close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments
ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాం

స్వీయ జాగ్రత్తలతోనే  కరోనా నుంచి రక్షణ
అంతకు మించి చేసేది లేదు
సామూహిక నిర్ధారణ పరీక్షలు చేయడం శ్రేయస్కరం
బుధవారం ఒక్కరోజే 200 నమూనాలు వచ్చాయి
భవిష్యత్తులో కేసులు పెరిగే సూచనలున్నాయ్‌
‘ఈనాడు’తో సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా
ఈనాడు, హైదరాబాద్‌

కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రస్తుతం రెండో దశలో ఉన్నప్పటికీ, రెండు రోజులుగా కేసుల సంఖ్య పెరిగిన తీరును చూస్తే మూడో దశలోకి అడుగుపెట్టినట్టే భావించాల్సి వస్తుందని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా అన్నారు. పలుచోట్ల వ్యక్తుల నుంచి వ్యక్తులకు వైరస్‌ వ్యాప్తి చెందిన ఉదంతాలు బయటపడుతున్నాయని, ఇది ఆందోళన కల్గించే అంశమని తెలిపారు. సామూహికంగా పరీక్షలు నిర్వహిస్తే తప్ప వాస్తవ పరిస్థితి ఏమిటో తెలియదని అభిప్రాయపడ్డారు. రాబోయే నాలుగైదు రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. సీసీఎంబీలో మూడు రోజుల్లో 300 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన అనుభవాల దృష్ట్యా తాజా పరిస్థితులపై ఆయనతో ‘ఈనాడు’ మాట్లాడారు.

కరోనా మ్యాపింగ్‌ చేస్తున్నాం
తెలంగాణలోని 33 జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి బుధవారం ఒక్కరోజే సీసీఎంబీకి 200 నమూనాలు వచ్చాయి. వచ్చిన వాటిని వచ్చినట్లే అదేరోజు పరీక్షించి ఫలితాలను ప్రభుత్వానికి పంపిస్తున్నాం. ఆరు దశల్లో జరిగే పరీక్షలకు దాదాపు ఆరేడు గంటల సమయం పడుతుంది. మున్ముందు మరిన్ని ఎక్కువ నమూనాలు పరీక్షలకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అందుకు అనుగుణంగా వాలంటీర్లను సిద్ధం చేశాం. ఇప్పటివరకు వచ్చిన నమూనాల ఆధారంగా వైరస్‌ వ్యాప్తిపై మ్యాపింగ్‌ జరుగుతోంది. ఇది ప్రభుత్వం అప్రమత్తమై నిరోధక చర్యలు చేపట్టేందుకు దోహదం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అభ్యర్థిస్తే నిర్ధారణ పరీక్షలకు సహకరిస్తాం.

తక్కువ కేంద్రాల వల్లనే.. తక్కువ కేసులు
ప్రస్తుతం దేశంలో నిర్ధారణ పరీక్ష కేంద్రాలు తక్కువగా ఉండటంతో కేసుల సంఖ్య తక్కువగా కన్పిస్తోంది. వేర్వేరు సంస్థలు తక్కువ ధరలో పరీక్ష కిట్లను అభివృద్ధి చేస్తున్నాయి. ఇవి ఐసీఎంఆర్‌ ఆమోదం పొంది విపణిలోకి వస్తే ఎక్కువ నమూనాలు పరీక్షించేందుకు ఆస్కారం ఉంటుంది. అప్పుడు వాస్తవ పరిస్థితి తెలిసే అవకాశం ఉంటుంది.

ఎక్కువ నమూనాలు పరీక్షిస్తే మేలు
దేశంలో వైరస్‌ వ్యాప్తి తీవ్రత ఏ మేరకు ఉందో తెలుసుకోవాలంటే ఒకేసారి ఎక్కువ మందికి(సామూహిక) నిర్ధారణ పరీక్షలు చేయడం మంచిది. ప్రస్తుతం ఒక్కొక్కరి నుంచి కఫం, రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. సమూహ పరీక్షల్లో వంద మంది నమూనాలను సేకరించి, అన్నింటిని కలిపి పరీక్షిస్తాం. వైరస్‌ పాజిటివ్‌ వస్తే, అప్పుడు అందులోని ప్రతి ఒక్కర్నీ వేర్వేరుగా పరీక్షిస్తాం. పాజిటివ్‌ రాకపోతే ఎవరికీ వైరస్‌ లేదని భావించవచ్చు. సీసీఎంబీలో ఇలా పరీక్షించే సాంకేతికత ఉంది.

జన్యుక్రమ నిర్మాణం తెలుసుకోవడమే శరణ్యం
సీసీఎంబీలో కరోనా వైరస్‌ జన్యుక్రమ నిర్మాణం తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఇక్కడి వైరస్‌ చైనా, ఇటలీ, అమెరికా దేశాల్లో ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాంతాలు మారే కొద్ది జన్యు క్రమంలో ఏమైనా మార్పులు వచ్చాయా? ఈ మార్పులు ఎంతవేగంగా జరిగాయి? అనేది తెలుసుకునేందుకు జన్యుక్రమ పరిణామం (జీనోమ్‌ సీక్వెన్సింగ్‌) దోహదం చేస్తుంది. నాలుగైదు రోజుల్లో మొదటి సెట్‌ను విశ్లేషిస్తాం. వైరస్‌ మ్యుటేషన్లలో మార్పులు తెలిస్తే ఆ ఫలితాలు వాక్సిన్‌, ఔషధం తయారీకి దోహదం చేస్తాయి. ఎప్పటికప్పుడు జన్యుక్రమం మారుతుంటే ఔషధం కనుక్కోవడం క్లిష్టంగా మారుతుంది.

ఇది కీలక సమయం.. జాగ్రత్తగా ఉండాలి
ఎక్కువ కేంద్రాల్లో నిర్ధారణ పరీక్షలకు ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది. రాబోయే నాలుగైదు రోజుల్లో ఎక్కువ కేసులు బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాం. ఇది అందరికీ కీలక సమయం. సామాజిక దూరం పాటించడంతోపాటు, వ్యక్తిగత పరిశుభ్రతా ముఖ్యమే. ఆసుపత్రిలో వెయ్యి పడకలు ఉంటే,  పదివేల మంది వైరస్‌ బారిన పడితే చికిత్స చేయడం కష్టమవుతుంది కదా.

అప్పుడే రోగ నిరోధక శక్తి వృద్ధి చెందదు
ఇది పూర్తిగా కొత్త వైరస్‌. అందుకే ఇంకా మనలో దాన్ని ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెందలేదు. కొన్ని నెలల పాటు వైరస్‌ బారిన పడకుండా కాపాడుకుంటే, అప్పటికి మన శరీరం ఈ వైరస్‌తో పోరాడే సహజ సిద్ధ శక్తిని సమకూర్చుకుంటుంది. 90 శాతం కేసుల్లో ఆసుపత్రికి వెళ్లకుండా వ్యాధి తగ్గిపోతుంది. ఇప్పటికిప్పుడు ఆ పరిస్థితి లేదు. శాస్త్రీయమైన చికిత్స, వాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేవరకు మనల్ని మనం కాపాడుకోవాలి. వ్యక్తుల నుంచి వ్యక్తులకు వైరస్‌ వ్యాప్తి చెందుతుంది కాబట్టి, దానికి ఉష్ణోగ్రతలతో సంబంధం ఉండదు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.