close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments
స్పెయిన్‌లో మరణ మృదంగం

ఒక్క రోజులోనే 832 మందినికబళించిన కరోనా
ప్రపంచవ్యాప్తంగా 30వేలకు చేరువలో మృతులు

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ ఉద్ధృతికి ప్రపంచం విలవిలలాడుతోంది. ఈ మహమ్మారి బారినపడ్డవారి సంఖ్య ఆరు లక్షలు దాటిపోయింది. మరణాల సంఖ్య 30వేలకు చేరువవుతోంది. అమెరికా, ఐరోపాల్లో కొవిడ్‌-19 కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం స్పెయిన్‌లో ఈ వైరస్‌ విజృంభించింది. ఒక్కరోజులో ఇక్కడ కొత్తగా 6500కుపైగా కేసులు వెలుగు చూశాయి. 832 మంది రోగులు చనిపోయారు. 9వేల మందికిపై ఆరోగ్య సిబ్బంది ఈ మహమ్మారి బారినపడ్డారు. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ఇటలీలో శనివారం పరిస్థితి కొంచెం కుదుటపడింది. అయితే మహమ్మారి ముప్పు తగ్గుతున్నట్లు భావించరాదని అక్కడి అధికారులు చెప్పారు. అమెరికాలో 241, ఇరాన్‌లో కొత్తగా 139 మంది చనిపోయారు. కొన్ని దేశాల్లో పరీక్ష విధానాల్లో వైరుధ్యం ఉన్నందువల్ల వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఐరోపా దేశాల్లో అత్యవసర సేవలు ఇంకా చక్కబడలేదు. అనేక నగరాల్లో దిగ్బంధం కొనసాగుతోంది. పారిస్‌, రోమ్‌, మ్యాడ్రిడ్‌ వంటి నగరాల్లో జనసంచారం లేదు. అమెరికాలో కొవిడ్‌-19కు కేంద్ర బిందువుగా ఉన్న న్యూయార్క్‌ నగరంలో పెరుగుతున్న కేసులను తట్టుకోవడానికి వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ మహమ్మారి బారిన పడుతున్నవారిలో యువకులూ ఉన్నారు. వ్యక్తిగత రక్షణ ఉపకరణాలకు ఇక్కడ కొరత ఏర్పడింది.

2 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీ ప్రకటించిన అమెరికా
అమెరికాలో కట్టడి లేకుండా విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పలు గట్టి చర్యలు చేపట్టారు. వైరస్‌ను అంతమొందించే క్రతువులో వైద్య, పరిశోధక, సైనిక, హోంలాండ్‌ సెక్యూరిటీ విభాగాలను భాగస్వామ్యం చేస్తున్నట్టు చెప్పారు. తక్షణమే వెంటిలేటర్లను పెద్దఎత్తున ఉత్పత్తి చేసేందుకు జనరల్‌ ఎలక్ట్రానిక్స్‌, ఫిలిప్స్‌, మెడ్‌ట్రానిక్‌, హమిల్టన్‌, జోలె, రెడ్‌మెడ్‌ తదితర ప్రముఖ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ట్రంప్‌ పేర్కొన్నారు. ప్రజలకు సాయం అందించేందుకు, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు 2 ట్రిలియన్‌ (2 లక్షల కోట్ల) డాలర్ల చరిత్రాత్మక ఉపశమన ప్యాకేజీకి సంబంధించిన బిల్లుకు ట్రంప్‌ ఆమోద ముద్ర వేశారు. సెనేట్‌ గురువారమే దీనికి ఆమోదం తెలిపింది. దీంతో ఈ మొత్తంతో నలుగురు సభ్యులుండే ఒక్కో కుటుంబానికి 3,400 డాలర్ల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. చిన్న, మధ్యస్థాయి వ్యాపారాలకు, బోయింగ్‌ వంటి కార్పొరేట్‌ సంస్థలకు బిలియన్‌ డాలర్ల సాయం అందజేస్తారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.