close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇళ్ల వద్దకే కూరగాయలు

నగరాలు, పట్టణాల్లో సంచార రైతుబజార్లు
నేటి నుంచే మొదలు.. త్వరలో సరకులు సైతం
ప్రజలు గుంపులుగా చేరకుండా ముందుజాగ్రత్త
పాల కొరత లేకుండానూ అధికారుల ఏర్పాట్లు
ఈనాడు - హైదరాబాద్‌

క కూరగాయలు, నిత్యావసర సరకుల కోసం పోలీసు కట్టడిని దాటుకుంటూనో దొంగచాటుగానో రెతు బజార్లకు పరుగెత్తనవసరం లేదు.. సరకులు, కూరగాయల వంటివి ఇళ్ల వద్దకే పంపడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గురువారం నుంచే కూరగాయల సరఫరాకు కొన్ని వాహనాలను ప్రవేశపెడుతోంది. వీలు వెంబడి నిత్యావసర సరకులను కూడా పంపాలని భావిస్తోంది.

నిత్యావసర సరకుల కొనుగోలుకు గుంపులుగా వస్తున్న ప్రజలను, రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ప్రధానంగా రైతుబజార్లకు పెద్దసంఖ్యలో జనం వస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో సంచార కూరగాయల విక్రయ వాహనాలను ప్రవేశపెట్టాలని మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించింది.  అవసరాన్ని బట్టి 200 నుంచి 300 వాహనాలను ఇందుకోసం వినియోగించేందుకు కసరత్తు చేస్తోంది.  ప్రస్తుతం రైతుబజార్లలో కూరగాయలు అమ్ముతున్న రైతులు, ఇతర స్వయం సహాయక సంఘాల వారినే ఈ వాహనాలపై చుట్టుపక్కల కాలనీలకు వెళ్లి అమ్ముకోవాలని సూచిస్తారు. ఒక్కో కాలనీకి 2, 3 రోజులకు ఒకసారి ఈ వాహనాలు వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఏ కాలనీకి కూరగాయలు ఎప్పుడు వస్తాయనేది ముందుగా ప్రచారం చేస్తారు. ప్రతీ రైతుబజారుకు నిత్యం వందలాదిమంది వస్తున్నారు. అటు విక్రయదారులు కానీ, ఇటు కొనుగోలుదారులు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీనిపై రాష్ట్ర ధరల స్థిరీకరణ కమిటీ సమావేశంలోనూ చర్చించారు. రైతుబజార్లలో ‘సామాజిక దూరం’ పాటించనందున కాలనీలకు కూరగాయల విక్రయ వాహనాలు పంపాలని నిర్ణయించారు. అలాగే నిత్యావసర దుకాణాలను రోజూ పగలంతా తెరిచి ఉంచేలా చూస్తున్నారు.

కూరగాయల కొరత లేదు
జనతా కర్ఫ్యూ పెట్టినప్పటి నుంచి కూరగాయల కొరత ఏర్పడుతుందేమోనన్న అనవసర అపోహలతో ప్రజలు పెద్దసంఖ్యలో మార్కెట్లకు, రైతుబజార్లకు వచ్చి భారీగా కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యాన, మార్కెటింగ్‌ శాఖలతో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కూరగాయల లభ్యతపై కమిటీ సమీక్ష జరిపింది. ఈ సీజన్‌కు తగినంతగా కూరగాయల సరఫరాకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నట్లు ఈ శాఖలు తెలిపాయి. రాష్ట్రంలో ఏటా 30 లక్షల టన్నుల కూరగాయలు పండుతున్నాయి. కానీ రాష్ట్రానికి అవసరమైనవి 27 లక్షల టన్నులేనని ఉద్యానశాఖ ప్రభుత్వానికి తెలిపింది. కొన్ని సీజన్లలో ఉత్తరప్రదేశ్‌ నుంచి ఆలుగడ్డలు, కర్ణాటక నుంచి క్యాబేజీ, కాలీఫ్లవర్‌, ఆంధ్రప్రదేశ్‌ నుంచి టమాటాలు, మహారాష్ట్ర నుంచి ఉల్లిగడ్డలు మరికొన్ని ఉత్పత్తులు రోజూ తెలంగాణకు వస్తుంటాయి. ఒక్క హైదరాబాద్‌ నగరానికే రోజూ 20 వేల క్వింటాళ్ల కూరగాయలు వస్తున్నాయి. వీటిని మరిన్ని తెప్పించాలని మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలను తెచ్చే వాహనాలను ఆపవద్దని పోలీసుశాఖను ప్రభుత్వం ఆదేశించింది.

పాలకూ ఇబ్బంది లేదు..
* రాష్ట్ర ప్రజలు రోజూ సగటున 68 లక్షల లీటర్ల పాలను వినియోగిస్తున్నారు. కర్ఫ్యూ ఉన్నా ఈనెల 24న 69 లక్షల లీటర్ల పాలను సరఫరా చేశారు. పాల కొరత లేదని, ఎవరూ ఆందోళన చెందవద్దని అధికారులు స్పష్టంచేస్తున్నారు.
* హైదరాబాద్‌ నగరానికి రోజూ 35 లక్షల లీటర్ల పాలు అవసరం. ప్రస్తుతం 38 లక్షల లీటర్ల వరకూ వస్తున్నాయి. ప్రజలు పాల కొరత ఏర్పడుతుందేమోనన్న భయంతో ఎక్కువ మొత్తంలో పాలు కొని తీసుకెళుతున్నట్లు గుర్తించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కొరత ఉండదని, నిత్యం రాష్ట్ర అవసరాలకు సరిపోయినన్ని సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

ప్యాకెట్లలో పంపితే మేలు
రైతుబజార్లలో రద్దీ నివారణ కోసం ఇళ్ల వద్దకే వాహనాల్లో కూరగాయలు పంపడానికి చేస్తున్న ఏర్పాటు మంచిదే కానీ, రైతు బజార్లలో మాదిరిగా బుట్టల్లోనో, తొట్టెల్లోనో నింపి తెస్తే మళ్లీ వాహనాల వద్ద రద్దీ ఏర్పడడంతోపాటు పదిమంది చేతులు పెట్టి వాటిని ఎంచుకోవడం మరోరకమైన అనర్థానికి దారి తీస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో ప్రభుత్వం ‘మన కూరగాయలు’ పేరుతో కేజీ, అరకేజీ ప్యాకెట్లలో కూరగాయలను ఇళ్ల వద్దకే పంపేది. ఇప్పుడు కూడా అలా పంపిస్తే రద్దీ తగ్గడంతోపాటు వాటిమీద పదిమంది చేతులు పెట్టే అవకాశం ఉండదని కొందరు అంటున్నారు.


ధరల పెంపుపై స్పందించిన హైకోర్టు

మార్కెట్‌లలో కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నట్లు వస్తున్న వార్తలపై హైకోర్టు స్పందించింది. ఈ అంశాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యంగా సంబంధిత ధర్మాసనం ముందుంచాలన్న ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలతో హైకోర్టు రిజిస్ట్రార్‌ పిటిషన్‌గా తీసుకున్నారు. కూరగాయల ధరలతో పాటు నిత్యావసర వస్తువులు, పండ్ల ధరల నియంత్రణకు తగిన ఆదేశాలు జారీ చేయాల్సి ఉందని పేర్కొంది.


నేటి నుంచి ప్రారంభిస్తాం

సంచార కూరగాయల విక్రయ వాహనాలను గురువారం నుంచే కొన్నింటిని ప్రారంభించాలని నిర్ణయించాం. ప్రజలెవరూ గుంపులుగా రైతుబజార్లకు, ఈ వాహనాల వద్దకు రావద్దు. ప్రతీ ఒక్కరికి కూరగాయలు సరఫరా అయ్యేలా కావాల్సినన్ని సరఫరా చేస్తాం. సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తూ నిత్యావసరాలు, కూరగాయలు కొన్నప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ ఒకరికొకరు మీటరు దూరంలో నిల్చోవాలి.

-బి.జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర ధరల స్థిరీకరణ కమిటీ ఛైర్మన్‌

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు