close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఒక్కడు.. 10 హత్యలు

మొదటి ఘాతుకాన్ని కప్పి పుచ్చేందుకు కిరాతకం
గొర్రెకుంట సంచలన కేసులో నిందితుడు సంజయ్‌ అరెస్టు

ఈనాడు, వరంగల్‌- న్యూస్‌టుడే, వరంగల్‌ క్రైం: ముగ్గురు పిల్లలున్న ఓ మహిళతో సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అంతేకాకుండా.. ఆమె పెద్దకుమార్తెపైనా కన్నేశాడు. తనను మనువాడతానని చెప్పి కుమార్తెతో అసభ్యకరంగా ప్రవర్తించడమేంటని నిలదీసినందుకు ఆ మహిళను హతమార్చాడు. ఆమె కోసం బంధువులు ప్రశ్నించడంతో నేరం ఎక్కడ బయటపడుతుందోనని ఏకంగా 9 మందిని జలసమాధి చేశాడు. వరంగల్‌ గొర్రెకుంట గోనె సంచుల గోదాము వద్ద పాడుబడ్డ బావిలో 9 మంది విగతజీవులుగా తేలిన కేసు మిస్టరీని వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు 72 గంటల్లో ఛేదించారు. ఒకే బావిలో రెండ్రోజుల వ్యవధిలో 9 మృతదేహాలు బయటపడటంతో ఈ కేసు సంచలనంగా మారింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీలు, కాల్‌డేటా ఆధారంగా నిందితుడు సంజయ్‌ కుమార్‌ యాదవ్‌(24)ను సోమవారం అరెస్టు చేశారు. పోలీసు కమిషనర్‌ వి.రవీందర్‌ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

పరిచయం చేసుకుని పాగా...
బిహార్‌ రాష్ట్రం బిగుసరయి జిల్లా నుర్లపూర్‌ గ్రామం నుంచి సంజయ్‌కుమార్‌ యాదవ్‌ ఆరేళ్ల కిందట ఉపాధి కోసం వరంగల్‌కు వచ్చాడు. మిల్స్‌కాలనీ ప్రాంతంలోని శాంతినగర్‌లో గోనెసంచుల తయారీ కేంద్రంలో పనిచేసేవాడు. ఇక్కడ మక్సూద్‌ కుటుంబ సభ్యులతో పరిచయం ఏర్పడింది. వీరితోపాటే మక్సూద్‌ భార్య నిషా అక్క కూతురైన రఫికా(37)తో పాటు, ఆమె ముగ్గురు పిల్లలు ఉండేవారు. రఫికా భర్త చనిపోయాడు. సంజయ్‌ ఆమెతో సన్నిహితంగా ఉంటూ డబ్బులిచ్చి అక్కడే భోజనం చేసేవాడు. తర్వాత గీసుకొండ మండలం జాన్‌పాక వద్ద ఇల్లు అద్దెకు తీసుకొని వీరిద్దరూ సహజీవనం ప్రారంభించారు. ఈ క్రమంలో రఫికా కుమార్తెతో సంజయ్‌ అసభ్యకరంగా ప్రవర్తించడంతో పలుమార్లు హెచ్చరించింది. పద్ధతి మార్చుకొని తనను పెళ్లిచేసుకోవాలని, లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న సంజయ్‌ పశ్చిమ బెంగాల్‌కు వెళ్లి పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకుందామని మార్చి 6న వరంగల్‌ నుంచి గరీభ్‌ రథ్‌లో బయలుదేరారు. అర్ధరాత్రి సమయంలో రఫికాకు మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. ఆమె నిద్రమత్తులో ఉండగా వేకువజామున 3 గంటల సమయంలో గొంతుకు చున్నీ బిగించి ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు సమీపంలో రైలు నుంచి తోసేయడంతో రఫికా మరణించింది. సంజయ్‌ రాజమహేంద్రవరం స్టేషన్‌లో దిగి,  మరో రైల్లో వరంగల్‌కు వచ్చాడు. రఫికా పశ్చిమ బెంగాల్‌కు వెళ్లిందంటూ పిల్లలను నమ్మించాడు. కొద్దిరోజుల తర్వాత అనుమానం వచ్చిన మక్సూద్‌ భార్య నిషా రఫికా విషయమై సంజయ్‌ను నిలదీసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. పదేపదే రఫికా గురించి నిషా అడుగుతుండటంతో సంజయ్‌ ఆమెను కూడా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. మే 16 నుంచి 20 వరకు మక్సూద్‌ ఇంటికి పలుమార్లు వెళ్లి హత్యకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. 18న వరంగల్‌ చౌరస్తాలోని ఒక మెడికల్‌ షాపులో 60కి పైగా నిద్రమాత్రలు కొనుగోలు చేసి పెట్టుకున్నాడు. 20న మక్సూద్‌ పెద్ద కొడుకు షాబాద్‌ పుట్టినరోజు కావడంతో సాయంత్రం 7.30 గంటల సమయంలో సైకిల్‌పై గోదాముకు వెళ్లి, మక్సూద్‌ కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా వాళ్లు వండుకున్న పప్పులో నిద్రమాత్రలు కలిపాడు. మక్సూద్‌ కుటుంబ సభ్యులతో పాటు విందుకు వచ్చిన షకీల్‌ కూడా భోజనం చేయడంతో మత్తులోకి జారుకున్నారు. వీరితోపాటు గోదాముపైన నివాసం ఉంటున్న బిహార్‌కు చెందిన శ్యాం, శ్రీరాం వండుకున్న భోజనంలోనూ నిద్రమాత్రలు కలపడంతో వారు గాఢ నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత మత్తులో ఉన్న మొత్తం 9 మందిని గోనె సంచుల సాయంతో తీసుకెళ్లి బావిలో పడేశాడు. వారంతా చనిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత ఇంట్లో ఉన్న కిరాణా సామగ్రితో, షకీల్‌ పర్సు, వారి సెల్‌ఫోన్లను తీసుకొని ఖిలా వరంగల్‌ మండలం ఆదర్శనగర్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు. సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడి జాడ గుర్తించారు.

సిబ్బందికి అభినందనలు
కేసును ఛేదించేందుకు ఆరు బృందాలను నియమించి పలు కోణాల్లో దర్యాప్తు చేసి క్లూస్‌ టీం ద్వారా పలు ఆధారాలు సేకరించి సంజయ్‌ ఒక్కడే హత్యకు పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేశామని కమిషనర్‌ రవీందర్‌ తెలిపారు. ఈ మిస్టరీని ఛేదించడంలో కృషి చేసిన ఈస్ట్‌జోన్‌ ఇన్‌ఛార్జి డీసీపీ వెంకటలక్ష్మి, మామునూరు ఏసీపీ శ్యాంసుందర్‌, గీసుకొండ ఇన్‌స్పెక్టర్‌ శివరామయ్య, పర్వతగిరి ఇన్‌స్పెక్టర్‌ కిషన్‌, టాస్క్‌ఫోర్స్‌, సైబర్‌క్రైం, ఐటీకోర్‌ ఇన్‌స్పెక్టర్లు నందిరాంనాయక్‌, జనార్దన్‌రెడ్డి, సీసీఎస్‌ ఏఎస్‌ఐ శివకుమార్‌ను కమిషనర్‌ రవీందర్‌ అభినందించారు. అతి తక్కువ సమయంలో కేసును ఛేదించిన కమిషనర్‌, ఆయన బృందాన్ని హోం మంత్రి మహమూద్‌ అలీ అభినందించారు.


అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

నిడదవోలు, న్యూస్‌టుడే: గొర్రెకుంట హత్యల కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. రఫికాను నిందితుడు సంజయ్‌ రైలులో హత్య చేసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నిడదవోలు సమీపాన చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం రైల్వేస్టేషన్‌ వద్ద పడేశాడు. అప్పట్లో రైల్వే పోలీసులు ఈ ఘటనపై గుర్తుతెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని ఖననం చేసి నమూనాలను ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపారు. నివేదిక రావాల్సి ఉందని రైల్వే పోలీసులు తెలిపారు. గొర్రెకుంట హత్యల ఉదంతంతో ఈ కేసులో మృతురాలి వివరాలు వెలుగు చూశాయి.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.