close

ప్రధానాంశాలు

ఒకే రోజు 15 కేసులు

అందరూ దిల్లీ వెళ్లి వచ్చిన వారూ, వారి కుటుంబ సభ్యులే
97కు పెరిగిన బాధితులు
జమాత్‌ సందర్శకులు 10 వేల మందిని కలిసి ఉంటారని అంచనా

ఈనాడు- హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. మంగళవారం 15 కొత్త కేసులు నమోదయ్యాయి. మార్చి 27న అత్యధికంగా 14 కేసులు నమోదుకాగా.. ఇప్పుడు ఆ సంఖ్య దాటిపోయింది. తాజా బాధితులందరూ ఇటీవల దిల్లీలో మత కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులేనని వైద్యవర్గాలు తెలిపాయి. మొత్తంగా రాష్ట్రంలో ఈ వైరస్‌ సోకిన బాధితుల సంఖ్య 97కు పెరిగింది. వీరిలో 14 మంది కోలుకోగా.. ఆరుగురు మృతిచెందారు. ప్రస్తుతం వేర్వేరు ఆసుపత్రుల్లో 77 మంది చికిత్స పొందుతున్నారు. దిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారందరూ గాంధీ ఆసుపత్రిలో పరీక్షలకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు.

అనుమానితుల జల్లెడ
దిల్లీలో మతపరమైన కార్యక్రమానికి రాష్ట్రం నుంచి 1030 మంది వెళ్లి వచ్చారని ప్రభుత్వం గుర్తించింది. వీరిలో ఇప్పటివరకూ 35 మందిలో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మిగిలినవారిలో ఎందరిలో కరోనా లక్షణాలున్నాయి, వీరు ఎంతమందిని కలిశారనేది ప్రాధాన్యాంశాలుగా మారాయి. కరోనా సోకిన వారిలో నాగర్‌కర్నూలులో ఓ బట్టల వ్యాపారి, ఓ మటన్‌ వ్యాపారి ఉన్నారు. వీరు వందల మందిని కలిసి ఉంటారని అంచనా వేస్తున్నారు. తక్కువలో తక్కువగా వేసుకున్నా.. ఈ వెయ్యిమంది ఒక్కొక్కరూ కనీసం 10 మందినైనా కలిసి ఉంటారని వైద్యవర్గాలు భావిస్తున్నాయి. అంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కలిపి 10 వేల మందికిపైగా వీరితోకలిసి ఉంటారని అంచనా.

శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లపై దృష్టి
రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ఉన్నట్టుండి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు పెరిగాయా? అనే కోణంలోనూ వైద్యఆరోగ్యశాఖ దృష్టిసారించి సమాచారం సేకరిస్తోంది. ఇప్పటివరకూ తీవ్ర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతున్న కేసులు 400 వరకూ నమోదుకాగా, హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో 120 కేసులొచ్చినట్లు గుర్తించారు. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ.. ఆయా రోగుల సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమైంది.

వైద్యుల రక్షణపై మంత్రి హామీ
నిలోఫర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికలో కరోనా ఉన్నట్లుగా నిర్ధారణ కావడంతో.. ఆ బాలికకు ఇప్పటివరకూ చికిత్స అందించిన వైద్యులు, నర్సులు 20 మందిని విడి గదుల్లో పరిశీలనలో ఉంచారు. ఈ పరిస్థితిలో తమకు ఎన్‌ 95 మాస్కులు, చేతి తొడుగులు, వ్యక్తిగత రక్షణ కవచాలు అందించాలని నిలోఫర్‌ వైద్యసిబ్బంది ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై మంత్రి ఇటల హామీతో మంగళవారమే వారికి అవసరమైన మాస్కులు, కిట్లు అందజేశారని జూడాల అధ్యక్షుడు డాక్టర్‌ కె.యు.ఎన్‌.విష్ణు చెప్పారు.

రోగులను పోలీసులు అడ్డుకోవద్దు
డయాలసిస్‌, తలసీమియా, సికెల్‌సెల్‌ అనీమియా వంటి జబ్బులున్న వారికి రక్తమార్పిడి అవసరమవుతుందని... వారు ఆసుపత్రులకు వెళ్లేందుకు ప్రయాణాలకు వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఈటల తెలిపారు. పోలీసులు ఈ రోగులను అడ్డుకోవద్దని స్పష్టం చేశారు. గర్భిణులు ఇబ్బందులు పడకుండా మాతాశిశు సంరక్షణ కేంద్రాలు పనిచేస్తాయన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.