close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments
జిల్లాల్లో వైరస్‌ వణుకు

కొత్తగా మరో 27 కరోనా కేసులు
154కు పెరిగిన బాధితులు
తాజాగా ఇళ్లకెళ్లిన ముగ్గురు
ఆసుపత్రుల్లో 128 మంది
1,061 మందికి పరీక్షలు
నేడు ఫలితాల వెల్లడి
చాలామందికి పాజిటివ్‌ రావచ్చనే అనుమానాలు

ఈనాడు- హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. గురువారం ఒక్కరోజే 27 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 154కు పెరిగింది. ప్రస్తుతం 128 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. తాజాగా మరో ముగ్గురు కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో మొత్తంగా కరోనా నుంచి కోలుకున్న వారు 17 మంది అయ్యారు. ఇప్పటి వరకూ ఈ మహమ్మారి కారణంగా రాష్ట్రంలో 9 మంది మృతి చెందారు. దిల్లీ నుంచి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులను కలుపుకొని బుధ, గురువారాల్లో 1,061 మంది నమూనాలు సేకరించి, పరీక్షలకు పంపించారు. కరోనా పరీక్షలు మొదలుపెట్టిన తర్వాత ఇంత భారీ సంఖ్యలో నమూనాలు సేకరించడం ఇదే తొలిసారి. వీటిని పరీక్షించడానికి రాష్ట్రంలో అనుమతించిన అన్ని ప్రయోగశాలలతో పాటు సీసీఎంబీకి కూడా పంపించారు. శుక్రవారం వీటి ఫలితాలు వెల్లడవనున్నాయి. పెద్దసంఖ్యలోనే పాజిటివ్‌ కేసులు రావచ్చని వైద్యవర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ బాధితుల సంఖ్య పెరిగితే.. అందుకు తగ్గట్టుగా చికిత్సకు ఏర్పాట్లు చేయాలని వైద్యమంత్రి ఈటల రాజేందర్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోడానికి అన్ని రకాలుగా కృషిచేస్తున్నామనీ, దిల్లీ మర్కజ్‌ నుంచి వచ్చిన ప్రయాణికులు ఇంకా ఎవరైనా ఉంటే.. 104కు ఫోన్‌ చేయాలనీ, సమీపంలోని ఆసుపత్రిలో చేరాలనీ సూచించారు. ఈనెల 14 వరకూ ప్రభుత్వ ఆదేశాలను అందరూ పాటించాలనీ, ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావొద్దనీ, ప్రభుత్వ చర్యలకు సహకరించాలని మంత్రి కోరారు.

దిల్లీ ప్రకంపనలు
ఇటీవల దిల్లీకి వెళ్లి వచ్చిన వారి నుంచి సేకరించిన నమూనాల్లో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌ సహా దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ బుధ, గురువారాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. దిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుల్లో గత రెండు రోజుల్లో ఏడుగురికి కరోనా సోకినట్లుగా నిర్ధారించారు.

సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌
ఈ జిల్లాలో తాజాగా ఆరుగురికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. సంగారెడ్డి నుంచి 28 మంది దిల్లీకి వెళ్లగా, వారి నమూనాలను పరీక్షలకు పంపించారు. పాజిటివ్‌ వచ్చిన ఆరుగురి కుటుంబ సభ్యులు 43 మందిని పటాన్‌చెరులో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రానికి పంపారు. 20 మందికి నెగిటివ్‌ రాగా, మరో రెండు పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది.
* సిద్దిపేట జిల్లా నుంచి ఏడుగురు వెళ్లగా, ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. మిగిలిన ఆరుగురిని గజ్వేల్‌లోని ఐసోలేషన్‌ కేంద్రంలో ఉంచారు.
* మెదక్‌ జిల్లా నుంచి 11 మంది వెళ్లగా, ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. ఇతనితో కలిసిన 16 మందితోపాటు నెగిటివ్‌ వచ్చిన పదిమందిని ఏడుపాయలలోని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు.

నల్గొండ, సూర్యాపేట, భువనగిరి
నల్గొండ నుంచి 45 మంది దిల్లీకి వెళ్లి రాగా ఆరుగురికి పాజిటివ్‌, 39 మందికి నెగిటివ్‌ వచ్చాయి. వీరితో కలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు 39 మందిని నల్గొండలోని క్వారంటైన్‌లో ఉంచారు.
* సూర్యాపేట జిల్లాలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది.
* యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటి వరకు ఎవరికీ పాజిటివ్‌ రాలేదు.

బాధితుల్లో ఉపాధ్యాయుడు
కరోనా బాధితుల్లో ఒక ఉపాధ్యాయుడు కూడా ఉన్నట్లు తెలిసింది. ఆయన నార్కట్‌పల్లి పరిధిలో పనిచేస్తున్నారు. ఆయన దిల్లీ నుంచి వచ్చిన తర్వాత  ఎవరెవరిని కలిశారనే దానిపై పోలీసులు దృష్టి సారించారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా
* మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దిల్లీ మర్కజ్‌కు వెళ్లిన 35 మందితోపాటు స్థానికంగా కరోనా లక్షణాలున్న వారిని కలిపి మొత్తం 65 మంది నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. ఇద్దరికి పాజిటివ్‌వచ్చింది. ఒకరు ఉత్తరాఖండ్‌కు చెందిన వ్యక్తి అనీ, మర్కజ్‌లో పాల్గొని వచ్చారని సమాచారం. మరికొన్ని నమూనాల వివరాలు అందాల్సి ఉంది.
* గద్వాల జిల్లా నుంచి 47 మంది వెళ్లగా, వడ్డేపల్లికి చెందిన ఒకరు మరణించారు. ఈయన కుటుంబ సభ్యులిద్దరికీ పాజిటివ్‌ వచ్చి చికిత్స పొందుతున్నారు. మరణించిన వ్యక్తితోనూ, అతడి కుటుంబ సభ్యులతోనూ కలిసిన 32 మందిని క్వారంటైన్‌లో ఉంచి పరిశీలిస్తున్నారు. మర్కజ్‌కు వెళ్లిన వారిని ఐసోలేషన్‌లో ఉంచారు. పరీక్షలు ఇంకా పూర్తి కాలేదని తెలిసింది.
* నాగర్‌కర్నూలు జిల్లా నుంచి 11 మంది వెళ్లగా, ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. వీరిని కూడా పరిశీలనలో పెట్టారు.
* వనపర్తి జిల్లా నుంచి పది మంది వెళ్లగా, ఒకరు ఆస్తమాతో బాధపడుతుండటంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని స్థానికంగానే ఐసొలేషన్‌ వార్డులో ఉంచారు.
* నారాయణపేట నుంచి వెళ్లిన ఇద్దరినీ మహబూబ్నగర్‌ ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు.

ములుగు, జనగామ
* ములుగు జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఏటూరు నాగారం మండలకేంద్రానికి చెందిన వ్యక్తి(40), పస్రాకు చెందిన మరో వ్యక్తి(40)కి వైరస్‌ సోకింది. వీరికి ఎలాంటి లక్షణాలు కనిపించలేదని, అయితే తప్పనిసరిగా పరీక్ష చేయించడంతో పాజిటివ్‌ వచ్చిందని అధికారులు చెప్పారు. వారి సంబంధీకులు 26 మందికి ఎలాంటి లక్షణాలు లేవు. కుటుంబ సభ్యులందరూ సాధారణంగానే ఉన్నా క్వారంటైన్‌కు తరలించారు.
* జనగామ జిల్లా నర్మెట్ట మండలంలో ఒక మటన్‌ వ్యాపారికి వైరస్‌ సోకింది. ఇతనూ దిల్లీకి వెళ్లి వచ్చారు.
* మహబూబాబాద్‌ జిల్లాలోనూ ఒకరి(43)కి వైరస్‌ సోకినట్లు తెలిసింది.
* వరంగల్‌ అర్బన్‌ జిల్లా నుంచి 21 మంది నమూనాలు పంపించగా, వీరిలో అత్యధికుల్లో పాజిటివ్‌ వచ్చే అవకాశాలున్నాయని జిల్లా అధికార వర్గాలు చెబుతున్నాయి.

హుజూరాబాద్‌లో ఇద్దరికి
* కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిసింది. వీరిద్దరూ దిల్లీకి వెళ్లి వచ్చారు. వారి కుటుంబ సభ్యులను కరీంనగర్‌లోని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు.

సాయంగా వెళ్లిన వ్యక్తికి
* కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన ఒకరికి, మర్కజ్‌ వెళ్లి తిరిగి వచ్చిన మరో వ్యక్తికీ పాజిటివ్‌ వచ్చినట్లు తెలిసింది. మర్కజ్‌ నుంచి వచ్చిన తర్వాత మరణించిన వ్యక్తికి పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా తేలింది. ఈ వ్యక్తి అంతకుముందు రెండురోజుల పాటు బాన్సువాడలో ఉన్నాడు. అతడిని నిజామాబాద్‌కు కారులో తీసుకెళ్లిన వ్యక్తికి ప్రస్తుతం పాజిటివ్‌ వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే బాన్సువాడకు చెందిన ఇద్దరికి పాజిటివ్‌ రాగా, వారి కుటుంబ సభ్యులు, కలిసిన తిరిగిన 17 మంది నమూనాలు సేకరించి పరీక్షకు పంపినట్లు సమాచారం.

నిర్మల్‌లో ఒకరికి
నిర్మల్‌ నుంచి దిల్లీకి 52 మంది వెళ్లగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరు అనుమానిత లక్షణాలతో గాంధీలో చికిత్స పొందుతున్నారు.
* ఆసిఫాబాద్‌ నుంచి ముగ్గురు, మంచిర్యాల నుంచి ఇద్దరు దిల్లీకి వెళ్లగా వారిని క్వారంటైన్‌లో ఉంచారు.
* ఆదిలాబాద్‌ జిల్లా నుంచి 67 మంది దిల్లీకి వెళ్లగా, వీరిలో ఆరుగురిని ఐసోలేషన్‌లో ఉంచారు. 61 మందిని క్వారంటైన్‌లో ఉంచారు.


ఐసోలేషన్‌ కేంద్రానికి తరలిస్తుండగా అడ్డగింత

సూర్యాపేట జిల్లాలో ఘటన

చింతలపాలెం, న్యూస్‌టుడే: కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఒక వ్యక్తిని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలిస్తుండగా అడ్డుకున్న ఘటన గురువారం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామంలో చోటుచేసుకుంది. వైద్యాధికారి ప్రేమ్‌సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొన్నిరోజులుగా ఖమ్మంలో నివాసం ఉంటున్నారు. ఇటీవల దిల్ల్లీ నుంచి అక్కడికి వచ్చిన వారిని ఆయన కలిశాడనే అనుమానంతో.. హోం క్వారంటైన్‌ ముద్ర వేసి స్వీయ గృహనిర్బంధంలో ఉండాల్సిందిగా స్థానిక అధికారులు సూచించారు.
గురువారం సూర్యాపేటలోని ఐసోలేషన్‌ కేంద్రానికి అంబులెన్సులో తీసుకెళ్లాలని అధికారులు నిర్ణయించారు. కొందరు మతపెద్దలు, స్థానికులు అంబులెన్సును అడ్డగించారు. తహసీల్దారు కమలాకర్‌, ఎస్సై నవీన్‌ కుమార్‌ వారికి నచ్చజెప్పి చివరకు ఆయన్ను ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు.


ఏపీలో 149 కేసులు
మూడురోజుల్లో కొత్తగా 106 మందికి
రాష్ట్రంలో కరోనాతో తొలి మరణం

ఈనాడు, అమరావతి: ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 38 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 149కి చేరింది. తొలి మరణం గురువారం నమోదైంది. సోమవారం రాత్రి 10 గంటల వరకు 43 కేసులే నమోదవగా, ఆ తర్వాత మూడు రోజుల్లో అదనంగా 106 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 24 కేసులు, తర్వాత కృష్ణాలో 23, గుంటూరు జిల్లాలో 20 కేసులు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసూ నమోదు కాలేదు.


కర్ణాటకలో 123కి చేరిన కేసులు

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: కర్ణాటకలో గురువారం 13 మంది కరోనా బారినపడ్డారు. హైదరాబాద్‌కు చేరువలోని బీదర్‌లో 11, తెలుగురాష్ట్రాల సరిహద్దులోని కలబురగి, బళ్లారిలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు 123కి చేరాయి. బీదర్‌కు చెందిన 11 మందీ దిల్లీ నుంచి వచ్చినవారే.ఇదే జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు (62) హైదరాబాద్‌లో మరణించారు. అయితే ఆయనకు కరోనా ఉందా.. లేదా అన్న విషయాన్ని అధికారులు ధ్రువీకరించలేదు.


ఒడిశాలో అయిదో కేసు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఒడిశాలో అయిదో కరోనా కేసు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ గురువారం ప్రకటించింది. భువనేశ్వర్‌కు చెందిన వ్యక్తి(60) కొద్దిరోజుల క్రితం చికిత్స కోసం ఎయిమ్స్‌లో చేరారు. ఆయన రక్తనమూనాలను పరీక్షించగా కరోనా నిర్ధారణ అయింది. మరో యువకుడికి నెగెటివ్‌ రావడంతో ఇంటికి పంపి, 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.