close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పాలనకు కొత్త ఠీవి

ఆరంతస్తులు.. ఆరు లక్షల చ.అడుగుల్లో సచివాలయ నిర్మాణం
అంచనా వ్యయం రూ. 400 కోట్లకు పైనే
5 నుంచి 20 నెలల్లో పూర్తికి ప్రణాళిక
ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌ భవనంలా రూపకల్పన
భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు
ఈనాడు - హైదరాబాద్‌

అత్యాధునిక హంగులు.. అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పచ్చదనానికి పెద్దపీట వేస్తూ.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ.. రాష్ట్రానికే దిగ్గజ భవనంగా గుర్తింపు పొందేలా దీనిని తీర్చిదిద్దాలని భావిస్తోంది. వాస్తుదోషాలకు అవకాశం లేకుండా ఉండాలని నిర్ణయించింది. తెలంగాణ ఆవిష్కరణకు గుర్తుగా కొత్త సచివాలయాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అయిదారేళ్లుగా యోచిస్తున్నారు. పాత సచివాలయంలోని భవనాల కూల్చివేత ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కొత్త సచివాలయ భవన నిర్మాణ నమూనాను ప్రభుత్వం విడుదల చేసింది. పాత సచివాలయంలో భవనాలు అక్కడొకటి అక్కడొకటి చొప్పున విసిరేసినట్లుగా ఉన్నాయని, ఒక భవనం నుంచి మరో భవనానికి ఫైళ్లు తీసుకెళ్లేందుకు కూడా ఇబ్బందికరంగా ఉందని దీనిపై అధ్యయనం చేసిన ఉన్నతాధికారుల కమిటీ నివేదిక ఇచ్చింది. దీంతో నూతన భవన నిర్మాణం అవసరమని ప్రభుత్వం నిర్ణయించింది. ముంబయికి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్‌ హఫీజ్‌ కాంట్రాక్టర్‌ కొన్ని నమూనాలు రూపొందించారు.
అలాగే మరికొందరు ఆర్కిటెక్టులు కూడా స్వచ్ఛందంగా కొన్ని నమూనాలను ప్రభుత్వానికి పంపారు. మొత్తం 10 నమూనాలు పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాటిలో చెన్నైకు చెందిన ఆస్కార్‌ అండ్‌ పొన్నీ సంస్థ రూపొందించిన నమూనాకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ఫ్రాన్స్‌లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌ భవనం స్ఫూర్తితో ఈ నమూనాను రూపొందించారు
భవిష్యత్తు అవసరాల మేరకు..
ప్రసుత ప్రాంగణంలోని భవనాలు 9.16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. మూడున్నర లక్షల చదరపు అడుగుల్లో తెలంగాణ రాష్ట్ర కార్యకలాపాలను సాగేవి. సమావేశాలు నిర్వహించటానికి సరైన సదుపాయం ప్రస్తుతం లేదు. అంతర్జాతీయ అతిథులు వచ్చిన సందర్భాల్లో అత్యున్నత స్థాయి సమావేశ నిర్వహణకు వెసులుబాటు కూడా లేదు. నూతన నిర్మాణంలో వాటన్నింటికి అవకాశం కల్పించాలని నిర్ణయించింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త సచివాలయాన్ని ఆరు అంతస్తుల్లో 6 నుంచి 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అవసరమైతే ఒకే దఫా రెండు హెలికాప్టర్లు దిగేందుకు వీలుగా సదుపాయాలను ఏర్పాటు చేస్తారు.

పచ్చదనం.. ఫౌంటెన్లు..
కొత్త నిర్మాణం పూర్తికావడానికి 15 నుంచి 20 నెలలు పట్టవచ్చని అంచనా. నిర్మాణ వ్యయం రూ. 400 కోట్లు దాటవచ్చని భావిస్తున్నారు. భవన నిర్మాణాలన్నింటినీ ఆరేడు ఎకరాల్లో పూర్తి చేసి మిగతా ప్రాంతంలో పచ్చదనానికి ప్రాధాన్యం ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. వాటర్‌ ఫౌంటెన్లను ఏర్పాటు చేస్తారు. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ప్రాంతాన్ని నిర్దేశిస్తారు. అలాగే సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.
భూకంపాలను తట్టుకునేలా..
హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలు భూకంప ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. కొత్త సచివాలయ భవనాన్ని భూకంపాలను తట్టుకునే సామర్థ్యంతో నిర్మిస్తారు. భద్రతా ఏర్పాట్లు, అగ్నిప్రమాద నియంత్రణ ఏర్పాట్లు కూడా అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఉండాలన్నది ప్రణాళిక.


కొత్త భవనం ప్రత్యేకతలివి..

* ఫ్రాన్స్‌లోని ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌ భవనం స్ఫూర్తితో కొత్త నమూనా రూపొందించారు
* హుస్సేన్‌సాగర్‌ మీదుగా వచ్చే గాలులు భవనంలోకి ప్రవేశించేలా నిర్మిస్తారు
* భవన సముదాయం గ్రీన్‌ బిల్డింగ్‌ ప్రమాణాలతో ఉంటుంది
* విద్యుత్తు వినియోగం మొత్తం స్మార్ట్‌ బిల్డింగ్‌ తరహాలో ఉంటుంది. వీలైనంతగా సోలార్‌ పవర్‌ వినియోగిస్తారు
* 800 కార్లు పార్కింగ్‌ చేసుకునే సౌకర్యం ఉంటుంది
* మొత్తం స్థల విస్తీర్ణంలో 80 శాతం పచ్చదనం ఉండేలా చూస్తారు


ప్రత్యేకం.. ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయ నూతన భవన సముదాయానికి ఫ్రాన్స్‌కు చెందిన ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌ని స్ఫూర్తిగా తీసుకోవటం విశేషం. 1623లో రాజు లూయీస్‌-13 ఈ ప్యాలెస్‌ను నిర్మించారు. ఈ భవనం అద్భుతమైన ఆకృతితో అడుగడుగునా కళాత్మకతతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది సందర్శకులను ఆకట్టుకుంటుంది. రాజు లూయీస్‌-13 వేటకు వెళ్లిన సందర్భంలో విడిది చేసేందుకు ఈ నిర్మాణాన్ని చేపట్టారు. వర్సైల్స్‌ గ్రామ సమీపంలో ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్యాలెస్‌లో 700 గదులున్నాయి. ఆనాటి ఫ్రెంచి విప్లవానికి ఇది ప్రత్యక్ష సాక్షిగా  నిలిచింది.  ఫ్రెంచి విప్లవం తరవాత కూడా ఇది ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదిక అయింది. మొదటి ప్రపంచ యుద్ధం అధికారిక ముగింపు ఒప్పందం 1919 జూన్‌ 28న ఈ ప్యాలెస్‌లోని హాల్‌ ఆఫ్‌ మిర్రర్స్‌లో జరగటం విశేషం.


ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.