close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మధ్యతరగతి ఆశలపై పిడుగు

రాజధాని తరలింపు నిర్ణయంతో అమరావతిలో స్థలాలు కొన్న వారిలో తీవ్ర ఆవేదన
నిండా మునిగిన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, చిరు వ్యాపారులు

ఆ దంపతులది ఒంగోలు. భర్త రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగి. భార్య కూడా ప్రభుత్వోద్యోగే. రాష్ట్ర విభజన తర్వాత ఇతర ప్రభుత్వోద్యోగుల్లానే వారూ అమరావతికి తరలి వచ్చారు. రాజధానిలో సొంత ఇల్లు కావాలనుకున్నారు. ఇద్దరూ అప్పటిదాకా దాచుకున్న రూ.10 లక్షలతో పాటు, మరో రూ.25 లక్షలు రుణం తీసుకున్నారు. రూ.20 లక్షలు, రూ.15 లక్షలు పెట్టి రెండు స్థలాలు కొనుక్కున్నారు. వాటి ధరలు పెరుగుతాయని, ఒకదానిని అమ్మేసి వచ్చిన డబ్బుతో రెండో స్థలంలో ఇల్లు కట్టుకోవాలని ఆశపడ్డారు. రూ.20 లక్షల స్థలాన్ని రూ.10 లక్షలకైనా అమ్మేసి అప్పు తీర్చేద్దామంటే కొనేవాళ్లే లేరు. రూ.15 లక్షల స్థలం విలువ ఇప్పుడు రూ.2 లక్షలూ చేయదు.

గుంటూరు జిల్లాలోని మేడికొండూరు, పేరేచర్లలో పనిచేసే నలుగురు ఉపాధ్యాయులు పీఎఫ్‌ డబ్బు, బ్యాంకు రుణం కలిపి రూ.1 కోటితో రాజధానిలోని రాయపూడి పరిధిలో రెండు చోట్ల స్థలాలు కొన్నారు. తెనాలికి చెందిన ఒక చిరు వ్యాపారి నేలపాడు సమీపంలో 90 గజాల వాణిజ్య స్థలాన్ని రూ.32 లక్షలకు కొనుగోలు చేశారు. రాజమహేంద్రవరానికి చెందిన పదవీ విరమణ చేసిన ఉద్యోగి పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. భవిష్యత్తులో తమ మనవలకు రాజధానిలో కొంత స్థలమైనా ఉండాలన్న ఉద్దేశంతో... ఆయన దాచుకున్న డబ్బు, పిల్లలు పంపిన డబ్బు తెచ్చి రూ.70 లక్షలతో స్థలం కొన్నారు. గుంటూరు సమీప గ్రామానికి చెందిన ఒక ఉపాధ్యాయిని పదవీ విరమణ చేశారు. భర్త లేరు. పీఎఫ్‌ డబ్బు, దాచుకున్న డబ్బు రూ.40 లక్షలు పెట్టి రాజధానిలో స్థలం తీసుకున్నారు. మూడు రాజధానుల నిర్ణయంతో వీరంతా తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన నలుగురు ఉపాధ్యాయులు చదరపు గజం రూ.23 వేల చొప్పున శాఖమూరు గ్రామం పరిధిలో 1,100 గజాలు కొన్నారు. ఇప్పుడు గజం రూ.5-6 వేలకూ కొనేవారూ లేరు.

ఈనాడు - అమరావతి

రాజధాని అమరావతి అభివృద్ధి వెలుగులతో తమ జీవితాలను దిద్దుకోవాలనుకున్నారు వారు...  సామాన్యులు, మధ్యతరగతి వారు వేల మంది అక్కడ స్థలాలను కొనుక్కున్నారు. కానీ మూడు రాజధానుల నిర్ణయంతో ఇప్పుడు వారి బతుకులు తలకిందులయ్యాయి. మన రాజధానిలో మనకంటూ ఒక స్థలం ఉండాలనో, ఇప్పుడు కొనుక్కుంటే భవిష్యత్తులో పిల్లల చదువులకో, అమ్మాయిల పెళ్లిళ్లకో ఉపయోగపడుతుందన్న ఆశతోనో, వృద్ధాప్యంలో భరోసానిస్తుందన్న నమ్మకంతోనో... ఉన్నదంతా ఊడ్చేసి, బంగారం కుదువపెట్టి, అప్పులు చేసినవారు ఇప్పుడు లబోదిబో మంటున్నారు. ఒక ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల్ని తర్వాతి ప్రభుత్వం కొనసాగించకపోతే ఎదురయ్యే దుష్పరిణామాల ప్రభావం వారిపై తీవ్రంగా పడింది...

ఒకరా ఇద్దరా వేలమంది... ఎదుగుతున్న నగరం కాబట్టి, దాని అభివృద్ధితో పాటు తాము కొనుక్కున్న స్థలాల విలువా పెరుగుతుందనే ఆశ...  ధరలు పెరిగాక అసలే కొనలేమన్న ఉద్దేశంతో అప్పులు చేసి మరీ రాజధాని భూమిపై పెట్టారు. భూసమీకరణ సమయంలోనే కొందరు ఎకరమో, అర ఎకరమో కొని సీఆర్‌డీఏకి ఇచ్చి బదులుగా స్థలాలు తీసుకున్నారు. రైతులకు సీఆర్‌డీఏ కేటాయించిన స్థలాల్ని మరికొందరు కొనుగోలు చేశారు. రాజధానిని ఆనుకుని ఉన్న పెదపరిమి, మద్దూరు, వడ్డమాను, హరిశ్చంద్రపురం వంటి గ్రామాల్లోనూ, ప్రతిపాదిత ఇన్నర్‌ రింగ్‌రోడ్డును ఆనుకుని ఉన్న చోట్లా భూములు కొన్నవారున్నారు. కాస్త ఆర్థిక స్తోమత, దాచుకున్న డబ్బు ఉన్నవారు సొంతంగానే 200, 300 గజాలో కొనుక్కుంటే, ఆర్థిక వెసులుబాటు లేనివారు ఐదుగురో, పదిమందో కలసి తలా కొంత వేసుకుని స్థలాలు తీసుకున్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచీ వారంతా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలపడంతో... ఉన్నదంతా ఊడ్చుకుపోయిందని, నిండా మునిగి పోయామన్న బాధ, భవిష్యత్తుపై కొండంత దిగులుతో మనోవేదన చెందుతున్నారు.
అన్ని వర్గాలవారూ...: స్థలాలు, భూములు కొన్న వారిలో అన్ని వర్గాలు, ప్రాంతాలకు చెందిన వారున్నారు. వీరిలోరాష్ట్ర సచివాలయం, ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాల ఉద్యోగులు, బ్యాంకు సిబ్బంది, ఉపాధ్యాయులు, ఐటీ, వివిధ ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారు, ప్రవాసాంధ్రులు ఎక్కువ. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు హైదరాబాద్‌ నుంచి ఇక్కడికి తరలాక... ఉద్యోగుల్లో సుమారు 60-70 శాతం మంది రాజధాని, దాని చుట్టుపక్కల ప్రాంతాలు, గొల్లపూడి, ఇబ్రహీంపట్నాల్లో స్థలాలు కొన్నట్లు ఉద్యోగ వర్గాల సమాచారం. ప్రతిఒక్కరూ కనీసం రూ.10 లక్షలైనా పెట్టుబడి పెట్టారు. ఇబ్రహీంపట్నంలో 40 మంది ఉద్యోగులు రూ.4 కోట్లు పెట్టి ఎకరం తీసుకున్నారు. దాన్ని డెవలప్‌మెంట్‌కు ఇవ్వాలనుకున్నారు. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. విదేశాల్లో స్థిరపడిన కొందరు దాచుకున్న డబ్బును  తల్లిదండ్రులకు పంపి స్థలాలు కొనిపించారు.


తక్కువకు అమ్ముదామన్నా..

* రాజధాని నిర్మాణ భూసమీకరణలో రైతులు 34 వేల ఎకరాలకుపైగా ఇచ్చారు. రైతుల నుంచి ఇతరులు కొని భూసమీకరణలో ఇచ్చిన భూమి సుమారు 7 వేల ఎకరాలని అంచనా.


* రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు సీఆర్‌డీఏ తిరిగి సుమారు 64 వేల స్థలాలు కేటాయించింది. సీఆర్‌డీఏ రైతులకు ఇచ్చిన స్థలాల్లో సుమారు 7,250 ఫ్లాట్ల విక్రయాలు జరిగినట్లు అంచనా.


* ఒక దశలో కొన్ని ప్రాంతాల్లో వాణిజ్య స్థలం విలువ గరిష్ఠంగా చదరపు గజం రూ.45 వేలు, నివాస స్థలం విలువ గరిష్ఠంగా రూ.35 వేలు  పలికింది. ఇప్పుడు వాటిని ఎంత హీనమైన ధరకు అమ్ముదామన్నా కొనేవారు లేరు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.