close

ప్రధానాంశాలు

ముగ్గురు పిల్లలకు కరోనా పాజిటివ్‌

34 కొత్త కేసులు
మొత్తం 348 మందికి సోకిన వైరస్‌
అనంతలో ఇద్దరు వైద్యులు, ఇద్దరు సిబ్బందికీ..

ఈనాడు, అమరావతి, యంత్రాంగం: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఒక్కరోజే 34 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 348కి చేరింది. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం సాయంత్రం 7 గంటల వరకు ఎనిమిది జిల్లాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లాలవారీగా చూస్తే.. గుంటూరు-8, అనంతపురం-7, కృష్ణా-6, నెల్లూరు-5, ప్రకాశం-3, చిత్తూరు-3, కర్నూలు-1, పశ్చిమగోదావరి-1 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల్లో దాదాపు సగం (49.42%) కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోనే ఉన్నాయి. కరోనా మహమ్మారి పసిపిల్లలనూ వదలడం లేదు. నెల్లూరు జిల్లాలో బుధవారం ముగ్గురు చిన్నారులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  తడకు చెందిన ఓ వ్యక్తి ఇప్పటికే ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా, ఆయన పిల్లలిద్దరికి కరోనా సోకింది. వాకాడులో మరో పదేళ్ల పాపకూ వ్యాధి సంక్రమించింది. ఇటీవల కరోనా వచ్చిన వైద్యుడి భార్యకు, ఆయన వద్ద పనిచేసే ఓ టెక్నీషియన్‌కు పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది.

నిత్యావసరాలూ అక్కడికే
గుంటూరు జిల్లాలో బుధవారం కొత్తగా 9 కేసులు నమోదుకావడంతో బాధితుల సంఖ్య 49కి చేరుకుంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై కరోనా కేసులు వచ్చిన ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించి ఆ ప్రాంతాలకు రాకపోకలను నియంత్రించింది. నిత్యావసరాలను అక్కడికే పంపి స్థానికులు బయటకు రాకుండా కట్టడిచేసింది.

ఒకరి నుంచి పలువురికి..
అనంతపురం జిల్లాలో ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా కరోనా అనుమానితుడికి చికిత్స చేసి, స్వీయ నిర్బంధంలో ఉన్న 24 మందిలో.. ఇద్దరు వైద్యులు, ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. హిందూపురానికి చెందిన బాధితుడు (58) ఈనెల 4న మరణించగా, అదేరోజు సాయంత్రం అతడికి కరోనా ఉన్నట్లు నివేదిక వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు, ఆ బాధితుడికి చికిత్స చేసే సమయంలోనే.. కళ్యాణదుర్గానికి చెందిన ఓ వృద్ధుడు (70) అప్పటికే ఆసుపత్రిలో చేరగా, ఇద్దరినీ పక్కపక్క బెడ్ల మీద ఉంచారు. ఆయన డిశ్చార్జి అయి ఇంటికెళ్లాక మళ్లీ కాలు విరిగి ప్రైవేటు ఆసుపత్రికి, తర్వాత సర్వజన ఆసుపత్రికి వచ్చారు. మంగళవారం ఆ వృద్ధుడు మరణించారు. బుధవారం అతడి పరీక్ష నివేదికలు పాజిటివ్‌ అని వచ్చాయి. దాంతో అతడి కుటుంబసభ్యులను, అంత్యక్రియలకు హాజరైనవారిని క్వారంటైన్‌కు పంపారు. ఇది జిల్లాలో రెండో కరోనా మరణం.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.