close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాత్రిపూటా ‘రైట్‌ రైట్‌’!

ఆర్టీసీకి కర్ఫ్యూ నుంచి మినహాయింపు
సిటీ బస్సులకు అనుమతి నిరాకరణ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు, గురువారం నుంచి రాత్రివేళల్లోనూ నడిచేందుకు అనుమతిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులు ప్రస్తుతం జేబీఎస్‌లోనే ప్రయాణికులను దింపుతున్నాయి. గురువారం నుంచి ఇమ్లీబన్‌కు కూడా బస్సులు నడుపుతారు. హైదరాబాద్‌లో మరికొన్ని రోజుల వరకు సిటీ బస్సులను అనుమతించరు. అంతర్రాష్ట్ర బస్సులను కూడా మరికొన్ని రోజుల పాటు నడపరు. ఆర్టీసీపై సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, ఈడీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
రోజుకు రూ.2 కోట్ల ఆదాయమే
‘ఇటీవలి పరిణామాల వల్ల ఆర్టీసీ బాగా నష్టపోయింది. కొద్ది రోజుల క్రితం ఆర్టీసీ బస్సులు నడవడానికి అవకాశం ఇచ్చినప్పటికీ రాత్రిపూట కర్ఫ్యూ కారణంగా పూర్తిస్థాయిలో తిరగడం లేదు. ఆర్టీసీకి రోజుకు రూ.11 నుంచి రూ.12 కోట్ల వరకు ఆదాయం రావాలి. ఇప్పుడు రూ. 2 కోట్లు మాత్రమే వస్తోంది. 39 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే సాధ్యమవుతోంది. ఎండాకాలంలో పగటిపూట మాత్రమే బస్సులు నడపడం వల్ల ప్రజలకు ఉపయోగపడడం లేదు’ అని ఆర్టీసీ అధికారులు చెప్పారు. దీంతో సీఎం స్పందించి రాత్రిపూట బస్సులు నడిపేందుకు అనుమతి ఇచ్చారు. బస్టాండ్లలో ట్యాక్సీలు, ఆటోలు తదితర రవాణా వాహనాలను అనుమతిస్తారు. బస్సు టికెట్‌ కలిగిన ప్రయాణికులు కర్ఫ్యూ సమయంలోనూ ప్రైవేటు వాహనాల్లో తమ ఇళ్లకు చేరుకోవడానికి పోలీసులు అభ్యంతరం తెలపరు.
మాల్స్‌ మినహా అన్ని దుకాణాలకు అనుమతి
హైదరాబాద్‌ నగరంలో గురువారం నుంచి మాల్స్‌ మినహా అన్ని రకాల దుకాణాలు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నగరంలో సరి, బేసి విధానంలో దుకాణాలు తెరిచే నిబంధనల నుంచి వెసులుబాటు కల్పించింది. బుధవారం రాత్రి జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత విధానంలో ఒకే దుకాణంలో ఎక్కువ మంది గుమిగూడే ప్రమాదం ఉన్నందున, ఎక్కువ షాపులు తెరిస్తే సమస్య ఉండదని అభిప్రాయపడ్డారు.
నిరాడంబరంగా రాష్ట్రావతరణ వేడుకలు
రాష్ట్రావతరణ వేడుకలను ఈసారి నిరాడంబరంగా జరపాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించడం, జాతీయ పతాకావిష్కరణ జరపడం మాత్రమే నిర్వహించాలన్నారు. మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ కార్యాలయాల్లోనే జాతీయ పతాకావిష్కరణ చేయాలని, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని చెప్పారు. జూన్‌ రెండో తేదీన సీఎం కేసీఆర్‌ ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించి, అనంతరం ప్రగతిభవన్‌లో పతాకావిష్కరణ చేస్తారు. అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ముందుగా అమరవీరులకు నివాళి అర్పించి, అనంతరం పతాకావిష్కరణ చేస్తారు. జిల్లా కేంద్రంలో ముఖ్యమైన అధికారులతో చిన్నపాటి తేనీటి విందు నిర్వహిస్తారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.