close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కట్టడి ప్రాంతాల్లోనే లాక్‌డౌన్‌

జూన్‌ 30 వరకు నిర్బంధం... కంటెయిన్‌మెంట్‌ జోన్లకే పరిమితం
అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతులు అక్కర్లేదు
8 నుంచి తెరుచుకోనున్న ప్రార్థన స్థలాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్‌
విద్యాసంస్థలపై జులైలో నిర్ణయం
లాక్‌డౌన్‌ 5.0 నిబంధనలు జారీ చేసిన కేంద్రం

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం 5వ విడత లాక్‌డౌన్‌ను నామమాత్రంగా అమలు చేయడానికి సిద్ధమైంది. కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కకావికలమైన తరుణంలో దాన్ని మళ్లీ గాడిలో పెట్టి, సాధారణ పరిస్థితులను తీసుకొచ్చే పంథాను ఎంచుకొంది. జూన్‌ 1 నుంచి 30 వరకు లాక్‌డౌన్‌-5.0ను కంటెయిన్‌మెంట్‌ జోన్ల వరకు పరిమితం చేసి, మిగిలిన ప్రాంతాల్లో అన్నిరకాల కార్యకలాపాలనూ అనుమతించనుంది. ప్రార్థన స్థలాలు, షాపింగ్‌ మాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకోవడానికి పచ్చజెండా ఊపింది. అయితే కేంద్రం జారీ చేసే ప్రామాణిక నిర్వహణ విధానాలను తప్పనిసరిగా అమలు చేయాలి. విద్యాసంస్థల పునః ప్రారంభంపై మాత్రం జులైలో నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. లాక్‌డౌన్‌ 4.0 గడువు ఆదివారంతో ముగుస్తున్న నేపథ్యంలో ‘‘ప్రకృతి వైపరీత్య నిర్వహణ చట్టం’’ కింద కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా శనివారం సాయంత్రం తాజా నిబంధనలను జారీ చేశారు. మూడు దశల కార్యాచరణను కేంద్రం ప్రకటించింది.

కంటెయిన్‌మెంట్‌ జోన్లలో అత్యవసర పనులకే అవకాశం
కంటెయిన్‌మెంట్‌ జోన్లలో అత్యవసర కార్యకలాపాలనే అనుమతించాలి. అవి మినహాయించి ఇక్కడి ప్రజలు బయటకు రాకపోకలు సాగించడానికి వీల్లేదు. ఇక్కడ కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ కార్యక్రమాలను ఉద్ధృతంగా చేపట్టాలి. ప్రతి ఇంటిపై నిఘా ఉంచాలి. వైద్యపరంగా అవసరమైన చర్యలు తీసుకోవాలి.
* కంటెయిన్‌మెంట్‌ జోన్ల బయట కొత్త కేసులు రావడానికి అవకాశమున్న ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వాలు బఫర్‌ జోన్లుగా గుర్తించవచ్చు. అవసరం అనుకున్న ఆంక్షలను జిల్లా అధికారులు విధించొచ్చు.
* కంటెయిన్‌మెంట్‌ జోన్ల బయట కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కార్యకలాపాలను నిషేధించడంతో పాటు, తాము అవసరమని భావించిన ఆంక్షలు విధించుకోవచ్చు.

రాష్ట్రాల మధ్య రాకపోకలకు పచ్చజెండా
అంతర్రాష్ట్ర రాకపోకలపై ఉన్న ఆంక్షలను హోంశాఖ ఎత్తేసింది. ఇకమీదట వేర్వేరు రాష్ట్రాలు/ జిల్లాల మధ్య వ్యక్తుల, సరకుల రాకపోకలపై ఎవరూ ఎలాంటి ఆంక్షలు విధించడానికి వీల్లేదు. ప్రత్యేక అనుమతులు, ఈ-పర్మిట్లు అవసరం లేదు.
* ఏ రాష్ట్రమైనా స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆంక్షలు విధించాలనుకుంటే దాని గురించి ముందుగానే విస్తృత ప్రచారం చేయాలి.
* ప్రయాణికుల రైళ్లు, శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు, దేశీయ విమాన ప్రయాణాలు, విదేశాల బయట నిలిచిపోయిన భారతీయులు స్వదేశానికి రావడం, నిర్దిష్టమైన వ్యక్తులు ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లడం, విదేశీయుల తరలింపు, భారతీయ నావికుల రాకపోకలు మాత్రం ప్రామాణిక పద్ధతుల ప్రకారం పరిమితంగానే కొనసాగుతాయి.
* దేశ భూ సరిహద్దుల నుంచి వచ్చే సరకు రవాణా వాహనాలను ఏ రాష్ట్రం నియంత్రించడానికి వీల్లేదు.
* 65 ఏళ్ల పైబడిన వృద్ధులు, అనారోగ్య సమస్యలున్నవారు, గర్భిణులు, పదేళ్ల లోపు చిన్నారులు ఇంట్లోనే ఉండటం మంచిది. అత్యవసర, ఆరోగ్యపరమైన పనులుంటే తప్ప బయటికి రావొద్దు.
* మార్గదర్శకాలను రాష్ట్రాలు నీరుగార్చడానికి వీల్లేదు. జిల్లా కలెక్టర్లు వీటిని కఠినంగా అమలు చేయాలని కేంద్రం పేర్కొంది.


షరతులు వర్తిస్తాయి

యటకు వచ్చే వారందరూ మాస్కులు వాడాలి. ఆరడుగుల భౌతిక దూరం పాటించాలి. దుకాణాల్లోకి ఒకసారి ఐదుగురిని మించి రానివ్వకూడదు. సభలు, సమావేశాలపై నిషేధం కొనసాగుతుంది. వివాహ సంబంధ కార్యక్రమాల్లో 50 మంది, అంత్యక్రియల్లో 20 మందికి మించి పాల్గొనకూడదు. బహిరంగంగా ఉమ్మివేయడం, మద్యం సేవించడం, పాన్‌, గుట్కా, పొగాకు నమలడం నిషిద్ధం. సాధ్యమైనంత మేరకు ఇంటి నుంచి పనిచేయడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. దుకాణాలు, మార్కెట్లు, పరిశ్రమలు, వాణిజ్య ప్రాంతాల్లో వ్యక్తులు దశలవారీగా వచ్చి వెళ్లడానికి వీలు కల్పించాలి. ఉమ్మడి ప్రాంతాల ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరి. పని ప్రాంతాల్లో తరచూ వైరస్‌ నిర్మూలన రసాయనాలు పిచికారీ చేయాలి. పనిచేసే చోట్ల భౌతిక దూరం పాటించేలా చూసే బాధ్యత అక్కడి ఇన్‌ఛార్జిలదే.


1వ దశ

* దేశమంతటా కర్ఫ్యూ రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకే అమలవుతుంది. అత్యవసర కార్యకలాపాలకు మినహాయింపు ఉంటుంది.


2వ దశ

రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాత విద్యాసంస్థలు, కోచింగ్‌ కేంద్రాలు తెరవడంపై జులైలో నిర్ణయం తీసుకుంటారు. భౌతిక దూరంతో పాటు, కొవిడ్‌-19 నియంత్రణకు కేంద్రం జారీ చేసే సూచనలను విద్యాసంస్థలన్నీ తప్పనిసరిగా పాటించాలి.
* ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా రాష్ట్రాలు, జిల్లాల మధ్య ప్రజలు రాకపోకలు సాగించవచ్చు. దీనికి ఎవరూ అడ్డుచెప్పడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి వాటిని నియంత్రించాలనుకుంటే మాత్రం ముందుగా చెప్పి చేయాలి.


3వ దశ

అంతర్జాతీయ ప్రయాణాలపై జూన్‌ 30 వరకు నిషేధం కొనసాగుతుంది. మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, వ్యాయామశాలలు, ఈత కొలనులు, వినోద పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియాలు; సమావేశ మందిరాలు, సామాజిక, రాజకీయ, క్రీడ, వినోద, విద్య, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలు; భారీ సదస్సుల నిర్వహణపై పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.