close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పట్టపగలే కత్తుల స్వైరవిహారం

విజయవాడలో వర్గపోరు... కత్తులు, కర్రలు, రాళ్లతో దాడి
ఒకరి మృతి
రూ.2 కోట్ల అపార్ట్‌మెంట్‌పై వివాదం

పటమట(విజయవాడ), న్యూస్‌టుడే: విజయవాడ నగరం... పటమటలోని నివాస ప్రాంతాల మధ్య... రెచ్చిపోయిన రెండు వర్గాలు... పట్టపగలే కత్తులతో స్వైర విహారం... దాదాపు 30 మంది... చేతికి అందిన కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు విచ్చలవిడి దాడులు...  కొందరికి తలలు పగిలాయి. మరికొందరికి మెడ, ముఖం, చేతులపై గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వర్గ నాయకుడు ప్రాణాలొదిలారు. ఓ అపార్ట్‌మెంట్‌ విషయమై జరిగిన సెటిల్‌మెంట్‌ ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఈ పరిణామంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

పోలీసుల కథనం ప్రకారం... తాడిగడప డొంక రోడ్డులో ఉండే సందీప్‌ ఇనుప సామగ్రి వ్యాపారి. కోడూరి మణికంఠ అలియాస్‌ కేటీఎం పండు సనత్‌నగర్‌ వాసి. వీరిద్దరు పెనమలూరు పరిధిలోని రూ.2 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ సెటిల్‌మెంట్‌లో కలుగజేసుకున్నారు. ఈ క్రమంలో గొడవలయ్యాయి.  సయోధ్య కుదుర్చుకుందామని ఇద్దరూ తమ తమ అనుచరులు, స్నేహితులతో కలిసి శుక్రవారం ఓ చోట సమావేశమయ్యాయి. అక్కడ గొడవ ముదిరింది. ఆ తర్వాత ఎవరికి వారు వెళ్లిపోయారు. ఆ తర్వాత సందీప్‌, అతని సోదరుడు బాలు కలిసి మణికంఠ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. ఈ సంగతి తెలుసుకున్న మణికంఠ కొంతమంది యువకులను వెంట బెట్టుకొని సందీప్‌ ఇనుప దుకాణం దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో దుకాణంలోఉన్న రాజేష్‌, నత్తాదాసులపై దాడి చేశారు.

స్థలం ఎంచుకుని మరీ...
సందీప్‌, మణికంఠల మధ్య గొడవ ముదరడంతో శనివారం సెల్‌ఫోన్‌లలో ఒకరినొకరు దూషించుకున్నారు. నిన్ను చంపుతానంటే నిన్ను చంపుతానని బెదిరించుకున్నారు. అనంతరం వారివురు కొట్టుకునేందుకు స్థలాన్ని ఎంచుకున్నారు. సాయంత్రం 4 గంటలకు పటమట తోటవారి వీధి, గ్రేస్‌ చర్చి సమీపంలోని ఖాళీ స్థలానికి తమ సహచరులతో కలిసి చేరుకున్నారు. సందీప్‌, మణికంఠ ఇరువురు మాట్లాడుకుంటూనే ఒక్కసారిగా ఘర్షణకు దిగారు. ఇరు వర్గాలకు చెందిన దాదాపు 30 మంది... తమ వెంట తెచ్చుకున్న కత్తులు, కర్రలు, బ్లేడ్లతో పరస్పరం దాడులకు పూనుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు. ఈ సమయంలో మణికంఠ వర్గానికి చెందిన వారు సందీప్‌ తలపై, కిరణ్‌కుమార్‌ అనే వ్యక్తి గొంతుపై బ్లేడ్‌తో దాడి చేశారు. సందీప్‌ కూడా కత్తితో చేయగా మణికంఠకు గాయాలయ్యాయి. దాదాపు అరగంట సేపు జరిగిన ఈ ఘర్షణతో ఆ ప్రాంతమంతా అరుపులు, కేకలతో నిండిపోయింది. ఈ ఘటనలో వర్గ నాయకులిద్దరితో పాటు పలువురు గాయపడ్డారు. వారిని ప్రైవేటు, ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. చికిత్స పొందుతూ సందీప్‌ ఆదివారం మరణించారు. ప్రస్తుతం మణికంఠ చికిత్స పొందుతున్నాడు. గొడవ జరుగుతుండగా ఓ వర్గానికి చెందిన వ్యక్తి ఆ దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. 

ఇరు వర్గాల వారూ ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకున్నారు. సందీప్‌ చనిపోయాడని తెలియగానే, అతని అనుచరులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి దగ్గరకు చేరుకున్నారు. గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో పోలీసులు భారీగా మోహరించారు. యువకులందరినీ అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం సందీప్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.