్రమలోని పేద కళాకారుల్ని ఆదుకునేందుకు నా వంతు సాయం ప్రకటించా’’ అని ట్విటర్‌ వేదికగా తెలిపారు చిరంజీవి.

మహేష్‌ రూ. 1 కోటి

రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకి కలిపి రూ.1 కోటి సాయం ప్రకటించారు అగ్ర కథానాయకుడు మహేష్‌బాబు. ‘‘మానవత్వానిదే పైచేయి. కరోనాతో చేస్తున్న ఈ యుద్ధంలో మనదే అంతిమ విజయం అవుతుంది. ఈ పోరులో మనం విజయం సాధించాలంటే.. ఈ 21 రోజులు అందరూ ప్రభుత్వం చెప్పినట్టుగా లాక్‌ డౌన్‌ నియయాల్ని కచ్చితంగా పాటించాల’’ని కోరారు మహేష్‌.

ప్రభాస్‌ సాయం రూ. 4 కోట్లు

కరోనా బాధితుల సహాయార్థం అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ రూ.4 కోట్ల విరాళం ప్రకటించారు. ప్రధానమంత్రి సహాయనిధికి రూ.3 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున సాయం అందజేయనున్నట్టు తెలిపారు. ‘‘కరోనా వైరస్‌ నియంత్రణకు కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఇందుకోసం తనవంతుగా  ఈ విరాళం ఇస్తున్నాన’’ని ఓ ప్రకటనలో తెలిపారు ప్రభాస్‌.

బాబాయ్‌ స్ఫూర్తితో అబ్బాయి

యువ కథానాయకుడు రామ్‌చరణ్‌ తన తండ్రి చిరంజీవి అడుగుజాడల్లో నడుస్తూ ట్విటర్‌లో ఖాతా ప్రారంభించారు. తొలి ట్వీట్‌లో కరోనాపై పోరు కోసం సాయాన్ని ప్రకటించారు. బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌ స్ఫూర్తితో కరోనా నియంత్రణకు రూ.70 లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళంగా అందించబోతున్నట్లు  తెలియజేశారు చరణ్‌. ‘‘బాధ్యత కలిగిన పౌరులుగా ప్రతిఒక్కరూ ప్రభుత్వ నియమాలను పాటించాల’’ని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు చరణ్‌.  

తారక్‌ ఆపన్న హస్తం

రోనాపై పోరుకు ఎన్టీఆర్‌ తన వంతు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. కరోనా నివారణ చర్యలకు, చిత్ర పరిశ్రమలోని పేద కళాకారులను ఆదుకునేందుకు రూ.75 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇందులో రూ.50లక్షల్ని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు, మిగతా రూ.25 లక్షల్ని చిత్ర పరిశ్రమలోని కార్మికులను ఆదుకునేందుకు ఇస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలియజేశారు తారక్‌.

సాయితేజ్‌.. రూ.10 లక్షలు

యువ కథానాయకుడు సాయితేజ్‌ రూ.10 లక్షలు సాయం ప్రకటించారు. ‘‘గతంలో ఎప్పుడూ తలపడని ఓ పెద్ద శత్రువుతో మనమంతా యుద్ధం చేస్తున్నాం. ఈ పోరులో మనందరి బలంతో పాటు మనకు మరికొన్ని ఉప బలాల అవసరం. అందుకే తన వంతుగా కరోనా నివారణ చర్యలకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.5లక్షలు ఇస్తున్నా’’ అని ట్విటర్‌ ద్వారా ప్రకటించారాయన. అందరూ ఇళ్లలోనే సురక్షితంగా ఉంటూ.. ఈ పోరుకు సహకరించాలని పిలుపునిచ్చారు.
 

11 మంది కార్మికులకి ఆశ్రయం

నటుడు ప్రకాష్‌రాజ్‌ ఇప్పటికే తన దగ్గర పనిచేసే సిబ్బందికి ముందస్తుగా జీతాలు ఇచ్చారు. గురువారం తన పుట్టిన రోజును పురస్కరించుకుని, పుదుచ్చేరి, చెన్నై, ఖమ్మం ప్రాంతాలకి చెందిన కార్మికులకి ఆశ్రయం కల్పించారు. ‘‘11 మంది రోజువారీ కూలీలకు ఆశ్రయం కల్పించి, వారి కుటుంబాలతో మాట్లాడాను. కొంత డబ్బుని వారి ఖాతాల్లో జమ చేసి ఆర్థికంగా సహాయం చేస్తాను. అందరూ మానవత్వాన్ని చూపించండి’’ అంటూ ప్రకాష్‌రాజ్‌ విజ్ఞప్తి చేశారు.

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ కరోనా నివారణ చర్యల కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.10 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అల్లరి నరేష్‌ తన కొత్త చిత్రం ‘నాంది’ బృందానికి అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. తన ఈ చిత్ర యూనిట్‌లో రోజువారీ కార్మికులు 50 మందికి పైగా ఉన్నారని.. వాళ్లందరికీ తన తరపున, చిత్ర నిర్మాత సతీష్‌ వేగేశ్న తరపున  ఒక్కొక్కరికీ రూ.10 వేలు సాయం అందివ్వాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలిపారు.

తెలుగు చలనచిత్ర వేతన కార్మికులు, కళాకారులకి సహాయం చేయడానికి తెలుగు ఫిలిం డైరెక్టర్స్‌ ట్రస్ట్‌ ముందుకొచ్చింది. నిత్యావసర వస్తువులను అందించాలనే సంకల్పంతో అన్ని సినీ యూనియన్స్‌ నుంచి వివరాలు సేకరించి వారికి అండగా నిలిచే కార్యక్రమాన్ని చేపట్టామని మేనేజింగ్‌ ట్రస్టీ ఎన్‌.శంకర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
 

దర్శకనిర్మాతల సహాయం

థానాయకులతో పాటు దర్శకనిర్మాతలు కూడా కరోనాపై పోరాటానికి మద్దతుగా నిలుస్తూ  సాయం ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు   త్రివిక్రమ్‌ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.10 లక్షలు విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ మొత్తాన్ని అందివ్వనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అగ్ర   దర్శకులు కొరటాల శివ, అనిల్‌ రావిపూడి  తమ వంతు విరాళాలు ప్రకటించారు. కొరటాల శివ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.5 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. అనిల్‌ రావిపూడి కూడా రెండు ప్రభుత్వాలకు చెరో రూ.5 లక్షలు అందజేస్తున్నట్లు ప్రకటించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.