close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
డ్రాగన్‌.. వెనక్కి తగ్గెన్‌!

ఫలించిన అజిత్‌ డోభాల్‌, చైనా విదేశాంగ మంత్రి చర్చలు
బలగాలను ఉపసంహరిస్తున్న పొరుగు దేశం
గల్వాన్‌లో నిర్మాణాల తొలగింపు
సరిహద్దుల్లో శాంతి కుసుమాలు?
దిల్లీ/ బీజింగ్‌

తీవ్ర ఉద్రిక్తతలతో యుద్ధం అంచుల వరకూ వెళ్లిన భారత్‌, చైనాలు ఎట్టకేలకు శాంతి మంత్రాన్ని జపించాయి. ఇరు దేశాల మధ్య వేడి చల్లారుతున్న సంకేతాలు తొలిసారిగా కనపడుతున్నాయి. గల్వాన్‌ లోయలో వాస్తవాధీన రేఖ వెంబడి సైనిక ఉపసంహరణను చైనా సోమవారం మొదలుపెట్టింది. సరిహద్దుల్లో తక్షణం బలగాలను వెనక్కి తీసుకొని, ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ మధ్య ఆదివారం జరిగిన టెలిఫోన్‌ చర్చల్లో అంగీకారం కుదిరిన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. రెండు నెలల ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఆదివారం అజిత్‌ డోభాల్‌, చైనా మంత్రి వాంగ్‌ యీ ఫోన్‌లో దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. సాధ్యమైనంత త్వరగా పూర్తిస్థాయిలో బలగాలను ఉపసంహరించాలని, సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చల్లార్చి, శాంతిని పునరుద్ధరించాలని ఈ సందర్భంగా ఇద్దరు నేతలు నిర్ణయించారు. తాజా పరిణామాలపై వీరు నిర్మొహమాటంగా, లోతైన చర్చలు జరిపారని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘ద్వైపాక్షిక సంబంధాలను మరింత వృద్ధి చేసుకోవడానికి భారత్‌- చైనా సరిహద్దుల్లో శాంతి అవసరమని, విభేదాలు వివాదాలు కాకుండా చూడాలని ఇరు దేశాల అగ్రనేతల మధ్య గతంలో ఏకాభిప్రాయం కుదిరింది. దీన్ని ప్రాతిపదికగా తీసుకొని నడుచుకోవాలని డోభాల్‌, వాంగ్‌లు నిర్ణయించారు. ఆ మేరకు బలగాల ఉపసంహరణను త్వరగా పూర్తి చేయాలని తీర్మానించారు. దశలవారీగా ఉద్రిక్తతలను చల్లార్చేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు’’ అని వివరించింది. వాస్తవాధీన రేఖను గౌరవించాలని, దాన్ని మార్చేందుకు ఏకపక్ష చర్యలు తీసుకోరాదని కూడా ఇద్దరు నేతలు నిర్ణయించినట్లు తెలిపింది. శాంతి పూర్తిస్థాయిలో నెలకొనేలా ఇద్దరు ప్రతినిధులు తమ చర్చలను భవిష్యత్‌లోనూ కొనసాగించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. సైనిక, దౌత్య స్థాయిలోనూ చర్చలు కొనసాగేలా చూడాలని నిర్ణయించారని తెలిపింది. క్షేత్రస్థాయిలో ‘కాలావధితో కూడిన విస్పష్ట కార్యాచరణ’ ఉండాలని చర్చల్లో డోభాల్‌ గట్టిగా స్పష్టంచేసినట్లు అధికార వర్గాలు వివరించాయి. భారత్‌-చైనా సరిహద్దు చర్చల్లో డోభాల్‌ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.

వెనక్కి మళ్లుతున్న చైనా సేన..
డోభాల్‌, వాంగ్‌ చర్చల అనంతరం తూర్పు లద్దాఖ్‌లో చైనా తన బలగాలను ఉపసంహరించడం మొదలుపెట్టింది. గల్వాన్‌ లోయలో ఆ దేశ సైన్యం ‘పెట్రోలింగ్‌ పాయింట్‌ 14’ వద్ద గుడారాలను, నిర్మాణాలను తొలగిస్తున్నట్లు అధికార వర్గాలు దిల్లీలో తెలిపాయి. అక్కడ ఒకటిన్నర కిలోమీటరు మేర డ్రాగన్‌ సేన వెనక్కి మళ్లినట్లు వివరించాయి. గల్వాన్‌లోని ఇతర ప్రాంతాలు, గోగ్రా హాట్‌ స్ప్రింగ్స్‌ వద్ద చైనా వాహనాలు తిరుగు ప్రయాణమవుతున్నాయని వివరించాయి. వివాదానికి మరో కేంద్ర బిందువైన పాంగాంగ్‌ సరస్సు ఒడ్డున ఫింగర్‌-4 వద్ద కొన్ని గుడారాలను కూడా డ్రాగన్‌ సైన్యం తొలగించినట్లు వార్తలు వచ్చాయి. క్షేత్రస్థాయిలో సరైన పరిశీలన తర్వాతే చైనా ఉపసంహరణలపై స్పష్టత వస్తుందని దిల్లీలో అధికార వర్గాలు తెలిపాయి. గత నెల 30న కమాండర్ల సమావేశంలో కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా ఈ ఉపసంహరణ జరుగుతోందని వివరించాయి. గల్వాన్‌ నది వద్ద ఇరు దేశాల సైన్యాల నడుమ కనీసం 3 కిలోమీటర్ల మేర ఒక ‘బఫర్‌ జోన్‌’ను రెండు పక్షాలూ ఏర్పాటు చేస్తాయని తెలిపాయి. అందుకు అనుగుణంగా భారత బలగాలూ కదులుతున్నాయని పేర్కొన్నాయి. ద్వైపాక్షిక అవగాహన మేరకు కొన్ని వివాదాస్పద ప్రాంతాల్లో మన దేశం సైనికులను తగ్గించుకునే అవకాశం ఉంది.

ఘర్షణ నేపథ్యం ఇదీ...
ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి చైనా.. తూర్పు లద్దాఖ్‌లో అనేక ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖను అతిక్రమిస్తోంది. మే 5న ఇరు దేశాల బలగాలు పాంగాంగ్‌ సరస్సు వద్ద తీవ్రస్థాయిలో ఘర్షణ పడ్డాయి. చైనా సైన్యం గల్వాన్‌ లోయలోని పెట్రోలింగ్‌ పాయింట్‌-14 వద్ద ఒక నిఘా శిబిరాన్ని ఏర్పాటు చేయడాన్ని భారత సైన్యం వ్యతిరేకించింది. ఈ క్రమంలో గత నెల 15న ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనాకు చెందిన 40 మంది సైనికులు కూడా హతమైనట్లు వార్తలు వచ్చాయి. అనంతరం పాంగాంగ్‌ సరస్సు, గల్వాన్‌ లోయ, గోగ్రా హాట్‌ స్ప్రింగ్‌ సహా తూర్పు లద్దాఖ్‌లోని అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చెలరేగాయి. రెండు పక్షాలూ పోటాపోటీగా బలగాలు, భారీ ఆయుధాలు, వాయుసేనను మోహరించడంతో యుద్ధవాతావరణం నెలకొంది.


ఉపసంహరణను ధ్రువీకరించిన చైనా

రిహద్దుల్లో మోహరించిన తమ బలగాల ఉపసంహరణ విషయంలో పురోగతి సాధించినట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ పేర్కొన్నారు. ‘‘భారత్‌ కూడా ఇదే రీతిలో స్పందిస్తుందని ఆశిస్తున్నాం. సైనిక, దౌత్య మార్గాల్లో కమ్యూనికేషన్లను కొనసాగిస్తూ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలను ఉమ్మడిగా చల్లార్చేందుకు దోహదపడుతుందని ఆకాంక్షిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. మరోవైపు చైనా విదేశాంగ శాఖ కూడా తాజా పరిణామంపై ఒక ప్రకటన విడుదల చేసింది. ఉద్రిక్తతలను తగ్గించే అంశంపై డోభాల్‌, వాంగ్‌ మధ్య సానుకూల ఉమ్మడి అవగాహన కుదిరిందని తెలిపింది. సైనిక కమాండర్ల మధ్య కుదిరిన అంగీకారం మేరకు చర్యలు చేపట్టి, సరిహద్దుల నుంచి సాధ్యమైనంత త్వరగా బలగాలను ఉపసంహరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.