close

ప్రధానాంశాలు

మరణ మృదంగం

అమెరికాలో 24 గంటల్లో 1,150 మరణాలు
ఒక్క న్యూయార్క్‌లోనే 731 మంది బలి
అగ్రరాజ్యంలో ప్రకాశం జిల్లా వ్యక్తి మృతి
మహమ్మారి గుప్పిట్లో అనేక మంది భారతీయ అమెరికన్లు
ఇటలీ, స్పెయిన్‌లలో కొనసాగుతున్న మరణాలు
భారత్‌లో 5 వేలకు చేరువగా కేసులు
న్యూయార్క్‌, లండన్‌, దిల్లీ

కరోనా దెబ్బకు యావత్‌ ప్రపంచానికి కంటి మీద కునుకు కరవవుతోంది. ఈ మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య నానాటికీ మరింత వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఐరోపా దేశాలతోపాటు అమెరికాలో కొవిడ్‌ మృత్యు మృదంగాన్ని మోగిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో 24 గంటల్లో 1,150 మరణాలు చోటుచేసుకున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. న్యూయార్క్‌, న్యూజెర్సీ రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో భారతీయ అమెరికన్లకు వైరస్‌ సోకడం ఆందోళన కలిగిస్తోంది. న్యూయార్క్‌లో స్థిరపడ్డ తెలుగు వ్యక్తి ఒకరు ఈ మహమ్మారి కాటుకు తాజాగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారిన పడ్డ బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తుండటంతో.. ఆయన ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కరోనా పుట్టిల్లు చైనాలో తాజాగా కొత్త మరణాలేవీ నమోదు కాకపోవడమొక్కటేే కాస్త ఊరట కలిగించే అంశం.తొలిసారి కొత్తగా వైరస్‌ సంబంధిత మరణాలేవీ నమోదు కాకపోవడం వైరస్‌పై పోరులో గొప్ప మైలురాయిగా అక్కడి అధికారవర్గాలు దీన్ని అభివర్ణిస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చినవారిలో 32 మందికి కరోనా సోకినట్లు తాజాగా నిర్ధారణ కావడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. వ్యాధి లక్షణాల్లేనప్పటికీ ‘పాజిటివ్‌’గా తేలిన కేసులు మరో 30 నమోదయ్యాయి. కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సగం మందికిపైగా జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఫ్రాన్స్‌లో సోమవారం ఒక్కరోజే 833మంది మరణించగా.. స్పెయిన్‌లో 24 గంటల్లో 743 మంది మృత్యువాతపడ్డారు. ఇటలీలో మృతుల సంఖ్య వరుసగా 2 రోజులు తగ్గినట్లు కనిపించినా.. మంగళవారం మళ్లీ పెరిగింది. బ్రిటన్‌లో జులై నాటికి కరోనా దెబ్బకు 66వేల మంది మరణించే ముప్పుందని తాజా అధ్యయనమొకటి అంచనా వేసింది.

భారత సంతతి వైద్యుడి మృతి
కరోనా సోకి బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన సీనియర్‌ వైద్యుడు, వేల్స్‌ విశ్వవిద్యాలయ ఆస్పత్రి(యూహెచ్‌డబ్ల్యూ)లోని కార్డియో-థొరాసిక్‌ శస్త్రచికిత్స విభాగంలో అసోసియేట్‌ నిపుణుడిగా పనిచేస్తున్న జితేంద్ర కుమార్‌ రాఠోడ్‌.. కార్డిఫ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

జపాన్‌లో ఆత్యయిక స్థితి
కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకుగాను జపాన్‌లో నెల రోజులపాటు ఆత్యయిక స్థితిని విధించారు. ఆర్థిక వ్యవస్థకు తిరిగి ఊపిరులూదేందుకుగాను లక్ష కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఉక్రెయిన్‌లో ముందే సమాధులు సిద్ధం
ఉక్రెయిన్‌లోని డినిప్రో నగరంలో 615సమాధులను ముందే తవ్వారు. మృతదేహాలను ఉంచేందుకు 2వేల సంచులను సిద్ధం చేశారు. డినిప్రోలో ఇప్పటివరకు 13మందికి కరోనా సోకింది. ఒక్క మరణంకూడా చోటుచేసుకోకున్నా సమాధులను సిద్ధం చేయడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

న్యూయార్క్‌లో మృత్యుహేల
అమెరికాలో కరోనా వైరస్‌కు కేంద్ర బిందువుగా ఉన్న న్యూయార్క్‌ రాష్ట్రంలో మృత్యు హేల కొనసాగుతోంది. ఇక్కడ 24 గంటల్లో 731 మందిని ఈ మహమ్మారి బలితీసుకుంది. దీంతో ఈ వైరస్‌ బారినపడి ఇక్కడ మరణించిన వారి సంఖ్య 5,489కు చేరింది. ఒక్క న్యూయార్క్‌ నగరంలోనే 2,738 మంది ప్రాణాలు కోల్పోయారు.

వైరస్‌ బారినపడ్డ అనేకమంది భారత అమెరికన్లు
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న అమెరికాలో భారతీయులు అనేక మంది ఈ వైరస్‌ కోరల్లో చిక్కారు. న్యూయార్క్‌, న్యూజెర్సీ రాష్ట్రాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అమెరికా మొత్తంలో ఈ రెండు రాష్ట్రాల్లోనే భారతీయులు ఎక్కువగా ఉన్నారు. తమ వారికి కరోనా సోకిందని భారతీయుల నుంచి తమకు ఫోన్‌కాల్స్‌ వస్తున్నట్లు ప్రవాస భారతీయ సంఘాల నేతలు చెప్పారు. ఈ సంఘాల నాయకుల్లోనూ అనేక మందికి కొవిడ్‌-19 సోకింది.
* భారత సంతతికి చెందిన అమెరికన్‌ వైద్యుల సంఘం (ఏఏపీఐ) మాజీ అధ్యక్షుడొకరు ఈ మహమ్మారి బారినపడి ఐసీయూలో చేరారు.
* హ్యూస్టన్‌లో పనిచేసే ఐటీ నిపుణుడు రోహన్‌ బావేడ్కర్‌ ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆయనకు సహాయం చేయడానికి భారత అమెరికన్లు 2.04 లక్షల డాలర్ల మేర విరాళాలను సేకరించారు. రోహన్‌ భార్యకు, ముగ్గురు సంతానానికీ కరోనా ‘పాజిటివ్‌’ వచ్చింది.
* ఈ వైరస్‌తో కేరళకు చెందిన నలుగురు భారత అమెరికన్లు మరణించారు.
* సిలికాన్‌ వ్యాలీలో భారత అమెరికన్‌ ఐటీ ఇంజినీర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా సోకింది.
* మయామీ వ్యాలీ ఆసుపత్రిలో హృద్రోగ విభాగంలో మెడికల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ముకుల్‌ ఎస్‌ చంద్ర.. వెంటిలేటర్‌పై ఉన్నారు.

ఎంపీల అలవెన్సుల్లోనూ 30% కోత
పార్లమెంటు సభ్యుల జీతాల్లో 30% కోత విధించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించిన మరుసటి రోజే వారి భత్యాల్లోనూ అదే స్థాయిలో కోతపెట్టడానికి పార్లమెంటు కమిటీ ఆమోదముద్ర వేసింది. దీనివల్ల ఒక్కో ఎంపీకి నెలకు రూ.27,000 మేర భత్యం తగ్గనుంది. ఎంపీలకు నియోజకవర్గ భత్యం కింద ఇచ్చే రూ.70,000లో 30% లెక్కన రూ.21,000 కోత విధించనున్నారు. అలాగే స్టేషనరీ అలవెన్సు రూ.20వేలను రూ.14వేలకు తగ్గించారు. పీఏలకు ఇచ్చే రూ.40వేలలో మాత్రమే ఎలాంటి కోత విధించలేదు. కమిటీ సిఫార్సులను రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆమోదించారు. ఈ నెల 1 నుంచే ఇది అమల్లోకి వస్తుంది.


దేశంలో ఒక్కరోజులోనే 500కు పైగా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఐదు వేలకు చేరువవుతున్నాయి. ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం మంగళవారం నాటికి కేసులు 4,789, మృతుల సంఖ్య 124గా ఉంది. ఒక్క రోజులోనే 500కు పైగా కేసులు నమోదయ్యాయి. వివిధ రాష్ట్రాలు తమ పరిధిలో ప్రాంతాలవారీగా వైరస్‌ ఉద్ధృతిని కట్టడి చేసే వ్యూహాలకు పదునుపెట్టాయి. ప్రాంతాలవారీ కట్టడి చర్యలు యూపీ, కేరళ, రాజస్థాన్‌ తదితర చోట్ల ఆశించిన ఫలితాన్ని ఇచ్చాయని, అవసరమైన ఇతర జిల్లాల్లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ చెప్పారు.


ఐసీయూలోనే బ్రిటన్‌ ప్రధాని

కొవిడ్‌ బారిన పడ్డ బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ లండన్‌లోని ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ముందుజాగ్రత్త చర్యగా ఐసీయూలోకి మార్చినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం జాన్సన్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపాయి. ఆయన వెంటిలేటర్‌పై లేరని స్పష్టం చేశాయి. అయితే- సోమవారం రాత్రి కొద్దిసేపు కృత్రిమ విధానంలో ప్రాణ వాయువును అందించినట్లు పేర్కొన్నాయి.


అమెరికాలో ప్రకాశం జిల్లా వాసి మృతి

పర్చూరు, న్యూస్‌టుడే: కరోనాతో ప్రకాశం జిల్లా పర్చూరు మండలం ఏదుబాడు గ్రామానికి చెందిన కంచిభొట్ల బ్రహ్మానందం(63) అమెరికాలో మృతి చెందారు. ఆయన ప్రముఖ పాత్రికేయుడిగా గుర్తింపు పొందారు. రాష్ట్రంలో ఓ ఆంగ్లపత్రిక పాత్రికేయునిగా జీవితం ప్రారంభించిన ఆయన.. తరువాత పలు పత్రికల్లో పనిచేశారు. ఆంగ్ల వార్తా సంస్థ యూఎన్‌ఐలోనూ పనిచేశారు. తర్వాత అమెరికా వెళ్లారు. కుటుంబంతో సహా న్యూయార్క్‌లో  స్థిరపడ్డారు. అక్కడ ఓ ప్రముఖ పత్రికలో పని చేస్తున్నారు. పది రోజుల క్రితం కరోనా బారిన పడ్డ ఆయన.. సోమవారం సాయంత్రం మృతి చెందినట్లు ఏదుబాడులోని బంధువులకు సమాచారం అందింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.