close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లాక్‌డౌన్‌ భయం.. సొంతూళ్లకు పయనం

హైదరాబాద్‌ నుంచి ఏపీకి జనం బారులు
కుటుంబాలతో తరలివస్తున్న ప్రజలు
ఈ-పాస్‌ లేకుంటే వెనక్కే
చెక్‌పోస్టుల వద్ద ‘ఈనాడు’ పరిశీలన

కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. దాంతో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు జనం పెద్దఎత్తున తరలివస్తున్నారు. నాలుగు రోజులుగా కుటుంబాలతో సహా వస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఉద్యోగ, వ్యాపార అవసరాల రీత్యా వస్తున్న వారూ అధికంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న కృష్ణా జిల్లా గరికపాడు, గుంటూరు జిల్లా పొందుగల, పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి, కర్నూలు జిల్లా పంచలింగాల తదితర చెక్‌పోస్టుల వద్ద ‘‘ఈనాడు’’ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేకంగా పరిశీలించింది. అన్ని పత్రాలు ఉన్న వారికి కొంత ఆలస్యమైనా అనుమతి లభిస్తుండగా... సరైన పత్రాలు లేని వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

రోనా విజృంభిస్తుండటంతో తమ రక్తసంబంధీకులతో కలిసి ఉండటానికి ప్రజలు హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలివస్తున్నారు. మార్చి నాటి లాక్‌డౌన్‌ ముందు రోజుల తరహాలో కాకున్నా వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. బస్సు మార్గాల్లోని సరిహద్దుల వద్ద సందడిగా ఉంటోంది. వారిని అనుమతించే విషయంలో పోలీసులు నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నారు. ‘‘స్పందన’’ ఈ-పాస్‌, ఆధార్‌, ఇతర గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తూ... చిరునామాలు నమోదు చేసుకుంటున్నారు. అనుమతి పత్రాలు లేని వారిని వెనక్కి పంపించేస్తున్నారు. తనిఖీ కేంద్రాల వద్ద అందరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్నారు. అనుమానిత లక్షణాలతో ఉన్నవారి నుంచి కొన్నిచోట్ల స్వాబ్‌ నమూనాలు సేకరిస్తున్నారు. అనుమతిస్తున్న వారి చేతిపై ‘‘హోమ్‌ క్వారంటైన్‌’’ ముద్ర వేస్తున్నారు. పాస్‌లు ఉన్నవారినీ ఉదయం 7గంటల నుంచి రాత్రి 7వరకే అనుమతిస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన వారందర్నీ సరిహద్దులకు అవతలే ఆపేస్తున్నారు. అలాంటి వారంతా నానా అవస్థలు పడుతున్నారు. కొందరు తాము ప్రభుత్వ క్వారంటైన్‌లో అయినా ఉంటామంటూ విన్నవిస్తుండటం గమనార్హం. మరికొందరు తమ వాహనాలను ఉదయం వరకు టోల్‌గేట్ల వద్ద నిలిపి, అక్కడే ఉంటున్నారు. తెల్లవారాక మళ్లీ వరుసగా వచ్చి పత్రాలు చూపించి లోనికి వస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో(కుటుంబ సభ్యులు, బంధువులు మృతిచెందితే వారి భౌతిక కాయాన్ని చూసేందుకు వచ్చేవారు, వైద్య చికిత్సలు తీసుకుని తిరిగి వస్తున్నవారు తదితరాలు) వస్తున్న వారిని మాత్రం సంబంధిత నిజనిర్ధారణ చేసుకుని, వివరాల నమోదు తర్వాతే అనుమతిస్తున్నారు. మున్ముందు ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చే వారంతా తప్పనిసరిగా ఈ-పాస్‌ పొందాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా వచ్చి అవస్థలు పడవద్దని పోలీసులు సూచిస్తున్నారు.


 రోజుకు వెయ్యి మంది పైనే 

చెక్‌పోస్టు: గరికపాడు (కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం)
* జూన్‌ 24 నుంచి 26 మధ్య రోజుకు సగటున 700-800 మంది ఏపీలోకి వచ్చారు. 27 నుంచి ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 29న 1,044 మంది, 30న 1,088 మంది, జులై 1న 1,130 మంది సరిహద్దు దాటారు.
* 15-20 రోజుల కిందట సగటున రోజుకు 300 వాహనాలు రాష్ట్రంలోకి వచ్చేవి. ఇప్పుడా సంఖ్య 600కు పైనే ఉంటోంది.
* ఇక్కడ రోజుకు సగటున 150 మంది కరోనా అనుమానిత లక్షణాలుంటే స్వాబ్‌ నమూనాలు తీసుకుంటున్నారు.
* చెక్‌పోస్టు వద్ద మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు.


రోజుకు నాలుగు వేల మంది

చెక్‌పోస్టు: పొందుగుల (గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం)
* 15-20 రోజుల మందు వరకు సగటున రోజుకు వెయ్యి వాహనాల్లో... 3000 మంది వరకు ప్రయాణికులు ఏపీలోకి ప్రవేశించేవారు.
* నాలుగైదు రోజులుగా సగటున రోజుకు 1,500 వాహనాల్లో 4,000 మంది వరకు వస్తున్నారు.
* అనుమానిత లక్షణాలుంటే స్వాబ్‌ నమూనాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 3వేల మందివి తీసుకున్నారు.
* ఇక్కడ తాగునీరు, మరుగుదొడ్ల వంటి అత్యవసర వసతులేమీ లేవు.


రెట్టింపైన వాహనాలు

చెక్‌పోస్టు: పంచలింగాల (కర్నూలు జిల్లా)
* వారం కిందటి వరకు తెలంగాణ నుంచి కర్నూలు వైపు రోజుకు సగటున 150 కార్లు వచ్చేవి. జూన్‌ 29 నుంచి 300 వరకు ఉంటున్నాయి.
* పాస్‌లు ఉన్నా సరే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5గంటల వరకూ ఏపీలోకి అనుమతించట్లేదు. దీంతో అర్ధరాత్రి వచ్చేవారు టోల్‌గేట్‌ వద్ద ఉదయం వరకు వేచి ఉంటున్నారు.
* స్వాబ్‌ నమూనాల సేకరణ చేపట్టడం లేదు.


సాధారణ రద్దీనే..

చెక్‌పోస్టు: జీలుగుమిల్లి (పశ్చిమగోదావరి జిల్లా)
* వారం రోజుల కిందట వరకూ రోజుకు సగటున 85 వాహనాలు వచ్చేవి. 29న 103, 30న 93, జులై 1న 82 వాహనాలు ఏపీలోకి ప్రవేశించాయి. ఇక్కడ రద్దీ అంతగా పెరగలేదు.
* థర్మల్‌ స్క్రీనింగ్‌ మాత్రమే చేస్తున్నారు. జ్వరం ఉన్నవారిని వెనక్కి పంపించేస్తున్నారు.
* స్వాబ్‌ నమూనాలు తీసుకోవడంలేదు.
* కృష్ణా జిల్లా తిరువూరు సమీపంలోని పశువుల సంత వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు మీదుగా రోజుకు సగటున 50 వాహనాలు ఏపీలోకి ప్రవేశిస్తున్నాయి. బంధుమిత్రులను పరామర్శించాలనుకునే వారు, విజయవాడలో వైద్యసేవలు పొందే వారు మాత్రమే దీని మీదుగా వస్తున్నారు. ఇక్కడ థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏమీ జరగట్లేదు. గతంతో పోలిస్తే వాహనాల రద్దీ ఏమీ పెరగలేదు.
* విస్సన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి చెక్‌పోస్టు వద్ద తెలంగాణ నుంచి రాకపోకల్ని పూర్తిగా నిలిపేశారు. ఆధార్‌కార్డు, వాహన ధృవీకరణ ఆధారంగా ఏపీలోని సరిహద్దు గ్రామాల ప్రజలకు మాత్రమే రాకపోకలకు అవకాశం కల్పిస్తున్నారు.

- ఈనాడు, అమరావతి, ఈనాడు డిజిటల్‌, కర్నూలు, న్యూస్‌టుడే యంత్రాంగం


ఇతర రాష్ట్రాల నుంచి వస్తే ఆంక్షలు యథాతథం

ఆంధ్రప్రదేశ్‌లోకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు గతంలో ఉన్న ఆంక్షలన్నీ వర్తించనున్నాయి. కేంద్ర ప్రభుత్వ అన్‌లాక్‌ 2.0 నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మార్గదర్శకాల ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు జులై 31వరకు అమల్లో ఉంటాయి. ‘‘స్పందన’’ పోర్టల్‌లో ముందస్తుగా నమోదు చేసుకుని, ఈ-పాస్‌ పొందడం తప్పనిసరి. ఆంక్షల్లో కొన్ని..
* కుటుంబసభ్యులు ఎవరైనా మరణించినా, అత్యవసర చికిత్సలు అవసరమైతే మాత్రమే ఇతర రాష్ట్రాల నుంచి ప్రయాణికులను ఏపీలోకి అనుమతిస్తారు.
* వృద్ధులు, గర్భిణులను అనుమతిస్తారు.
* విదేశాల నుంచి వచ్చే వారిని, ప్రభుత్వ ఉద్యోగులను, వైద్య రంగానికి చెందినవారిని.. విధులకు హాజరయ్యేందుకు అనుమతిస్తారు.
* కరోనా ఉద్ధృతి ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారికి సరిహద్దులోనే పరీక్షలు చేస్తారు. ఏడు రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచుతారు. ఆ తర్వాత మరోసారి పరీక్షిస్తారు. నెగిటివ్‌ వస్తే ఇంట్లో మరో వారం క్వారంటైన్‌లో ఉండాలి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.