close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భగ్గుమన్న బెంగళూరు

ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌పై తీవ్ర ఉద్రిక్తత
ఆస్తులు, వాహనాలు ధ్వంసం
పోలీసుకాల్పుల్లో ముగ్గురి మృతి
78 మంది పోలీసులకు గాయాలు

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: కన్నడ రాజధాని నగరి బెంగళూరు మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు అగ్నిగుండాన్ని తలపించింది. ఫేస్‌బుక్‌లో ఓ మతాన్ని కించపరుస్తూ వచ్చిన పోస్టింగ్‌ నగరాన్ని నిద్ర లేకుండా చేసింది. కాడుగొండనహళ్లి, దేవరజీవనహళ్లి, కావల్‌ భైరసంద్ర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళనకారుల దాడుల్లో పోలీసుస్టేషను, సమీపంలోని నివాసాలు, వందలాది వాహనాలు ధ్వంసమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే నివాసంతో పాటు ఆయన కుటుంబసభ్యుల నివాసాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.
పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. ఆ మూడు ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి కర్ఫ్యూ విధించారు. మిగిలిన ప్రాంతాల్లో 144వ సెక్షన్‌ అమలు చేశారు. చెన్నై, హైదరాబాద్‌ నుంచి బుధవారం మధ్యాహ్నానికి ప్రత్యేక బలగాలు తరలిరావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ మొత్తం ఘటనకు బాధ్యుడిగా భావిస్తున్న ఓ వర్గం నేతతో పాటు.. ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌ పెట్టిన  ఎమ్మెల్యే బంధువైన యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి యడియూరప్ప తీవ్రంగా స్పందించారు. న్యాయవిచారణకు ఆదేశించారు.

అర్ధరాత్రి రెండు గంటలకు తీవ్రరూపం
సామాజిక మాధ్యమంలో తమ మతాన్ని కించపరిచిన ఎమ్మెల్యే బంధువైన యువకుడిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ సోషియల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌డీపీఐ)కు చెందిన కొందరు యువకులు ఫిర్యాదు చేసేందుకు మంగళవారం రాత్రి డీజే హళ్లి పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, యువకుల మధ్య వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. అర్ధరాత్రి 2గంటలకు అది తీవ్రరూపం దాల్చింది. తొలుత పదుల సంఖ్యలోనే వచ్చిన యువకులు క్రమంగా సామాజిక మాధ్యమం ద్వారా సమాచారాన్ని ఇచ్చుకోవడంతో అక్కడికి వేలాది మంది చేరుకున్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన పోలీసులపై, వారి వాహనాలపై, సమీపంలోని నివాసాలపై ఆందోళనకారులు దాడులు చేశారు. బెంగళూరు తూర్పు డీసీపీ వాహనాన్ని విడిచిపెట్టలేదు. ఎమ్మెల్యేతో పాటు ఆయన సోదరుల నివాసాలను పూర్తిగా ధ్వంసం చేశారు. వీరంతా మారణాయుధాలు, పెట్రోలు బాంబులతో దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు యువకులు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. గాయపడిన మరో యువకుడు బుధవారం ఉదయం చనిపోయాడు. ఈ సంఘటనలో 78 మంది పోలీసులకు గాయాలైనట్లు హోంమంత్రి బసవరాజ బొమ్మై వెల్లడించారు.
మెజిస్ట్రేట్‌ విచారణ
ముఖ్యమంత్రి యడియూరప్ప తన నివాసంలోనే హోం మంత్రి, నగర పోలీసు కమిషనర్‌తో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మానవహక్కుల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం ఈ సంఘటనపై జిల్లా మెజిస్ట్రేట్‌తో విచారణ జరిపించనున్నట్లు హోం మంత్రి బసవరాజ బొమ్మై వెల్లడించారు. బాధిత ఎమ్మెల్యే కుటుంబసభ్యులకు భద్రత కల్పించారు. సీఆర్‌పీఎఫ్‌, ఆర్‌ఏఎఫ్‌ బలగాలను సంఘటనా స్థలంలో కాపలాకు ఉంచారు.


తప్పుడు వార్తల ప్రచారం వద్దు: కేటీఆర్‌

సామాజిక మాధ్యమాల వినియోగదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి కేటీ రామారావు బుధవారం ట్విటర్‌లో నెటిజన్లను కోరారు. సామాజిక మాధ్యమాలను సంఘ వ్యతిరేక ప్రవర్తనలకు వేదికగా
మార్చవద్దన్నారు. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం ఎంత ప్రమాదకరమో చూడాలంటూ.. బెంగళూరులో తాజాగా జరిగిన ఘటనకు సంబంధించిన ఫొటోలను జతచేశారు.


ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.