close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రమేశ్‌కుమార్‌ నియామకమే చట్టవిరుద్ధం

ఆయనను మళ్లీ అదే పోస్టులో ఎలా నియమిస్తాం?: ఏజీ శ్రీరాం

ఈనాడు, ఈనాడు డిజిటల్‌ - అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనను తాను పునర్నియమించుకునే అధికారం నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కి లేదని రాష్ట్ర ప్రభుత్వ అడ్వొకేట్‌ జనరల్‌ సుబ్రహ్మణ్యం శ్రీరాం తెలిపారు. అలా స్వయంగా ప్రకటించుకోవడం చట్టవిరుద్ధమన్నారు.  ఆయనను ఆ పోస్టులో మళ్లీ నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందే తప్ప, ఆయన స్వయంగా వెళ్లి ఆ పోస్టులో కూర్చునే వెసులుబాటు ఇవ్వలేదని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం చూస్తే.. అసలు ఎస్‌ఈసీగా రమేశ్‌కుమార్‌ నియామకమే చట్టవిరుద్ధమన్నారు. అలాంటప్పుడు ఆయనను మళ్లీ అదే పోస్టులో నియమించి ప్రభుత్వం మరో తప్పు చేయాలా? అని ఏజీ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై స్పష్టత కోసమే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. ఎస్‌ఈసీ పోస్టులో తనను తాను నియమించుకుంటూ, ప్రభుత్వ అధికారులకు రమేశ్‌కుమార్‌ జారీచేసిన ఆదేశాలు చెల్లుబాటు కావని, వాటిని పాటించాల్సిన అవసరం వారికి లేదని పేర్కొన్నారు. పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌తో కలసి ఆయన శనివారం రాత్రి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. హైకోర్టు ఆదేశాల అమలుకు ప్రభుత్వానికి రెండు నెలల సమయం ఉంటుందన్నారు. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళుతున్నందున.. తీర్పుపై స్టే ఇవ్వాలని హైకోర్టులో ప్రభుత్వం తరఫున పిటిషన్‌ వేశామని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని వెల్లడించారు. ‘కోర్టు తీర్పు శుక్రవారం ఉదయం 11.30 సమయంలో వస్తే.. తాను ఎస్‌ఈసీగా పునర్నియమితుడైనట్టు అదేరోజు మధ్యాహ్నం 3.30కి అధికారులందరికీ రమేశ్‌కుమార్‌ సర్క్యులర్‌ పంపించారు. ఎస్‌ఈసీ వాహనాలను హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయానికి పంపాలని ఎన్నికల సంఘం కార్యదర్శిని ఆదేశించారు. ఎస్‌ఈసీ న్యాయవాది (స్టాండింగ్‌ కౌన్సెల్‌)గా ఉన్న ప్రభాకర్‌ను ఆదివారంలోగా రాజీనామా చేయాలని శనివారం ఉదయం ఫోన్‌లో ఆదేశించారు. సోమవారం తాను కొత్త స్టాండింగ్‌ కౌన్సెల్‌ను నియమించుకుంటానని చెప్పారు. రమేశ్‌కుమార్‌ అలాంటి ఆదేశాలివ్వడం కుదరదు’ అని శ్రీరాం పేర్కొన్నారు.

రమేశ్‌కుమార్‌ నియామకమే చెల్లదు
‘ఎస్‌ఈసీగా నియమించేవారి అర్హతలను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఎస్‌ఈసీ నియామకంపై గవర్నర్‌ తన విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకునే క్రమంలో.. ముఖ్యమంత్రి, మంత్రిమండలి సిఫారసుల మేరకు నడుచుకోకూడదని హైకోర్టు తన తీర్పులో చెప్పింది. ఒక చట్టానికి సంబంధించి కోర్టు తీర్పు చెప్పినప్పుడు అది ఆ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచీ వర్తిస్తుంది. రమేశ్‌కుమార్‌ పంచాయతీరాజ్‌ చట్టం 1994లోని సెక్షన్‌ 200 ప్రకారమే ఎస్‌ఈసీగా నియమితులయ్యారు. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి స్థాయి అధికారిని ఎస్‌ఈసీ పోస్టులో నియమించాలని ఆ సెక్షన్‌ చెబుతోంది. రమేశ్‌కుమార్‌ని ఎస్‌ఈసీగా నియమించాలని 2015 డిసెంబరు 12న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్‌కి సిఫారసు చేశారు. సెక్షన్‌ 200 చెల్లదని, ముఖ్యమంత్రి, మంత్రిమండలి సిఫారసుల మేరకు ఎస్‌ఈసీని గవర్నర్‌ నియమించకూడదని హైకోర్టు చెప్పిన తీర్పు... రమేశ్‌కుమార్‌ నియామకానికీ వర్తిస్తుంది. ఆ ప్రకారం ఆయన నియామకమూ చెల్లదు’ అని శ్రీరాం తెలిపారు.


ఇదేం దుస్సంప్రదాయం: యనమల

రాష్ట్ర చరిత్రలో హైకోర్టు తీర్పుపై న్యాయనిపుణుడు (ఏజీ) విలేకర్ల సమావేశం పెట్టడం తొలిసారి చూస్తున్నానని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ‘హైకోర్టు తీర్పు ఇచ్చాక.. దాన్ని వక్రీకరిస్తూ అటార్నీ జనరల్‌ విలేకర్ల ముందుకొచ్చిన దాఖలాలు గతంలో లేవు. ఇదో దుస్సంప్రదాయం. హైకోర్టు తీర్పుతో ఆర్డినెన్సు రద్దయిన తక్షణం ఎస్‌ఈసీగా రమేశ్‌కుమార్‌ విధుల్లోకి వచ్చినట్లు. దాన్ని వక్రీకరించడం ద్వారా ఏజీ తిమ్మిని బమ్మిని చేయాలని ప్రయత్నిస్తున్నారు. రమేశ్‌కుమార్‌ ఆదేశాలను తాము ఖాతరు చేయబోమని ఏజీ చెప్పడం కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లే. ఇలాంటి పోకడలు ప్రజాస్వామ్యానికి చేటు’ అని యనమల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే ఆ కోర్టు ఇచ్చే ఆదేశాల మేరకు రమేశ్‌కుమార్‌ వ్యవహరించాలని.. ఈలోపు అడ్వొకేట్‌ జనరల్‌కు సహనం లేకపోతే ఎలాగని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో వివాదాలు సృష్టించడం సరికాదని పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.