close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments
యువతా మేలుకో..!

కరోనాతో ఏమీ కాదనుకుంటే ముప్పే
త్వరలో యాంటీవైరల్స్‌ రాబోతున్నాయ్‌
అప్పటి వరకు మీ ప్రాణాలను రక్షించుకోండి
భారత్‌ నుంచీ కొత్త ఔషధం ప్రయోగ పరిశీలనలో ఉంది
పులిట్జర్‌ అవార్డు గ్రహీత, పద్మశ్రీ డాక్టర్‌ సిద్ధార్థ ముఖర్జీ

‘అమెరికాలోని న్యూయార్క్‌లో 35, 36 ఏళ్లున్న యువకులు సైతం కొవిడ్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. నా మిత్రుడు, పూర్తి ఆరోగ్యంగా ఉన్న యువ కార్డియాలజిస్టు మరణశయ్యపై ఉన్నాడు. ఫిజీషియన్‌గా పనిచేస్తున్న ఆయన భార్యకూ పాజిటివ్‌ వచ్చింది. ఈ మహమ్మారి మన భవిష్యత్తు ముఖచిత్రాన్ని మార్చకముందే ప్రతి ఒక్కరూ అప్రమత్తమై రక్షణాత్మక చర్యలు పాటించాలి. మీ కోసం సమయాన్ని కొనుక్కోండి/దాచి ఉంచుకోండని అమెరికాలో ఒక సామెత ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఇదే. అతి త్వరలో కొవిడ్‌కు మందులు రాబోతున్నాయి. అప్పటివరకు సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండండి. మీ ప్రాణాలను మీరే రక్షించుకోండి’ అని పులిట్జర్‌ అవార్డు గ్రహీత, పద్మశ్రీ డాక్టర్‌ సిద్ధార్థ ముఖర్జీ ప్రజలకు స్పష్టంచేస్తున్నారు. దిల్లీలో జన్మించి, ప్రస్తుతం న్యూయార్క్‌లో స్థిరపడిన సిద్ధార్థ ప్రపంచ ప్రఖ్యాత ఫిజీషియన్‌, క్యాన్సర్‌ వైద్యనిపుణుడు, బయాలజిస్టు. ఆయన రచించిన ‘ద ఎంపరర్‌ ఆఫ్‌ ఆల్‌ మెలాడీస్‌: ఎ బయాగ్రఫీ ఆఫ్‌ క్యాన్సర్‌’ పుస్తకం వైద్య రంగంలో సంచలనం సృష్టించింది. పులిట్జర్‌తోపాటు గార్డియన్‌ బుక్‌ అవార్డు సంపాదించింది. భారత ప్రభుత్వం సైతం పద్మశ్రీతో గౌరవించింది. ప్రస్తుతం కొలంబియా యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్న సిద్ధార్థ న్యూయార్క్‌లోనే ఉంటూ కొవిడ్‌పై పరిశోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎన్‌బీసీ టీవీ-18 ఆయనతో ఆన్‌లైన్‌లో ముఖాముఖి నిర్వహించింది. ప్రపంచమంతా కొవిడ్‌ గుప్పిట్లో చిక్కుకున్న తరుణంలో ప్రజలు, ముఖ్యంగా యువకులు తమకేమీ కాదనే నిర్లక్ష్యాన్ని వీడాలని హెచ్చరించారు.

న్యూయార్క్‌లో పరిస్థితి ఎలా ఉంది? మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పెద్ద సమస్య ఏమిటి?
ఇక్కడ భయానకంగా ఉంది. సకల సౌకర్యాలు ఉన్నా వైరస్‌ విజృంభణను కట్టడి చేయలేకపోతున్నాం. ఈ వైరస్‌కు సంబంధించి అతి ముఖ్యమైన లక్షణం... ఆర్‌-0 సంఖ్య. వైరస్‌ సోకిన వ్యక్తి ఎందరికి దాన్ని అంటిస్తాడనే దాన్ని ఇది సూచిస్తుంది. ఎలాంటి రక్షణ ఏర్పాట్లు చేసుకోని పక్షంలో కొవిడ్‌ ఆర్‌-0 విలువ 2-2.3. అంటే ఒక వ్యక్తి ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులకు వైరస్‌ను అంటిస్తాడు. ఇది మరింత పెరిగే ప్రమాదమూ ఉంటుంది. ఈ సంఖ్యను ఒకటి, అంతకంటే తక్కువకు తగ్గించడమే మన ప్రధాన లక్ష్యం కావాలి. అది సాధించాలంటే ప్రజలంతా భౌతిక దూరం, స్వీయ నిర్బంధం, దిగ్బంధం అనే మూడింటిని తప్పకుండా పాటిస్తూనే మాస్కులనూ ధరించాలి.

మొదట్లో డబ్ల్యూహెచ్‌వో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదంది. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా తయారైంది. అసలు ప్రజలు ఏంచేయాలి?
వైరస్‌ను అంచనా వేయడంలో మనం పూర్తిగా విఫలమయ్యాం. ముఖ్యంగా వైరస్‌ గుప్త వాహకుల సంఖ్యపై మనవద్ద సరైన సమాచారమే లేదు. కొవిడ్‌-19కి సంబంధించిన దగ్గు, జ్వరం... లాంటి ఎలాంటి లక్షణాలు వారిలో కనిపించవు. కానీ... వ్యాధిని మాత్రం ఇతరులకు చేరవేస్తూనే ఉంటారు. బస్సులో మన పక్కనే కూర్చున్న వ్యక్తి చూడటానికి ఆరోగ్యంగా కనిపించినా అతనిలో వైరస్‌ ఉండొచ్చు. ఒకవేళ ఆయన సాధారణంగా తుమ్మినా, దగ్గినా లక్షలాది వైరస్‌లు బయటికి వచ్చి ఇతరుల్లోకి చేరిపోతాయి. అందుకే ప్రతి ఒక్కరూ మాస్కులను తప్పనిసరిగా ధరించాల్సిందే. మాస్కుల తయారీపై యూట్యూబ్‌లో వేలాది వీడియోలు ఉన్నాయి. మన ఇంట్లో ఉండే కాటన్‌ దుస్తులు, గుడ్డలు, బెడ్‌షీట్లు, పిల్లో కవర్లు, టీషర్టులు, ఆఖరికి లోదుస్తులు... ఇలా దేన్నైనా వాడొచ్చు. అయితే వాటిని రెండు పొరలుగా కుట్టుకోవాలి. వాటిని ప్రతిరోజూ 70 డిగ్రీల వద్ద 30 నిమిషాలపాటు తప్పనిసరిగా వేడిచేయాలి.

ఎన్‌-95 మాస్కులు ఎవరెవరికి అందుబాటులో ఉంచాలి?
గాలిని వడబోయడంతోపాటు కొవిడ్‌ వాహకులు వదిలిన తుంపర్లలోని వైరస్‌ను అడ్డుకునే ఎన్‌-95 మాస్కుల పాత్ర వెలకట్టలేనిది. వీటిని వైద్యులు, నర్సులు, డయాగ్నస్టిక్‌ సిబ్బంది, బాధిత కుటుంబ సభ్యులకు తప్పనిసరిగా సమకూర్చాలి. మనం వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని రక్షించుకోవాలి. వారు జబ్బున పడకుండా... బాధితులు వైరస్‌ను వ్యాప్తి చేయకుండా ఎన్‌-95 మాస్కులు అడ్డుకుంటాయి. వీటిని తగినన్ని సమకూర్చకుండా వైద్యం చేయాలనడం అనైతికం.

ఔషధాలపై ప్రయోగ పరీక్షల మాటేమిటి?
ప్రపంచవ్యాప్తంగా 3-4 మందులపై పరిశోధనలు సాగుతున్నాయి. వాటిలో ఒకదానిపై భారత్‌ నుంచి కిరణ్‌ మజుందార్‌షాతో కలిసి నేను పనిచేస్తున్నా. దీనిపై అమెరికాలో ప్రయోగాలు సాగుతున్నాయి. ఫలితాలు ఈనెలాఖరుకు, మే ప్రథమార్ధం వరకు రావచ్చు. జూన్‌ వరకు ప్రయోగ పరీక్షలు పూర్తవుతాయి. అప్పటివరకు వైద్యులు, వైద్య సిబ్బందికి అన్నిరకాల రక్షణాత్మక సదుపాయాలు కల్పించాల్సిందే. టీకాలు రావడానికి 12-18 నెలలు పట్టొచ్చు.

భారత్‌లో అధిక వేడి, బీసీజీ టీకాలు ఏమైనా పనిచేస్తున్నాయా?
భారత్‌లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు తక్కువగానే జరుగుతున్నాయి. ప్రజలకు చేస్తున్న పరీక్షలు, నమోదు అవుతున్న కేసులు, మరణాలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటేనే తుది నిర్ణయానికి రావచ్చు.

వ్యక్తుల్లో వైరస్‌ ప్రవర్తనపై అధ్యయనానికి మీరు పట్టుబడుతున్నారు. ఎందుకు?
ప్రజలు, సమూహాల మధ్య కొవిడ్‌-19 ఎలా వ్యాప్తి చెందుతుందో అధ్యయనం చేయడం ఎంత ముఖ్యమో... ఒక వ్యక్తిలోకి చేరిన తర్వాత వైరస్‌ ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడమూ అంతే ముఖ్యం. ఈ వైరస్‌ వ్యక్తిలో ఎంత కాలం జీవించి ఉంటుంది? దాని సంఖ్యలో పెరుగుదల, తగ్గుదల ఎలా ఉంటుంది? అది వృద్ధి చెందే వివిధ దశల్లో ఇతరులకు సోకే గుణమెలా ఉంటుందనే ప్రశ్నలకు సమాధానాలను కనుగొంటే దీన్ని తగ్గించే ప్రభావవంతమైన మందును కనుగొనడానికి, మహమ్మారి విస్తరించకుండా సమాజాన్ని అప్రమత్తం చేయడానికి ఉపయోగపడతాయి.

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ సరఫరా చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌... భారత ప్రధాని మోదీని కోరడంతో దీనిపై విపరీతమైన చర్చ జరుగుతోంది. మీరేమంటారు?
కొవిడ్‌పై హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఇప్పటికే పరిశోధనలు జరిగాయి. అది అంత ప్రభావంతం కాదని, పలు వ్యతిరేక ప్రభావాలు(సైడ్‌ ఎఫెక్ట్స్‌) ఉన్నట్లు తేలింది. అందుకే ప్రయోగ పరీక్షలు పూర్తయ్యే వరకు ఈ మందును వాడకపోవడమే మేలు.

మున్ముందు ఏం జరగబోతోంది. మన ప్రజాప్రతినిధులు, అధికారులు ఎలా స్పందించనున్నారు?
ఈ మహమ్మారిపై తప్పకుండా సమీక్ష జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి సంక్షోభాలపై ముందస్తు హెచ్చరికల విభాగాలు ఏర్పాటవుతాయి. చైనాలో డిసెంబరు, జనవరి నెలల్లో ఏం జరుగుతుందో గమనించి అమెరికాలో అప్పుడే స్పందించాల్సి ఉన్నా మిన్నకున్నారు. దాని ఫలితంగానే భయంకర పరిస్థితి నెలకొంది. డబ్ల్యూహెచ్‌వోతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగాలను బలోపేతం చేయాల్సిన అవసరముంది.

(సీఎన్‌బీసీ టీవీ-18 సౌజన్యంతో...)

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.