close

ప్రధానాంశాలు

మనకు తీవ్రత తక్కువే

ఇటలీ, అమెరికాల పరిస్థితి ఇక్కడ రాకపోవచ్చు
మరో మూడు వారాల పాటు భౌతిక దూరం అవసరమే
కరోనా జన్యువులో సానుకూల మార్పు
వైరస్‌ కొమ్ములు అంతర్గత కణాలకు అంటుకోవడం లేదు
సెల్‌ఫోన్‌పై 72 గంటల వరకూ వైరస్‌ జీవిస్తుంది
డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డితో ‘ఈనాడు’ ముఖాముఖి
ఈనాడు - హైదరాబాద్‌

పాశ్చాత్య దేశాలతో పోల్చితే కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19) తీవ్రత భారత్‌తో తక్కువగా ఉండే అవకాశాలున్నాయని ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణులు, ఏసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. కరోనా వైరస్‌ జన్యు పరిణామ క్రమంలో చోటు చేసుకున్న మార్పులు మన దేశానికి ఊరటనిచ్చేవేనని, వైరస్‌ కొమ్ములు బాధితుల శరీరంలోని అంతర్గత కణాలకు అంటుకోవడం లేదని తాజా పరిశోధనల్లో తేలినట్లు ఆయన వివరించారు. ఈ వైరస్‌ గాలి ద్వారా వ్యాపించదని స్పష్టం చేశారు. కరోనాపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు, వాటి ఫలితాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భవిష్యత్తు కార్యాచరణ.. తదితర అంశాలపై డాక్టర్‌ నాగేశ్వరరెడ్డితో ‘ఈనాడు’ ముఖాముఖి.

కరోనాపై ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి?
చైనా, అమెరికాల్లో అతి పెద్ద ప్రయోగాలు జరుగుతున్నాయి. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, అజిత్రోమైసిన్‌ ఔషధాలను కలిపి చికిత్సకు వాడుతున్నారు. వేల మందిలో వీటిని ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. ఇప్పటికే ఒక ఫ్రెంచ్‌ అధ్యయనంలో తగ్గినట్లు తేలింది. కానీ  అది కేవలం 20 మందిలోనే జరిపారు. కనీసం 10 వేల మంది రోగులపై ప్రయోగిస్తేనే అసలైన ఫలితం తెలుస్తుంది. జపాన్‌కు చెందిన ఒక యాంటీ వైరల్‌ ఔషధం ‘ఆవీగాన్‌’పై చైనాలో పెద్ద అధ్యయనం జరుగుతోంది. వీటన్నిటి ఫలితాలు మరో రెండు నెలల్లో వచ్చేస్తాయి.

పాశ్చాత్య దేశాల్లో కనిపించే తీవ్రత మన దేశంలోనూ అదే స్థాయిలో ఉంటుందా..?
ఇటలీ, అమెరికా, చైనా, భారత్‌లలో కరోనా వైరస్‌ జన్యువు పరిణామ క్రమంపై అధ్యయనాలు చేశారు. ఇందులో భారత్‌, చైనా, అమెరికాలో ఉన్న వైరస్‌ జన్యువులు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఇటలీలో మాత్రం జన్యు పరిణామ క్రమంలో మూడు విధాలుగా మార్పు కనిపించింది. దీని వల్ల అక్కడ ప్రమాద తీవ్రత పెరిగింది. మన దేశంలో కరోనా వైరస్‌ పరిణామ క్రమంలో సానుకూల మార్పు కనిపించింది. దిల్లీలోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్‌ సైన్స్‌’ శాస్త్రవేత్తలు మన దేశంలోని వైరస్‌ జీనోమ్‌ మొత్తాన్ని అధ్యయనం చేశారు. ఈ వైరస్‌లోని ‘స్పైక్‌ ప్రొటీన్‌’ (కొమ్ముల్లాంటి భాగం)లో అసాధారణ పరిణామక్రమం జరగడం వల్ల అది మన భారతీయుల శరీర అంతర్భాగంలో సరిగ్గా అతుక్కోవడం లేదు. ఈ పరిశోధన పత్రాన్ని ‘భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)కి కూడా పంపించారు. మన భారతీయుల శరీరాల్లో రోగ నిరోధకత ఎక్కువే. ఇక్కడి వాతావరణ పరిస్థితులు కూడా వైరస్‌కు ప్రతికూలం. నా అంచనా ప్రకారం.. ఇటలీ, అమెరికా మాదిరి పరిస్థితులు ఇక్కడ రావు. పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాప్తి కట్టడి చర్యలు కూడా భేషుగ్గా చేస్తున్నాయి.

ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఇతర దేశాల్లో మరణాలను పరిగణనలోకి తీసుకుని, మనం పూర్తి అచేతనావస్థలోకి వెళ్లిపోకూడదు. భారత్‌లో ఈ వైరస్‌ వల్ల మరణాలు రెండు శాతం మాత్రమే. ఇది కూడా ఒక అంచనానే. నా లెక్క ప్రకారమైతే కేవలం 0.9 శాతమే ఉండొచ్చు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ సాధారణ జీవితం గడపవచ్చు. చేతులు ఎప్పుడూ శుభ్రపర్చుకోవాలి. రెండు మూడు వారాల పాటు భౌతిక దూరం, విడి గదుల్లో ఉండడం చాలా ముఖ్యం. ‘సామాజిక దూరం’ అనే పదం సరికాదు. దీన్ని ‘భౌతిక దూరం’ అనాలి. మున్ముందు కూడా భౌతిక దూరాన్ని కొనసాగిస్తే చాలు. దీనివల్ల సామాజిక వ్యాప్తిని అడ్డుకోవచ్చు.

భవిష్యత్తులో సమస్యను ఎదుర్కోవడానికి ఎలాంటి ప్రణాళికలుండాలి?
ఇది మనకొక పాఠం. అమెరికా, యూకే, ఇటలీ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనూ పూర్తిస్థాయి సన్నద్ధత లేదు. మన దేశంలో కొంచెం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లడం ముఖ్యం. ఇటువంటి ఉపద్రవ పరిస్థితుల్లో రంగంలోకి దిగేందుకు ప్రతి రాష్ట్రంలోనూ ‘ఎపిడెమియాలజిస్ట్‌’లను తయారు చేయాలి. అంటువ్యాధులు ప్రబలినప్పుడు చికిత్స అందించేందుకు... ప్రతి రాష్ట్రంలోనూ 200 పడకలతో కూడిన అత్యాధునిక చికిత్స కేంద్రాన్ని నెలకొల్పాలి. అలా కాకుండా మన దగ్గర 1000-2000 పడకల ఆసుపత్రిని నిర్మించి, 500-1000 వెంటిలేటర్లను పెట్టి వాడకుండా వదిలేయడమనేది ఆచరణ సాధ్యం కాదు. అంతర్జాతీయ ప్రయాణికులందరికీ తప్పకుండా పరీక్షలు నిర్వహించాలి. కరోనా వైరస్‌ ఉందా... లేదా అని కేవలం 15 నిమిషాల్లోనే నిర్ధరించే కిట్‌ రాబోతోంది. దీని ద్వారా పరీక్ష చేయడానికి సుమారు రూ.1000 వరకూ ఖర్చవుతుంది. ఆ ఖర్చును ప్రయాణికుడు టికెట్‌ కొనుక్కునేటప్పుడే తప్పనిసరి ఛార్జీ చేయాలి. దీంతో ప్రతి ప్రయాణికుడిని పరీక్షించడానికి వీలవుతుంది. ఒకవేళ పరీక్షల్లో వైరస్‌ ఉన్నట్లు తేలితే, ఆసుపత్రికి తరలించి విడి గదుల్లో చికిత్స అందించవచ్చు. దీని ద్వారా అంతర్జాతీయంగా వైరస్‌ వ్యాప్తిని నిరోధించవచ్చు. ఇదంతా కూడా టీకా వచ్చే వరకే. అది అందుబాటులోకి వస్తే వైరస్‌ వ్యాప్తి తగ్గుతుంది.

వేసవిలో ఈ వైరస్‌ తీవ్రత తగ్గు తుందన్న అభిప్రాయాలున్నాయి. ఎలా ఉండబోతోంది?
దీనిపై ఇటీవలే అమెరికాలోని ‘మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి ఒక వైద్యపరిశోధన పత్రం విడుదలైంది. దాని ప్రకారం.. ఈ వైరస్‌ 32 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే తగ్గే అవకాశం కనిపిస్తోంది. అయితే 100 శాతం తగ్గుతుందని చెప్పలేం. ఒకవేళ ఎండాకాలంలో కొంత తగ్గినా.. వాతావరణ మార్పులతో పాటు వచ్చేస్తుంటుంది. చలికాలం వచ్చేసరికి మళ్లీ వైరస్‌ జాడలు కనిపించే అవకాశాలున్నాయి. అందుకే కేసుల సంఖ్య తగ్గినా సరే, జాగ్రత్తలు కొనసాగించాలి. వచ్చే ఏడాది చలికాలానికి టీకా వస్తుంది. అప్పటి వరకూ అప్రమత్తత అవసరం.

గాలి ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందా?
ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందదు. ప్లాస్టిక్‌, స్టీల్‌, సెల్‌ఫోన్‌పై 48 నుంచి 72 గంటల సేపు ఉంటుంది. అందువల్ల మొబైల్‌ను ఎప్పటికప్పుడు శానిటైజర్‌తో శుభ్రపర్చుకోవాలి. ఒకరి మొబైల్‌ను మరొకరు వాడకపోవడం మంచిది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.